నిన్నొదల మానవాళీ

29 Apr, 2016 23:07 IST|Sakshi
నిన్నొదల మానవాళీ

తింటే తంటా
రోగాలు మందులు మింగుతున్నాయి. మింగే ముద్ద బుస కొడుతోంది. పాత జబ్బుల రోత పెరిగింది. కొత్త జబ్బుల మోత మొదలైంది. ‘అన్నం మందు కావాలి... మందు అన్నం కాకూడదు’ అన్న నానుడికి తింటే తంటా అన్న చీడ పట్టింది. మాంసం ఫ్రై చేసి... మసాలా కొట్టి... తందూరు పెట్టి తిందామంటే క్యాన్సర్ కొరుకుతానంటోంది. ప్రసాదం దగ్గర్నుంచి చాక్లెట్ దాకా ఏ పండగా చేసుకోనివ్వని చక్కెర... పానకంలో పుడక అయ్యింది. చిత్రవిచిత్రమైన వ్యాధులు కుల మత వర్ణ వర్గాల అంతరాలు లేకుండా ‘వదల మానవాళీ’ అని ఊళ వేస్తున్నాయి. అన్నీ బ్రేకింగ్ న్యూస్‌లే! మానవాళికి ‘బ్రెత్ టేకింగ్’ ఫ్యాక్టులే!! డిప్రెషన్ ఎగరగొట్టడానికి కన్‌ఫ్యూజన్ పారదోలడానికి ఈ కథనాలు!
 
నిజానికి ఏ ఆహారమైనా ఎలర్జీ కలిగించవచ్చు. ఎక్కువగా పిల్లల్లోనే ఆహారం వల్ల ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిలో ప్రధానంగా ఎనిమిది రకాల ఆహార పదార్థాలు ఎలర్జీలు కలిగిస్తాయి. అవి... పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, వేరుశనగలు, ట్రీ-నట్స్, చేపలు, గుల్లచేపలు. ఆహారం వల్ల ఎలర్జీ లక్షణాలు కొందరిలో తక్కువగా ఉంటే, ఇంకొందరిలో ప్రాణాంతకమైన స్థాయిలో ఉంటాయి. సరిపడని ఆహారం తీసుకున్నప్పుడు నిమిషాల వ్యవధిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
 
ఫుడ్ ఎలర్జీలో జరిగే ప్రక్రియ ఏమిటి?
ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక ప్రక్రియ చాలా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. అందువల్లనే సరిపడని ఆహార పానీయాలు తీసుకున్న వెంటనే అది తీవ్రంగా ప్రతిఘటించడం మొదలుపెడుతుంది. మనకు సరిపడని ఆహారం లేదా వస్తువును ఎలర్జెన్స్ అంటారు. ఎలర్జెన్స్ లోపలికి ప్రవేశించగానే వాటితో పోరాడేందుకు వ్యాధినిరోధక వ్యవస్థ యాంటీబాడీస్‌ను వెలువరిస్తుంది. ఈ పోరాటక్రమంలో యాంటీబాడీస్ వెలువరించే రసాయనాల వల్ల మన శరీరంలో ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి.
 
ఫుడ్ ఎలర్జీలు... ఎవరెవరిలో ఎంతెంత?
చిన్నారులందరిలోనూ 3 నుంచి 8 శాతం మందిలో ఏదో ఒక రకం ఆహారం కారణంగా ఎలర్జీలు కనిపిస్తుంటాయి. కొందరిలో ఈ ఎలర్జీలు కాలక్రమంలో తగ్గిపోవచ్చు కూడా. ఇక పెద్దల విషయానికి వస్తే 1 నుంచి 2 శాతం మందిలో ఏదో ఒక ఆహారం పట్ల ఎలర్జీ రావడం చాలా సాధారణం. అయితే గతంలో మనకు బాగా సరిపడే ఆహారాలే... ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా సరిపడకపోవడం కూడా
 జరుగుతుండవచ్చు. ఇలా ఏ సమయంలోనైనా, ఏ ఆహారం పట్లనైనా ఎలర్జీ కలగవచ్చు.
 
