బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఆహారం తీసుకోండి!

30 May, 2020 08:29 IST|Sakshi

ఆహార విషయంలో జాగ్రత్తలతో ఎంతో మేలు

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కొత్త వంటకాలు.. సరికొత్త రుచులకు అలవాటు పడి కొందరు తమ శరీర బరువును అమాంతం పెంచేసుకుంటున్నారు. ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో కుస్తీలు పడుతున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడే వాళ్లంతా సమ్మర్‌ చిట్కాలు.. యోగా.. పండ్ల జ్యూస్‌లతో స్లిమ్‌గా తయారు కావచ్చునని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. (కరోనా: వర్క్‌ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!)

వేసవికాలం.. ఎంతో వరం 
బరువు తగ్గాలనుకొనేవారికి వేసవి కాలం వరంలాంటిది. బరువు పెరిగిపోతున్నామని తెగ బెంగ పడుతున్న వారు ఎలాగైనా బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఫిట్‌నెస్‌ సెంటర్‌లకు పరుగులు పెడుతున్నారు. మరో వైపు మారుతున్న జీవన విధానంలో జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచుకోలేక మోతాదుకు మించి భుజిస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. దాంతోపాటు ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో రకాల పనుల నిమిత్తం ఒత్తిడి సైతం రెట్టింపవుతుంది. అయితే, నడకతో ఒత్తిడిని అధిగమించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక నొప్పులు తగ్గుతాయంటున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఉండడం వల్ల ఇంట్లోనే వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవచ్చు. (పదే పదే శానిటైజర్‌ వాడుతున్నారా?)

వేసవిలో ఈ ఆహారం తీసుకుంటే మేలు..
నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్భూజ, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, లవణాలు అందుతాయి. 
పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అవుతుంది. డైట్‌ కంట్రోల్‌ అవుతుంది. బరువు కూడా తగ్గుతుంది. 
షుగర్‌ వేసిన జ్యూస్‌ మ్యాంగో, సపోటా వంటివి తీసుకొంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు మొదలవుతాయి. 
వేసవిలో ఆకలి తక్కువగాను దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోను తేడాలు వస్తుంటాయి. డైట్‌పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు.     మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. (కొబ్బరిబోండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా)

శీతల ప్రాణాయామంతో మేలు 
వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం 8 నుంచి మొదలవుతుంది. ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. నీటితో పాటు శీతల ప్రాణాయామం చేస్తే కొంతవరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. శీతల ప్రాణాయామం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఉదయం ఏడు గంటలలోపు 5 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు పేర్కొంటున్నారు. 


యోగా చేస్తే బరువు తగ్గవచ్చు 
నిత్యం క్రమపద్ధతిలో యోగా చేస్తే బరువు తగ్గవచ్చు. వయస్సు ప్రకారం యోగాసనాలు, సూక్ష్మ వ్యాయామాలు, సూర్యనమస్కారాలు చేయాలి. ప్రాణాయామాలు కూడా నిత్యం చేస్తే శరీరం అదుపులో ఉండి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.  – బాల్‌రాజు, జిల్లా యోగా సంఘం కార్యదర్శి


ద్రవ పదార్థాలు ఎక్కువగా.
ఎంతటి భోజన ప్రియులైన వేసవి కాలంలో కాస్తా మోతాదు తగ్గించి ఆహారం తీసుకోవాలి. వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వేసవిలో దాహం ఎక్కువ. ఆకలి తక్కువగా ఉంటుంది. అందువలన 15 నుంచి 20 నిమిషాలకు ఒక సారి చొప్పున రోజుకు కనీసం 5 లీటర్లను వివిధ రూపాల్లో తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. గొంతు నొప్పి తదితర సమస్యలు తలెత్తవు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు