సుగంధ వైద్యం

23 Sep, 2018 23:40 IST|Sakshi

ఒక సుగంధద్రవ్యంగా యాలుకతో నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. శ్వాసలో తాజాదనాన్ని నింపవచ్చు. నోట్లో ఒక యాలకుల పలుకువేసుకుని సాధారణంగా చాలామంది ఆ ప్రయోజనాన్ని పొందుతుంటారు. నిజానికి ఈ చిన్న పనులతో పాటు ఆరోగ్యపరంగా ఎంతో పెద్ద ప్రయోజనాలు ఇస్తాయి యాలకులు. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని.

యాలకులు జీవక్రియలను వేగవంతం చేస్తాయి. జీర్ణరసాల స్రావాలను ప్రేరేపించడం ద్వారా అవి మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి.
    యాలకులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను... అంటే యాసిడ్‌ పైకి తన్నడాన్ని (యాసిడ్‌ రిఫ్లెక్స్‌), ఛాతీలో మంట, డయేరియా వంటి వాటిని అరికడతాయి.
    వీటిలోని యాంటీఆక్సిడెంట్స్‌ కొలెస్ట్రాల్‌ పాళ్లను తగ్గిస్తాయి. తద్వారా గుండెకు మేలు చేస్తాయి.
    యాలకులలోని యాంటీఆక్సిడెంట్స్‌ ప్రమాదకరమైన ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. యాలకుల పౌడర్‌ను ఉపయోగిస్తూ చేసిన ఔషధాలు క్యాన్సర్‌ గడ్డలను కరిగించగలవని కొన్ని అధ్యయనాల్లో స్పష్టంగా తేలింది.
   ఆస్తమాలో కనిపించే పిల్లికూతలు, దగ్గు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి ఎన్నో రకాల సమస్యలను యాలకులు తేలిగ్గా పరిష్కరిస్తాయి. ఊపిరితిత్తుల నిండా గాలిని ధారాళంగా పీల్చుకునేందుకు ఇవి దోహదపడతాయి. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి.  
    శారీరక సమస్యలకే కాదు... మానసిక సమస్యల పరిష్కారంలోనూ యాలకులు బాగా తోడ్పడతాయి. క్రమం తప్పకుండా యాలకులు వాడితే అవి డిప్రెషన్‌ను దూరం చేస్తాయని అధ్యయనాల్లో తేలింది.
    డయాబెటిస్‌ను నివారించడంలో లేదా డయాబెటిస్‌ను ఆలస్యం చేయడంలో యాలకుల భూమిక చాలా విశిష్టమైనది.
 యాలకులు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
   రక్తంలోని గడ్డలను (క్లాట్స్‌ను) నివారించడం ద్వారా అవి రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చూస్తాయి. తద్వారా గుండెపోటును, పక్షవాతాన్ని నివారిస్తాయి.
   అనేక రకాల చర్మసమస్యలను దూరం చేస్తాయి. మేనిలో మంచి నిగారింపును తెస్తాయి.

మరిన్ని వార్తలు