లక్షణాలు ఎలా ఉంటాయి?
* ఎలర్జీ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. తీవ్రత సైతం ఒకేలా ఉండదు. వాటి లక్షణాల ప్రభావం వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు శారీరక వ్యవస్థలపై ఉండవచ్చు.
* ఆహారం మొదట వెళ్లేది జీర్ణవ్యవస్థలోకి కాబట్టి కొందరిలో అది లోపలికి ప్రవేశించగానే నోటిలోని లోపలి మ్యూకస్ పొరల వాపు, పెదవులపై దురదలు, గొంతు బొంగురుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* ఇంకొందరిలో ఆహారం కడుపులోకి ప్రవేశించగానే వికారం, కడుపు పట్టేసినట్లుగా బిగుతుగా కావడం, మలబద్ధకం, కడుపునొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాల లాంటివి ఎదురుకావచ్చు.
* చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాల వంటివి ఎలర్జీకి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కొందరిలో చర్మంపైనా, ఊపిరితిత్తులపైనా కనిపించే చాలా తీవ్రమైన రియాక్షన్‌ను ‘అనాఫిలాక్సిస్’ అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.
 
ఫుడ్ ఎలర్జీ నుంచి నివారణ ఎలా...?

దూరంగా ఉండండి: మీకు సరిపడని ఆహారం నుంచి దూరంగా ఉండండి.
లేబుల్ చదవండి: మీరు ఏదైనా వంటకం లేదా ప్రిపరేషన్‌ను తీసుకోదలచినప్పుడు దానిలో ఉండే పదార్థాల జాబితాను చదవండి.
మీరే వండుకోండి:  మీకు ఫుడ్ ఎలర్జీలు ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తీసుకోండి. బయటకు వెళ్లాల్సి వస్తే, స్వయంగా వంట చేసుకునే అవకాశం ఉన్నచోట వసతి పొందండి. హోటళ్ళలో తినాల్సి వస్తే, అలవాటైన ఆహారాన్నే ఆర్డర్ చేయండి.
నూనెలతో జాగ్రత్త: కొన్ని రకాల నూనెలు ఎలర్జీ కలిగించే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు వేరుశనగ నూనెకు ఈ గుణం ఎక్కువ. పిల్లల విషయంలో: బయట దొరికే కృత్రిమ ఫార్ములాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలిమెంటల్ ఫార్ములాలు లేదా అల్టర్‌డ్ ప్రోటీన్లు ఫుడ్ ఎలర్జీలను తక్కువగా కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను పాటించండి. అలాగే పిల్లల ఆహారంపై ‘హైపో ఎలర్జెనిక్’ అని రాసి ఉందంటే అది చాలా వరకు సురక్షితం. అయితే, అరుదుగా ఇవి కూడా ఎలర్జీ కలిగించే అవకాశాలు లేకపోలేదు.  అందుకే కొద్ది మోతాదుల్లో పరీక్షించాకే వాటిని నమ్మకంగా వాడండి.
చికిత్స: ఏదైనా ఆహారం వల్ల ఎలర్జిక్ లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను సంప్రతించాలి. ఎలర్జీ తీవ్రత ఎక్కువగా ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలర్జిక్ లక్షణాలు కనిపించగానే డాక్టర్లు ఎపినెఫ్రిన్ మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ హిస్టమైన్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ ఇవ్వాల్సి రావచ్చు.
 
ఎక్కువ మందిలో ప్రధానంగా అలర్జీ కలిగించేవి... పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, వేరుశనగలు, ట్రీ-నట్స్, చేపలు, గుల్ల చేపలు.

 
అలర్జీ లక్షణాలు వేరువేరుగానే ఉన్నా  చాలా మందిలో దురదలు, గొంతు బొంగురుగా మారడం కనిపించవచ్చు

 
గ్లూటెన్ అంటే...?
పిండి... దానితో చేసే ముద్ద గురించి తెలుసుకునే ముందుగా మనం ‘గ్లూటెన్’ గురించి తెలుసుకుందాం. మనం పిండిని కంచంలో రాశిగా పోసి మధ్యలో గురుగు చేసి (గుంట పెట్టి) అందులో నీళ్లు పోస్తాం. కాసేపటి తర్వాత పొడి పిండి కాస్తా... పిండిముద్దగా మారుతుంది. ఇలా పొడి పిండిని, పిండిముద్దలా మార్చడానికి పిండిలోని గ్లూటెన్ అనే పదార్థం తోడ్పడుతుంది. నిజానికి గ్లూటెన్ అన్నది ఒక రకం ప్రోటీన్. అయితే, కొందరికి మాత్రం ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ సరిపడదు.

