మెరిసే మేని కోసం ఇంటి ట్రీట్‌మెంట్‌

3 Feb, 2020 04:50 IST|Sakshi

చర్మం మీద కొవ్వు కణాలు, మృత కణాలు పేరుకు పోవడం అనేది మహిళలకు ఎదురయ్యే అత్యంత సాధారణమైన సమస్య. కొవ్వు కణాలు చర్మం బయటకు పొడుచుకుని వచ్చి చర్మం మీద పేరుకుపోవడం అనేది మగవారిలో కనిపించదు. ఆడవాళ్ల చర్మం కంటే మగవాళ్ల చర్మం మందంగా ఉండడమే ఇందుకు కారణం. కొవ్వు కణాలను, మృత కణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం నల్లగా, బిరుసుగా మారిపోతుంది. నడుమకు కింది భాగంలో, తొడల మీద ఈ సమస్య ఎక్కువ. ఎక్స్‌ఫోలియేషన్‌ (మృతకణాల తొలగింపు) కోసం స్పాలకు, బ్యూటీ పార్లర్లకు వెళ్లలేని వాళ్లు సొంతంగా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు.

కాఫీ స్క్రబ్‌

ఫిల్టర్‌లో వేయడానికి ఉపయోగించే కాఫీ పొడి (ఇన్‌స్టంట్‌ కాఫీ పౌడర్‌ కాదు)ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుని కొద్ది నీటితో పేస్టు చేయాలి. ఆ పేస్ట్‌ని ఒంటికి రాసి, ఐదునిమిషాల తర్వాత వలయాకారంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే కొవ్వు కణాలు, మృతకణాలు రాలిపోవడంతోపాటు చర్మం శుభ్రపడుతుంది. మృదువుగా మారుతుంది.

నేచురల్‌ బాడీ బ్రష్‌

రోజూ స్నానం చేసేటప్పుడు బాడీ బ్రష్‌తో ఒకసారి రుద్దుకుంటే పొడిబారిన చర్మకణాలు ఏరోజుకారోజు రాలిపోతుంటాయి. కాబట్టి చర్మం మీద పేరుకునే ప్రమాదం ఉండదు. స్టెరిలైజ్‌ చేసిన కొబ్బరి పీచును చెక్క హ్యాండిల్‌కి అమర్చిన బ్రష్‌లు రెడీమేడ్‌గా దొరుకుతాయి. ఈ బ్రష్‌ను వేడి నీటితో శుభ్రం చేయాలి.

ఆయిల్‌ మసాజ్‌ 

యాంటీ సెల్యులైట్‌ మసాజ్‌ ఆయిల్‌ను ఒంటికి పట్టించి మసాజ్‌ చేయాలి. ఈ ఆయిల్‌ లెమన్‌ గ్రాస్, తులసి, రోజ్‌మెరీల మిశ్రమం. దీంతో మసాజ్‌ చేయడం వల్ల చర్మం మీదున్న కొవ్వు, మృతకణాలు తొలగిపోవడంతోపాటు దేహంలో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. ఈ ఆయిల్‌ దేహంలో గూడుకట్టుకుని పోయిన వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పోయేలా చేస్తుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా