విజయాలనిచ్చే  కప్పచెన్నకేశవుడు

16 Dec, 2018 00:36 IST|Sakshi

కథా శిల్పం

కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు చెన్నకేశవాలయం శిల్పానికి పెట్టింది పేరు.అది విష్ణ్వాలయం. హొయ్సళ శిల్పకళాప్రాభవానికి అదో మచ్చుతునక. ఇక్కడ ప్రధాన  ఆలయానికి కుడివైపున నైఋతి మూలలో కప్పచెన్నిగరాయస్వామి ఆలయం ఒకటుంది. భగవద్రామానుజులవారి ప్రభావంతో విష్ణువర్ధనమహారాజు పంచనారాయణ క్షేత్రాలు నిర్మింపజేశాడు. అందులో బేలూరు చెన్నకేశవాలయం విజయనారాయణ క్షేత్రంగా విఖ్యాతి గాంచింది.ప్రధానవిగ్రహం స్వయంగా మహాశిల్పి జక్కనాచార్య చేతుల్లోనే రూపుదిద్దుకుని, ప్రతిష్ఠకు సిద్ధమైంది. అయితే ఇంతలో ఆ విగ్రహం ప్రతిష్ఠకు పనికిరాదని అక్కడికి వచ్చిన ఒక పిల్లవాడు చెబుతాడు.

విషయాన్ని నిరూపిస్తే తన చేతులను తెగనరుక్కుంటానని జక్కన ప్రతిజ్ఞ చేశాడు. ఆ విగ్రహం తెప్పించి చందనాన్ని విగ్రహమంతా పూయమని చెప్తాడా బాలుడు. కొంతసేపటికి చందనమంతా ఆరిపోయింది. కానీ విగ్రహానికి నాభి ప్రదేశంలో మాత్రం తడిగానే ఉంది. ఆ బాలుడు ఉలితో ఆ భాగాన్ని మాత్రం బద్దలు చేసి చూస్తే అందులోంచి ఒక కప్ప బయటకు వచ్చింది. ఈ శిల గర్భశిల అనీ, తన పేరు ఢంకణాచార్యుడనీ చెప్పగా, తాను తప్పు చేసినట్లు గుర్తిస్తాడు జక్కనాచార్యుడు. అన్నమాటకు కట్టుబడి తన రెండు చేతులనూ నరుక్కుంటాడు. అయితే ఢంకణాచార్యుడు తన కుమారుడే అని తెలుసుకుని, పుత్రుని చేతిలో పరాజయం పొందడం అదృష్టంగా భావిస్తాడు.

చేతులు లేకపోయినా కుమారుడి సహాయంతో ప్రతిష్ఠా సమయానికి మరో అద్భుతమైన విగ్రహం తయారు చేసి ఇస్తాడు. జక్కణాచార్యుని అకుంఠిత భక్తికి మెచ్చి చెన్నకేశవుడు ఆయనకు తిరిగి చేతులిచ్చాడని చెబుతారు. అయితే కప్ప బయటపడిన విగ్రహానికి కూడా ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారు. నేటికీ మనం ఆ విగ్రహం నాభి ప్రదేశంలో చదరపు భాగాన్ని గమనించవచ్చు.ఈ స్వామి స్థితరూపంలో కుడిచేతిలో పుష్పాన్ని, అభయముద్రతో, ఎడమచేతితో గదను, వెనుక చేతులలో శంఖచక్రాలను ధరించి ఉంటాడు. ఈ స్వామికి ఇరు వైపులా శ్రీదేవి భూదేవి ఉంటారు. కష్టాలను తీర్చి, విజయాలనిచ్చే విజయనారాయణుడిగా ఈయన ప్రసిద్ధుడు.
 – డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి 

మరిన్ని వార్తలు