దాంతో వాళ్లకు పిండితో చేసిన ఏదైనా వంటకం తిన్న వెంటనే  కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాల లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిని ‘గ్లూటెన్ ఇన్‌టాలరెన్స్’ ఉన్న వ్యక్తులుగా పేర్కొంటారు. ఇలాంటి వారి కోసమే... ఆ యా పిండులతో గ్లూటెన్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిండి నుంచి గ్లూటెన్‌ను తొలగిస్తారన్నమాట. ఇలాంటి పిండిని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అభివర్ణిస్తుంటారు.
 
డిప్రెషన్ కన్‌ఫ్యూజన్
ఇన్ని వ్యాధులు మన చుట్టూ భ్రమిస్తూ ఉంటే మానసికంగా కూడా కుంగిపోయేవారు ఎంతోమంది!
కొందరు వ్యక్తులు తమకు ఏదో సమస్య ఉన్నట్లుగా భావిస్తుంటారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ను ఒకటికి పదిసార్లు కలుస్తారు. వారు చెప్పింది నమ్మరు. తమకు ఏదో వ్యాధి ఉందంటూ ఈఎన్‌టీ, న్యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, డెంటిస్ట్, గ్యాస్ట్రో-ఎంటరాలజిస్ట్... ఇలా అన్నిరకాల స్పెషలిస్టులను సంప్రతిస్తుంటారు. కలిసినప్పుడల్లా సదరు డాక్టర్లకు కొన్ని కొత్త సమస్యలు చెబుతుంటారు. వాళ్లు చెప్పిన లక్షణాలను బట్టి ఆయా డాక్టర్లు రకరకాల వైద్య పరీక్షలు చేయిస్తుంటారు. అయినా ఏమీ తేలదు. అలాంటి వారిని ఇక చివరగా మానసిక వైద్యుల వద్దకు పంపిస్తారు. ఇలాంటి చాలామందిలో తమకు ఏదో జబ్బు ఉందని అనుమానించే వారిలో ‘హైపో-కాండ్రియాసిస్’ అనే రుగ్మత ఉండవచ్చు.
 
ఇక కొందరికి తీవ్రమైన డిప్రెషన్ ఉంటుంది. ఇది చాలా పెద్ద మానసిక రుగ్మత. కానీ డిప్రెషన్ రోగులు దాన్ని మానసిక రుగ్మతగా అనుమానించడానికి ముందు అనేక శారీరకమైన లక్షణాలను వ్యక్తపరుస్తుంటారు. ఆ శారీరక లక్షణాలకే చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు తీవ్రమైన నీరసం, నిస్సత్తువతో కొందరు బాధపడుతుంటారు. అది శారీరకంగా వచ్చిన బలహీనత వల్ల అని అనుకుంటుంటారు. ఆకలి లేకపోవడం కూడా డిప్రెషన్ వల్ల కనిపిస్తుంది.

ఇక కొందరిలో తలనొప్పి ఉంటుంది. నిజానికి డిప్రెషన్ వల్ల కలిగే ఈ తలనొప్పిని నరాలకు సంబంధించిన ఏదైనా వ్యాధి కారణంగా వస్తున్న తలనొప్పిగా రోగులు పొరపడుతుంటారు. ఇక, కండరాలు పట్టేయడం డిప్రెషన్‌లో కనిపించే మరో లక్షణం. కానీ ఒంట్లో నీళ్లు, లవణాలు తగ్గడం వల్ల ఇలా కండరాలు పట్టేస్తున్నాయని అపోహపడే అవకాశం ఉంది. ఇక, జీర్ణవ్యవస్థకు సంబంధించిన చాలా రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఉదాహరణకు మలబద్ధకం కానీ, నీళ్ల విరేచనాల వంటివి కానీ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని డాక్టర్లు ముందుగా గ్యాస్ట్రో- ఇంటెస్టినల్ సమస్యగా పరిగణించవచ్చు. కానీ నిజానికి ఇవన్నీ డిప్రెషన్ వల్ల కలగవచ్చు.  పైన పేర్కొన్న అనేక సందర్భాల్లో కొన్ని రకాల మానసిక రుగ్మతలు శారీరక లక్షణాలతో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ చికిత్స కోసం డాక్టర్లు కొంత వ్యవధి తీసుకొని అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే జాగ్రత్తపడాలి. మానసిక వ్యాధుల్ని అనుమానించాలి.
 
