‘లాబ్‌’తో నారు.. లాభాల జోరు!

15 May, 2018 04:37 IST|Sakshi

ఈ అభ్యుదయ రైతు పేరు గుదేటి సుబ్బారెడ్డి (43). గుంటూరు జిల్లా చుండూరులో మూడేళ్ల క్రితం అరెకరం పాలీహౌస్‌ నిర్మించి బంతి నారు పెంచి కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. 18–24 రోజులు పెంచి.. ఏడాదికి 10 బ్యాచ్‌ల బంతి నారును బెంగళూరు తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. గతంలో రసాయనిక ఎరువులు వాడే వారు. న్యూలైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శివశంకర్‌ లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా(లాబ్‌)ను పరిచయం చేసిన తర్వాత మెరుగైన ఫలితాలు పొందుతున్నాడు.అర లీటరు లాబ్‌ ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి టన్ను కొబ్బరిపొట్టుపై చల్లుతారు. పాలీహౌస్‌లోని ట్రేలలో కొబ్బరిపొట్టును నింపి బంతి విత్తనం వేస్తారు.

15 రోజుల మొక్కలకు చీడపీడలు సోకకుండా.. లీటరు నీటికి 3 ఎం.ఎల్‌. కానుగ నూనెను కలిపి ఒకసారి పిచికారీ చేస్తారు. ఏడాదికి 50 లక్షల బంతి మొక్కలను ఎగుమతి చేస్తున్నానని.. మొక్క రూ.2.50 చొప్పున అమ్ముతున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. రసాయనిక ఎరువులు వాడినప్పటì తో పోల్చితే.. లాబ్‌ వాడకం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతున్నాయి. రెండు రోజులు ముందుగానే మొక్కలు సిద్ధమవుతున్నాయి. త్వరగా మెత్తబడకుండా తాజాగా ఉంటున్నాయని, ఖర్చు కూడా పది శాతం తగ్గిందని సుబ్బారెడ్డి(99632 93921) సంతోషంగా చెప్పారు. పాలీహౌస్‌ పక్కనే ఎకరంన్నర నిమ్మ తోటలో కూడా లాబ్‌ ద్రావణాన్ని వాడుతున్నారు. నిమ్మకాయల నాణ్యత పెరిగిందని ‘సాక్షి సాగుబడి’తో ఆయన చెప్పారు.

గోంగూర మొక్కలు..
గోంగూరను విత్తనం వేసి పెంచాల్సిన అవసరం లేదు. పీకిన గోంగూర మొక్కలనే మార్కెట్లో కొంటారు కదా? ఆకులను కోసుకున్న తరువాత, ఆ మొక్కలను ఇలా తిరిగి పెరట్లోనో, కుండీల్లోనో, మిద్దె తోటల్లోనో నాటుకోవచ్చు. అవసరానుగుణంగా నీరు చల్లాలి. మళ్లీ వేరూనుకొని చిగురిస్తాయి. కొంతకాలానికి తిరిగి ఆకును ఇస్తాయి.
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు

మరిన్ని వార్తలు