పూవులాంటి మోముకు...

14 Oct, 2015 23:57 IST|Sakshi
పూవులాంటి మోముకు...

బ్యూటిప్స్

ముఖారవిందానికి ఎన్నోరకాల ఫేస్‌ప్యాక్స్ వేసుకుంటుంటారు. పండ్లనీ, కాయలనీ ఇంకా ఏవేవో క్రీములతో ప్యాక్స్ వేసుకోవడం విన్నాం. కానీ ఈ కింది ప్యాక్స్ వాడి చూడండి. జిడ్డుతనం, మొటిమలు, మచ్చలు లాంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు. జిడ్డు చర్మం కారణంగానే మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికి చక్కటి పరిష్కారం బంతిపూల ప్యాక్. రెండు పెద్ద బంతిపూలను పూర్తిగా తుంచేసి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ ఉసిరి పొడి, ఒక టీస్పూన్ పెరుగు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో రోజూ ఉదయం ఫేస్‌ప్యాక్ వేసుకొని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు వారాలు చేస్తే జిడ్డుతనం తగ్గి ముఖంలో నిగారింపు వస్తుంది.
 
చలికాలంలో ముఖంపై పగుళ్లు, గీతలు కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు రాసుకున్నా అది కొద్దిసేపటికే ఇంకిపోతుంటుంది. రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే చేమంతి ప్యాక్ వేసుకుంటే సరి. అందుకు రెండు చేమంతి పూలను నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి కలుపుకోవాలి. రోజూ ఉదయం బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మర్దన చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా, అందంగా ఉంటుంది.
 
{yై స్కిన్ వారికి మల్లెలు ఎంతో మేలు చేస్తాయి. వారు 5-6 మల్లెపూలను పేస్ట్‌లా చేసుకొని, అందులో కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి. దాంతో రోజూ ఉదయం లేచిన వెంటనే ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి రంగుతేలడంతో పాటు పొడితనం కూడా తగ్గుతుంది. సమయం అంతగా కేటాయించలేని వారు మల్లెపూలను ఉడకబెట్టి, ఆ నీళ్లలో ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీం కలిపి ముఖంపై ఓ నిమిషం మర్దన చేసుకొని వెంటనే గోరువెచ్చని నీటితో  కడిగేసుకుంటే చాలు కోమలమైన చర్మం మీ సొంతం.
 
 తామరపూలలో లినోనిక్ యాసిడ్‌తో పాటు అనేక రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి ముఖాన్ని తెల్లగా చేయటమే కాకుండా నల్లమచ్చలను  పోగొడ్తాయి కూడా! అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక పెద్ద తామరపువ్వును బాగా కడిగి రేకులను వేరుచేసి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీరు చల్లారాక అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. తర్వాత వాటిని ఓ సీసాలో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరి. రోజూ ముఖం కడుక్కోవడానికి ఆ నీటిని ఉపయోగించుకుంటే సరి!

>
మరిన్ని వార్తలు