అరుదైన వ్యాధులు
ప్రొగేరియా వ్యాధి సోకిన వారికి బాల్యంలోనే ముసలితనం ముంచుకొస్తుంది.
జనాభాలో 0.1 శాతం కంటే తక్కువ మందిలో కనిపించే వ్యాధులను అరుదైన వ్యాధులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది. దాదాపు ఏడువేల వ్యాధులను ప్రపంచ ఆరోగ్య సంస్థ అరుదైన వ్యాధులుగా గుర్తించింది. ఇవి సర్వసాధారణమైన వ్యాధులు కావు గనుక వీటిపై విస్తృతంగా అధ్యయనం చేసిన వైద్యుల సంఖ్య కూడా తక్కువే. అందువల్ల కొన్ని అత్యంత అరుదైన వ్యాధులను వైద్యపరీక్షల ద్వారా గుర్తించడానికే ఒక్కోసారి చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది.

ఈలోగా అలాంటి వ్యాధులతో బాధపడే రోగులకు జరగాల్సిన అనర్థం కాస్తా జరిగిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాధులకు గురైన వారిలో మరణాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటోందని ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా (ఓఆర్‌డీఐ) వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ విజయ్ చంద్రు చెబుతున్నారు. మన దేశంలో సుమారు ఏడు కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు అత్యంత అరుదైన వ్యాధుల గురించి...
 
ప్రొగేరియా
జన్యులోపం వల్ల తలెత్తే అత్యంత అరుదైన వ్యాధి ఇది. దాదాపు 80 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారికి బాల్యంలోనే ముసలితనం ముంచుకొస్తుంది. ముసలితనం వల్ల వచ్చే అన్ని సమస్యలూ వీరిని చిన్న వయసులోనే చుట్టుముడతాయి. ఫలితంగా వారు త్వరగా మరణానికి చేరువవుతారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్సా పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులో లేవు.
 
వాటర్ ఎలర్జీ
హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వల్ల తలెత్తే అత్యంత అరుదైన వ్యాధి ఇది. ప్రపంచవ్యాప్తంగా వాటర్ ఎలర్జీతో బాధపడే రోగులను ఇప్పటి వరకు 31 మందిని మాత్రమే గుర్తించారు. నీరు ప్రాణాధారం. అలాంటి నీరే కొందరికి సరిపడదు. స్నానం చేయడానికి ఒంటి మీద నీళ్లు పోసుకుంటే చాలు ఎలర్జీ మొదలవుతుంది. ఒంటి మీద నీళ్లు పడిన నిమిషాల వ్యవధిలోనే ఒంటిపై దద్దుర్లు వచ్చేస్తాయి. డిస్టిల్ చేయని నీటిలోని అయాన్లు కొందరిలో ఎలర్జీ కలిగిస్తాయి.
 
ఆల్‌స్ట్రామ్ సిండ్రోమ్
ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలలో ఈ వ్యాధితో బాధపడే 502 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. జన్యువుల్లో తలెత్తే అసహజమైన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది సోకిన వారు బాల్యంలోనే స్థూలకాయులవుతారు. అంతేకాక రెటీనా దెబ్బతిని క్రమంగా అంధులవుతారు. చిన్న వయసులోనే టైప్2 డయాబెటిస్ సోకడంతో పాటు లివర్, కిడ్నీ లాంటి అవయవాలు విఫలమై మరణానికి చేరువవుతారు.
 
మైక్రోసెఫాలీ
ఇది అత్యంత అరుదైన నాడీసంబంధ వ్యాధి. ఈ వ్యాధిలో గర్భస్థ స్థితిలో ఉండగానే శిశువు మెదడు అసాధారణంగా ఎదుగుతుంది. పుట్టిన తర్వాత మెదడు ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఈ వ్యాధి సోకిన వారి తల చాలా చిన్నగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని నయం చేసే చికిత్స ఏదీ ఇప్పటికీ అందుబాటులో లేదు.
 
