పాదాలు పదిలం

8 Jun, 2016 22:51 IST|Sakshi
పాదాలు పదిలం

బ్యూటిప్స్

 

వర్షాకాలం పాదాల సంరక్షణ కష్టంగానే ఉంటుంది. రోజువారీ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల పాదాల ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు. కప్పు మామిడిపండు గుజ్జు, కప్పు పెరుగు, అరకప్పు ఓట్స్, మూడు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు స్క్రబ్‌గా ఉపయోగించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పాదాల చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. చేతులు, పాదాలపై ట్యాన్ పోవాలంటే మామిడిపండు గుజ్జులో, టీ స్పూన్ తేనె కలిపి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. మరో ఐదు నిమిషాల తర్వాత శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఐదు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్, కప్పుడు వైట్ వెనిగర్, గోరువెచ్చని నీళ్లలో కలపాలి. ఆ నీటిలో పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేస్తుంటే కాలి పగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా అవుతుంది.


వాన నీళ్లలో నానితే వేళ్ల మధ్య తడి వల్ల ఫంగస్ చేరుతుంటుంది. ఇలాంటప్పుడు బేకింగ్ పౌడర్‌లో మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి, పాదాలకు, వేళ్ల మధ్య రాసుకోవాలి. ఫంగస్ తగ్గడంతో పాటు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.  కాళ్లు, పాదాల చర్మం పొడిబారి పొలుసులుగా కనిపిస్తుంటుంది. సీ సాల్ట్‌లో కొద్దిగా పాలు కలిపి చర్మంపై రాసి, మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇది శక్తిమంతమైన క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. రాత్రి పడుకునే ముందుగా పాదాలను శుభ్రపరచాలి. తర్వాత కరిగించిన వ్యాక్స్‌లో కొద్దిగా ఆవనూనె కలిపి రాసుకోవాలి. పది-పదిహేను రోజుల్లో కాలి పగుళ్లు త గ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా మారుతుంది. ఉప్పు లేని బటర్ టేబుల్ స్పూన్, స్ట్రాబెర్రీ ఒకటి, చిన్నముక్క కీరా, టీ స్పూన్ నిమ్మరసం, గుడ్డులోని పచ్చసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పాదాల చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.

 

మరిన్ని వార్తలు