వెన్నుదన్ను

24 Feb, 2016 22:26 IST|Sakshi
వెన్నుదన్ను

మానవదేహంలో అత్యంత ప్రధాన అవయవం వెన్నెముక. మనిషిని బలంగా నిలబెట్టేది, బలహీనుడ్ని చేసిపడగొట్టేది ఇదే. అందుకే దీనిని ఎంత బలంగా ఉంచితే మనిషి అంత ఆరోగ్యవంతంగా ఉంటాడు. యోగాలో పలు ఆసనాలు వెన్నెముక సామర్ధ్యాన్ని పెంచేందుకు ఉపకరిస్తాయి. అందులో కొన్ని...
 
వీరభద్రాసనం 1
సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ కుడిచేతిని ముందు నుంచి స్ట్రెచ్ చేస్తూ పైకి తీసుకువెళ్లి, శ్వాస వదులుతూ కుడిచేతిని ఎడమకాలును సమాంతరంగా ఉంచి ముందుకు వంగాలి.  నేలకు సమాంతరంగా వంగినపుడు కుడిచెయ్యి ఎడమకాలు స్ట్రెయిట్ లైన్‌లో ఉండటం గమనించవచ్చు. ఎడమచేతిని నడుము పక్కనే నిటారుగా ఉంచాలి. చేతివేళ్లు కూడా స్ట్రెచింగ్ పొజిషన్‌లో ఉండటం గమనించగలరు. 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ కుడిచేతిని పైకి ఎడమకాలును క్రిందకు, శ్వాస వదులుతూ కుడిచేతిని భూమివైపు చూపిస్తూ, కుడిపక్క నుండి క్రిందకు నడుము పక్కకి తీసుకురావాలి. మళ్లీ సమస్థితికి రావాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి.
 
 
వీర భద్రాసనం 2
సమస్థితిలో నిలబడి రెండు చేతులూ స్ట్రెచ్ చేస్తూ అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ  పైకి తీసుకువెళ్లి పైన లింగముద్రలో (చేతులు రెండు ఇంటర్‌లాక్ చేసిన తరువాత ఎడమచేతి బొటనవేలును పైకి నిలబెట్టి ఉంచాలి) లేదా నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు ఎడమకాలును కొంచెం వెనుకకు తీసుకొని పొజిషన్ తీసుకుని శ్వాస వదులుతూ చేతులు రెండూ కలిపి ముందుకి స్ట్రెచ్ చేస్తూ వంగాలి. వెనుక కాలును పైకి లేపాలి. చేతులు, వెనుక కాలు భూమికి సమాంతరంగా వస్తాయి. 5 శ్వాసల తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి లేపాలి. చేతులు వెనుక కాలు భూమికి సమాంతరంగా వస్తాయి. 5 శ్వాసలు తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి ఎడమకాలు వెనుకకు, కిందకు తీసుకురావాలి. శ్వాస వదులుతూ అరచేతులు రెండూ భూమివైపుకి చూపిస్తూ నడముకు ఇరువైపులా కిందకు తీసుకురావాలి. ఇలా చేయలేని వారు ముందు వైపు కుర్చీ, డైనింగ్ టేబుల్‌గాని రెండడుగుల దూరంలో ఉంచి ముందుకు వంగినపుడు చేతులతో వాటికి సపోర్ట్ పెట్టి వెనుక కాలును వీలైనంత పైకి నిటారుగా లేపవచ్చు. అనుభవమున్న సాధకులు కూడా కుర్చీ సపోర్ట్ తీసుకుంటే అలైన్‌మెంట్ పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.
 
గరుడాసన
ఆకాశంలో ఎగురుతూ నీటిలో ఉన్న ఆహారాన్ని పసిగట్టి గంటకు 200 మైళ్ల వేగంతో కిందకు దూసుకువచ్చి గురి తప్పకుండా ఆహారాన్ని నోట కరచుకోగల సామర్థ్యం గరుడపక్షి సొంతం. అత్యంత ఏకాగ్రత ఇందులో ఇమిడి ఉంది. అందుకే గరుడ అంటే శక్తికి, ఏకాగ్రతకు చిహ్నం.
 చేసే విధానం: ఎడమ మోకాలు కొంచెం ముందుకు వంచి ఎడమకాలు మీద నిలబడి కుడికాలును పై నుంచి ఎడమకాలు చుట్టూ ట్విస్ట్ చేయాలి. ఎడమచేతిని ముఖానికి ఎదురుగా నిలువుగా ఉంచి కుడిచేతిని ఎడమ చేతి చుట్టూ ట్విస్ట్ చేస్తూ రెండు అరచేతులనూ దగ్గరగా నమస్కారముద్రలోకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ కలిపి ఉంచిన రెండు చేతులను నమస్కార ముద్రలోనే పైకి తీసుకెళ్లి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత క్రమంగా చేతుల్ని ఆ తరువాత కాళ్లను అన్‌లాక్ చేస్తూ సమస్థితికి రావాలి. అదే విధంగా రెండోవైపునకు కూడా చేయాలి.
 
ఉపయోగాలు: వీపు పైభాగాలైన షోల్డర్ బ్లేడ్స్‌కి, ట్రెఫీజియస్ కండరాలకు, కాళ్లలో ఉన్న కండరాలు బలంగా తయారవడానికి బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. ఈ ఆసనం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసికంగా కూడా బలంగా తయారవుతారు.
 
సాధారణ త్రికోణాసన
కాళ్ల మధ్య రెండు లేదా మూడు అడుగుల దూరం ఉంచాలి. ఎడమ పాదం పక్కకు, కుడిపాదం ముందుకు ఎడమపాదానికి సమాంతరంగా రెండు చేతులూ 180 డిగ్రీలలో సమాంతర రేఖలో భూమికి సమాంతరంగా ఉంచి శ్వాస తీసుకుంటూ నడుమును పూర్తిగా పక్కకు తిప్పాలి. శ్వాస వదిలేస్తూ కుడిచేయి కిందకు కుడి పాదం పక్కనే నేల మీదకు (నేల మీద పెట్టలేకపోతే కుడిపాదాన్ని కాని చీలమండను కాని లేదా మోకాలి కిందిభాగాన్ని కాని పట్టుకోవచ్చు) ఎడమ చేయి పైకి కుడిచేతికి సమాంతరంగా చాతీని నేలవైపు ముందుకు వంగిపోకుండా వీలైనంత పక్కకు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ పైకి, చేతులు భూమికి సమాంతరంగా తీసుకువచ్చి శ్వాస వదులుతూ రెండు చేతులు కిందకు తీసుకురావాలి. రెండోవైపు కూడా ఇదే విధంగా చేయాలి. ఉపయోగాలు: శ్వాసకోస మరియు రక్తప్రసరణ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. వెన్నుపూసల అలైన్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది.
 
 
ఉపయోగాలు: వెన్నెముకను, తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. లోయర్ బ్యాక్ సమస్యకు పరిష్కారం. గుండె, ఊపిరితిత్తుల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

మరిన్ని వార్తలు