అపెండిక్స్ కేన్సర్
పేగుల చివరుండే వృథా భాగం అపెండిక్స్. అరుదుగా దీనికి కేన్సర్ సోకుతుంది. వైద్యపరిభాషలో దీనిని ‘సూడోమిక్సోమా పెరిటోనీ’ అంటారు. అపెండిక్స్‌లో మొదలైన కేన్సర్ క్రమంగా కడుపులోని ఇతర భాగాలకీ విస్తరిస్తుంది. దీన్ని సీటీ స్కానింగ్‌తో గుర్తించవచ్చు. అయితే, దీని లక్షణాలు త్వరగా బయటపడవు. వ్యాధి నిర్ధారణలో జాప్యం వల్ల అపెండిక్స్ కేన్సర్ రోగుల్లో చాలామంది మృత్యువాత పడుతుంటారు.
 
పా’ అనే హిందీ సినిమాలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రొగేరియా వ్యాధిగ్రస్తుడుగా నటించారు
 
పానకంలో పుడక

చక్కెర

రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి ‘ఏ, డీ, ఈ, కే’ వంటి విటమిన్లు అందడానికి ఈ కొవ్వులే దోహదపడతాయని  పలు పరిశోధనలు చెబుతున్నాయి.
 
‘‘వేడి వేడి అన్నంలోకి ఇంత ముద్దపప్పు... ఆవకాయ, చారెడు నెయ్యి పోసుకుని’’ తింటే ఉంటుందీ... ‘ఆహా ఏమి రుచి’ అంటూ మైమరచిపోవాల్సిందే! కానీ ఈ కాలంలో చాలామంది ‘మొదటి రెండింటికీ ఓకే గానీ... మరీ చారెడు నెయ్యి..? కొలెస్ట్రాల్ పెరిగిపోదూ..’ అంటూ తల విదిలించేస్తారు! ఒక్క నెయ్యి అనేమిటి? కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, గుండెజబ్బులకు కారణమవుతుందని మనం చాలా రుచులను పోగొట్టుకున్నాం. పాలు మొదలుకొని అన్ని రకాల పదార్థాల్లో కొవ్వులు తక్కువగా ఉండేలా చేసుకుంటున్నాం.
    
ఆరోగ్యం కోసం ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడం తప్పు కాదు. మరి... గుండెజబ్బులు తగ్గాయా? ఊహూ... చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించిన వారిని, మంచాన పడ్డవారిని మనం చూస్తూనే ఉన్నాం! మరి... సమస్య ఎక్కడుంది? కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... చిక్కంతా చక్కెరలోనే ఉంది!
 
అది 1972. అప్పట్లో బ్రిటిష్ న్యూట్రిషనిస్ట్ జాన్ యడ్కిన్స్ తన పరిశోధనల ఆధారంగా ‘ప్యూర్... డెడ్లీ అండ్ వైట్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. ‘చక్కెర (ఫ్రక్టోస్) శరీరంపై చూపే ప్రభావం గురించి ఏ కొంచెం ప్రపంచానికి చెప్పినా... వెంటనే దానిపై నిషేధం ఖాయం’ అని అంటారు యడ్కిన్. అయితే యడ్కిన్ అనుకున్నట్లు ఫ్రక్టోస్‌ను నిషేధించకపోగా యడ్కిన్స్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఆహార పరిశ్రమ వర్గాలు ఈయన పరిశోధనలన్నీ బోగస్ అని విమర్శించాయి.

ఈ అవమానాల మధ్య చివరకు యడ్కిన్ ఓ అనామకుడిలా 1995లో మరణించారు. ఈ మధ్యలో అమెరికా, బ్రిటన్‌లు ఆహారంలో కొవ్వును తగ్గించుకోవాలనీ, గుండెజబ్బులకు, మధుమేహానికి దూరంగా ఉండేందుకు అదే మేలైన మార్గమనీ ప్రచారం చేశాయి. ఇంకేముంది అందరూ కొవ్వు తక్కువగా ఉండే ‘లో-ఫ్యాట్ డైట్’ వ్యాపార వ్యూహానికి బోల్తా పడిపోయారు.
 
