ఇలా ఉంటే గుండె బేఫికర్‌..

29 Sep, 2019 11:33 IST|Sakshi

న్యూయార్క్‌ : జీవితంలో సానుకూల అంశాలపై దృష్టిసారిస్తూ సంతృప్తికరంగా జీవించేవారిలో గుండెపోటు, స్ట్రోక్‌ ముప్పు 35 శాతం తక్కువని తాజా అథ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మంది డేటాను, 15 అథ్యయనాలను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయం తేల్చారు. సానుకూల దృక్పథంతో కూడిన వారిలో అకాల మరణం ముప్పు 14 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. సానుకూల ఆలోచనలు కలిగిన వారు శారీరక వ్యాయామానికి, మెరుగై ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యం కాపాడుకుంటారని పరిశోధకులు భావిస్తున్నారు. గుండెపై ఒత్తిడి పెంచి శరీరంలో వాపునకు కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలను ఎలా అధిగమించాలో కూడా వారికి తెలుసునని ఈ అథ్యయనం తెలిపింది.

సానుకూల ఆలోచనలు రేకెత్తించే పరిణామాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యూయార్క్‌కు చెందిన మౌంట్‌ సినాయ్‌ సెయింట్‌ ల్యూక్స్‌ హాస్పిటల్‌ బృందం పేర్కొంది. సానుకూల దృక్పథంతో కూడిన మైండ్‌సెట్‌తో కార్డియోవాస్క్యులర్‌ ముప్పు తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయన రచయిత ప్రొఫెసర్‌ అలన్‌ రోజన్‌స్కీ చెప్పుకొచ్చారు. ఒత్తిడి, కుంగుబాటు, ఒంటరితనం గుండె జబ్బులకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. సానుకూల ధోరణితో హైబీపీ, కొవ్వుశాతం వంటి రిస్క్‌ కారకాలు అదుపులో ఉంటాయని ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు