కమిలిన చర్మానికి...

11 Apr, 2016 22:43 IST|Sakshi
కమిలిన చర్మానికి...

బ్యూటిప్స్
 

వేసవిలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ‘ట్యాన్.’ చేతులు, పాదాలు, ముఖం ఎండవేడిమికి నల్లబడుతుంది. ఈ సమస్య దరిచేరకుండానే కాదు, రంగుమారిన చర్మం పూర్వస్థితికి రావాలంటే ఇంట్లోనే కొన్నిర జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో... పసుపు, పెరుగు, తేనె కలిపి శరీరమంతా పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. చర్మానికి తగినంత మాయిశ్చరైజింగ్ లభించి మృదువుగా అవుతుంది.

     
స్నానానికి అరగంట ముందు శనగపిండిలో తగినంత పెరుగు కలిపి శరీరమంతా పట్టించి, మర్దనా చేయాలి. ఆరిన తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది.  ఎండకాలంలో గంధంపొడి చర్మానికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గంధం చెక్కను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ నూరాలి. ఇలా తీయగా వచ్చిన గంధం చూర్ణాన్ని దేహానికి పట్టించాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ట్యాన్ తగ్గుతుంది. చర్మం మృదుత్వాన్ని కోల్పోదు.

     
నిమ్మరసం సౌందర్యపోషణలో ఔషధకారిగా పనిచేస్తుంది. అన్ని రకాల చర్మతత్వాలకు సరిపడుతుంది. సహజసిద్ధమైన బ్లీచింగ్‌లా పనిచేసే గుణాలు ఉండటంతో చర్మకాంతి పెరుగుతుంది. అలొవెరా రసం సహజసిద్ధమైన యాంటిసెప్టిక్ లోషన్‌లా పనిచేస్తుంది. దుమ్ము, ధూళి వల్ల చర్మంపై చేరిన బాక్టీరియాను తొలగించడంతో పాటు వైరస్‌కారకాలను దూరం చేస్తుంది. టేబుల్ స్పూన్ అలొవెరా జెల్, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, పాదాలకు, చేతులకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి, వారానికి 3 సార్లు ఈవిధంగా చే స్తుంటే ట్యాన్ తగ్గుతుంది. చర్మకాంతి పెరుగుతుంది.

మరిన్ని వార్తలు