చక్కెర చేదే!
అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ లస్టిగ్ అని ఓ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన ఎండోక్రైనాలజిస్ట్. పిల్లల్లో ఊబకాయం నివారణపై పరిశోధనలు చేస్తూంటారు. ఏడేళ్ల క్రితం ఆయన ‘చక్కెర... ఓ చేదు నిజం’ పేరుతో ఓ ఉపన్యాసమిచ్చారు. యూ-ట్యూబ్‌లో దీన్ని ఇప్పటివరకూ దాదాపు 60 లక్షల మంది చూశారు.

యడ్కిన్స్ చెప్పిన విషయాలనే ఈయనా తన ఉపన్యాసంలో చెప్పినప్పటికీ లస్టిగ్ తన వాదనలన్నింటికీ శాస్త్ర, పరిశోధన ఫలితాలను ఆధారంగా చూపారు. ఆహారం నుంచి కొవ్వు తీసేస్తే దాని రుచి మొత్తం పోతుంది కాబట్టి... దాని స్థానంలో చక్కెర మోతాదును ఎక్కువ చేయడం వల్లనే ప్రస్తుతం అమెరికాతోపాటు చాలా దేశాల్లో ఊబకాయం సమస్య పెరిగిపోతోందని, ఇది గుండెజబ్బులకు, ఇతర వ్యాధులకు దారితీస్తోందని ఆయన సోదాహరణంగా వివరిస్తున్నారు.
 
ఇంతకీ చక్కెర ఏం చేస్తుంది?
జంక్‌ఫుడ్ కేటగిరీలోకి వచ్చే చాలావరకూ ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో సుక్రోజ్, హై-ఫ్రక్టోస్ కార్న్ సిరప్‌లు అధిక మోతాదుల్లో ఉంటాయి. ఈ రెండు తీపి పదార్థాల్లోనూ గ్లూకోజ్, ఫ్రక్టోస్ అనే రెండు రకాల చక్కెరలుంటాయి. బంగాళ దుంపలతోపాటు అనేక రకాల కాయగూరలు, పండ్ల ద్వారా గ్లూకోజ్ లభిస్తుంది. జీవక్రియలకు అవసరమైన శక్తిని కణాలు గ్లూకోజ్ రూపంలోనే తయారు చేసుకుంటాయి. శరీరంలో లివర్ ఒక్కటే అధిక మోతాదులో ఫ్రక్టోస్‌ను జీర్ణం చేయగలదు.

ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు లివర్ దాన్ని కొవ్వుగా మారుస్తుంది. ఈ కొవ్వు వెరీ లో-డెన్సిటీ లిపిడ్ కొలెస్ట్రాల్‌గా శరీరంలోకి చేరుతుంది. ఫలితంగా రక్తంలోని కొలెస్ట్రాళ్ల సమతౌల్యం దెబ్బతింటుంది. అంతేకాదు... యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని ఫ్రక్టోస్ ప్రేరేపించి రక్తపోటు అధికమయ్యేలా చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతూ ఊబకాయం, మధుమేహ వ్యాధులు వచ్చేందుకు కారణమవుతుంది.
 
కొవ్వులు తింటే లావెక్కుతారా?
ఆహారం ద్వారా మనం తీసుకునే కొలెస్ట్రాల్‌కూ, రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ మోతాదుకూ ఏ మాత్రం సంబంధం లేదని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. రోజుకు ఒకటి నుంచి పాతిక వరకూ కోడిగుడ్లు తినేవాళ్ల బ్లడ్ కొలెస్ట్రాల్ మోతాదుల్లో పెద్దగా మార్పుల్లేనట్లు గుర్తించారు. అదే సమయంలో చక్కెర దుష్ర్పభావాలపై గత దశాబ్ద కాలంలో ఎన్నెన్నో అధ్యయనాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితిలోని ఆహార, వ్యవసాయ విభాగం 2008లో అన్ని రకాల లో-ఫ్యాట్ డైట్‌లపై విశ్లేషణ జరిపింది.

