దైవంలో ఉండటమే భక్తుడి లక్షణం

4 Sep, 2017 00:24 IST|Sakshi
దైవంలో ఉండటమే భక్తుడి లక్షణం

ఆత్మీయం

దేవుడు చాలా పెద్దగా ఉంటాడేమో అన్నది ఓ పదేళ్ల బాలుడి సంశయం. అదే విషయం తండ్రిని అడిగాడు. అప్పుడే ఆకాశంలో వెళుతున్న ఒక విమానాన్ని చూపించి, అంతుంటాడు దేవుడని తండ్రి చెప్పాడు. దేవుడంత చిన్నవాడా అన్నాడా బాలుడు నిరుత్సాహంగా. మరునాడు తండ్రి విమానాశ్రయానికి తీసుకెళ్తే అక్కడ విమానాల్ని దగ్గర నుండి చూసి ‘విమానాలు ఇంత పెద్దవా?’ అన్నాడా బాలుడు.
‘‘అవును దూరం నుండి అన్నీ చిన్నవే. దేవుడూ అంతే. ఆయనకు సమీపంగా ఉంటే ఆయనెంత పెద్దవాడో అర్థమవుతుంది’’ అన్నాడు తండ్రి.

ధర్మశాస్త్రోపదేశకుడొకాయనను ‘దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటిలోకి అతి ప్రాముఖ్యమైనదేది?’ అనడిగాడు ఒకతను. ప్రాముఖ్యమైనవి ఒకటి కాదు రెండున్నాయంటూ, దేవుని సంపూర్ణంగా ప్రేమించాలన్నది మొదటిది కాగా, దేవుని సంపూర్ణంగా ప్రేమించినట్టే, మన పొరుగువాడిని కూడా అంతే ప్రేమించాలన్నది రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని జవాబిచ్చాడు. ‘నిజమే, బలులివ్వడం, హోమాలు చేయడం కన్నా ముఖ్యమైనది. దేవుని, మన పొరుగువానిని ప్రేమించడమే ముఖ్యమని అతను అంగీకరించాడు. అందుకు ఆ ఉపదేశకుడు, నీవు స్వర్గానికి దూరంగా లేవని వ్యాఖ్యానించాడు.

దైవానికి దూరంగా ఉండటం కన్నా, దగ్గరగా ఉండటం మంచిదే! కాని ఈ రెండింటి కన్నా దైవంలో ఉండేవారు నిజంగా ధన్యులు. దేవుని మహా లక్షణాలు, ఆయన శక్తి భక్తునికి సొంతమవుతాయి. లోకమన్నా, లోకభోగాలన్నా అందరికీ ఆకర్షణే! దీపం పురుగులకూ దీపానికి ఉన్న ఆకర్షణలాంటిదే ఇది. చివరకు ఆ పురుగులన్నీ దీపం వెలుగులో తిరుగుతూనే దీపం మంటలో పడి అంతమవుతాయి. లోకానికి వెలుగు, మంట రెండూ ఉన్నాయి. లోకం వెలుగులో ఎదిగి బాగుపడాలనుకునేవారు చివరకు దాని మంటలో మాడి మసైపోక తప్పదు.

మరిన్ని వార్తలు