ఆహారం ద్వారా తీసుకునే కొవ్వుల ద్వారా గుండెజబ్బులు, కేన్సర్ వస్తాయనేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కొవ్వులు తింటే లావెక్కుతారనే వాదనలో పసలేదని పలు తాజా అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. వెన్న, నెయ్యి, గుడ్లు లాంటివి తినడం వల్ల ఒంట్లో కొవ్వు పెరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఈ అధ్యయనాలు నిగ్గు తేల్చాయి. నిజానికి రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి ‘ఏ, డీ, ఈ, కే’ వంటి విటమిన్లు అందడానికి ఈ కొవ్వులే దోహదపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. విషయం ఏంటంటే మితంగా తింటే ఏ గొడవా ఉండదు.
- డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి
వైస్ ఛైర్మన్ అండ్ సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్

 
కౌన్సెలింగ్‌కు వచ్చిన వాళ్లకు కొద్దిగా ఫ్యాట్, అప్పుడప్పుడూ కొద్దిగా ఎగ్ ఎల్లో తీసుకోవచ్చు అని చెబితే... అన్నీ గుర్తుంచుకుంటారు కానీ... ఆ ‘కొద్దిగా’ అన్నమాట మరచిపోతుంటారు. ఆరోగ్యానికి జీవనశైలిలో బాలెన్స్ ముఖ్యమైనది. ఆ సమతౌల్యతను ‘మితం’ తోనే సాధించగలరు. రోజూ రీసెర్చ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అయితే ఆ సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి బాధ్యతగా, విచక్షణతో వాడుకుంటేనే ఆరోగ్యం మహా భాగ్యంగా ఉంటుంది.

కొత్త మోత పాత రోత

ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూస్తున్న 40 కొత్త వ్యాధులు
ఆస్పత్రుల్లో ఉండే అనేక రకాల రోగకారక క్రిముల వల్ల వచ్చే వ్యాధులైన ‘నోటోకోమియల్ ఇన్ఫెక్షన్స్’ పెచ్చుమీరుతున్నాయి. అంటే జబ్బు తగ్గడానికి హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ ఇన్ఫెక్షన్ మేనేజ్‌మెంట్ సరిగా లేకపోతే, ఆ ప్రాంతమే మళ్లీ ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందన్నమాట!
 
ఐదేళ్లలో పపంచంలో 1100 చోట్ల ఉత్పాత స్థాయిలో (ఎపిడమిక్స్ రూపంలో) వ్యాధుల విజృంభణ


కొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయి. అంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరగని ‘జికా’ వంటివి వస్తున్నాయి. మరో కొత్త వ్యాధి ‘ఎబోలా’ ప్రపంచాన్ని గడగడ వణికించేసింది. గతంలోనూ అంతే... ఆంథ్రాక్స్ అనీ, సార్స్ అనీ, మ్యాడ్ కౌ అనీ, చికన్‌గున్యా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ అనీ... ఒక్కో సీజన్‌కు ఒక్కో వ్యాధి విజృంభించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్ల్లుగా... ఈ కొత్త వ్యాధులకు మరికొన్ని పాత వ్యాధులే కొత్త రూపాలను ధరించి వచ్చేశాయి. ఉదాహరణకు రెసిస్టెంట్ వెరైటీ టీబీ, బర్డ్ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ వంటివి తమ జన్యు స్వరూపాలూ మార్చుకొని విరుచుకుపడుతున్నాయి.
 
సప్తసముద్రాలు దాటేస్తున్నాయి!
గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ వ్యాధి అయినా, ప్రపంచంలో ఎక్కడ  మొదలైనా అది ఒక మహమ్మారిలా వ్యాపించి, ఉత్పాతం సృష్టిస్తోంది. జికా వైరస్‌కి సంబంధించిన మొదటి కేసు గత మేలో బ్రెజిల్‌లో నమోదయింది. అప్పట్నుంచీ అది దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. అది మహమ్మారిలా విస్తరిస్తుండడంతో ప్రపంచదేశాలు ఉలిక్కి పడ్డాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ వైద్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
 
ప్రపంచంలోని ఏదో ఒక చోట వ్యాపించే ఒక కొత్త వ్యాధి మిగతా ప్రాంతాల నుంచి ‘కొన్ని గంటల దూరంలోనే’ ఉంది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ డెరైక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆమె పేర్కొన్నదాని ప్రకారం ఒక తరం కిందటి వారు ఏ మాత్రం ఎరగని 40 రకాల కొత్త జబ్బులను ఆ తర్వాతి తరం వారు చవిచూశారు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో ప్రపంచం 1100 చోట్ల  జబ్బుల వ్యాప్తి ఉత్పాతాలను (ఎపిడమిక్స్... అంటే జబ్బు మనుషులను తుడిచిపెట్టినట్లుగా ఒక ప్రదేశంలో వ్యాపించడాన్ని) చవి చూసింది.
 
ఇప్పుడు బ్యాక్టీరియా జీవులు మరింత బలం పుంజుకోవడం వల్ల ఒక రకం నిమోనియాను కలిగించే క్లెబిసియెల్లా నిమోనియా కార్బపేనిమేజ్, సూడోమొనాస్ అనే ప్రజాతి (జీనస్)కి చెందిన సూక్ష్మజీవుల వల్ల వ్యాపించే వ్యాధులు ప్రబలుతున్నాయి.
 
ప్రభుత్వాలూ జాగ్రత్తలు తీసుకోవాలి!
విస్తరించే వ్యాధులు సాధారణంగా వాటంతట అవే కొంత సమయం తర్వాత కట్టుబడుతుంటాయి. అయితే ఇలా అవి స్వాభావికంగా కట్టుబడకుండా ఉండడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తున్నాయి. ఉదాహరణకు సురక్షితమైన మంచి నీరు లేకపోవడం, రోజురోజుకూ పెరిగే కాలుష్యాల వల్ల పరిసరాలు అనారోగ్యకరంగా మారుతుండడం, సంపద అందరికీ అందకపోవడం వల్ల పేదలలో జీవన ప్రమాణాలు దిగజారుతుండడం వంటి అంశాలు పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. దీనికి తోడు మారిపోతున్న వాతావరణం, అనారోగ్యకరమైన ఆహారాలు, పాశ్చాత్య జీవనశైలి వంటివి ఈ వ్యాధులకు ఊతమిస్తున్నాయి.

పట్టణీకరణలో భాగంగా పెరుగుతున్న మురుగునీటి పెరుగుదల, నీళ్లు కలుషితం కావడం వంటివి కొత్త వ్యాధులు మరింత వేగంగా విస్తరించేలా చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఈ అంశాలను పర్యవేక్షించడానికీ, కొత్త వ్యాధుల విస్తరణలపై నిఘా పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ఎపిడమిక్ అండ్ ప్యాండమిక్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ డిపార్ట్‌మెంట్‌కు బాధ్యతలు అప్పగించింది డబ్ల్యూహెచ్‌ఓ.
 
ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అంశాలను తెలుసుకోడానికి ఒక ఉదాహరణ. ప్రపంచంలోని 25 శాతం జనాభా ఫ్లూ వ్యాధికి గురవుతోంది. ఫ్లూను కలిగించే వైరస్‌లలో కలిగే ఉత్పరివర్తనాల వల్ల మందులకు లొంగని మ్యూటెంట్ వెరైటీ ఇన్‌ఫ్లుయెంజాలు ఏర్పడితే అది ముప్పుగా పరిణమించవచ్చు. ఇదే జరిగితే ఆ దేశం కునారిల్లే లోపే ఆ పెనుముప్పు ఎపిడమిక్ రూపంలో ప్రపంచంలోని అన్ని దేశాలనూ చుట్టుముడుతుంది. అది సమస్త మానవాళినీ తుడిచిపెట్టే అవకాశమూ లేకపోలేదంటున్నారు నిపుణులు.

డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక నివేదిక చెబుతున్నదిదే...
* 20వ శతాబ్దంలోనే కనిపించకుండా పోయాయనుకున్న కలరా, ఎల్లో ఫీవర్, ఎపిడమిక్ మెనింగోకోకల్ వ్యాధులు (బ్రెయిన్ ఫీవర్ / మెదడువాపు) మళ్లీ వెలుగు చూస్తున్నాయి.
* వైరస్ ద్వారా సంక్రమించే ఎబోలా, మార్‌బర్గ్ హెమరేజిక్ ఫీవర్, నిఫా వైరస్ లాంటివి ఇప్పుడు మానవాళి అంతు చూసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
- డాక్టర్ మార్గరెట్ చాన్ డబ్ల్యూ.హెచ్.ఓ డైరెక్టర్ జనరల్

మరిన్ని వార్తలు