అమ్మాయిలూ జాగ్రత్త

4 Mar, 2017 00:33 IST|Sakshi
అమ్మాయిలూ జాగ్రత్త

పారిస్‌లో ఫ్యాషన్‌ వీక్‌ జరుగుతోంది. పెద్ద పెద్ద బ్రాండ్స్‌ ఆ ఫ్యాషన్‌ షోకి కొత్త కొత్త డిజైన్‌లను మోసుకొచ్చాయి. వాటిని వేసుకుని ర్యాంప్‌ మీద నడవడానికి మోడల్‌ గాళ్స్‌ కూడా వచ్చేశారు. వీళ్లంతా పేరున్న ఏజెన్సీల నుంచి సెలక్ట్‌ అయి వస్తారు. అలా ఓ ఫ్రెంచ్‌ ఏజెన్సీ 150 మంది మోడల్స్‌ని ఫ్యాషన్‌ వీక్‌ కోసం వెంటబెట్టుకొచ్చింది. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. ఎవరికైనా ఓ గౌరవం ఉంటుంది. అయితే ఆ ఫ్రెంచ్‌ ఏజెన్సీ... పద్ధతుల్ని, గౌరవాలను పక్కన పెట్టి ఈ మోడలింగ్‌ అమ్మాయిల్ని వాళ్ల కర్మకు వదిలేసింది. సరైన వసతి ఏర్పాటు చేయలేదు. కనీసం కూర్చోడానికి ఒక గౌరవప్రదమైన స్థలాన్ని చూపించలేదు. అందర్నీ ఓ స్టెయిర్‌వెల్‌లో కుక్కేసింది. స్టెయిర్‌వెల్‌ అంటే నిలువుగా ఉండే మెట్ల వరస. ‘ర్యాంప్‌ మీదకు మీ వంతు వచ్చే వరకు ఇక్కడే వెయిట్‌ చెయ్యండి’ అని చెప్పి ఏజెంట్లు వెళ్లిపోయారు. కొందర్నైతే చీకటి గదుల్లో ఉంచి, బయట తలుపేసి వెళ్లిపోయారు. వాళ్లు మాత్రం లంచ్‌ చేసి, నింపాదిగా మూడు గంటల తర్వాత తిరిగొచ్చారు.

పాపం ఈ అమ్మాయిలు అంతసేపూ దాహానికి, ఆకలికి అల్లాడిపోయారు. తరలించడానికి లారీలకు ఎక్కించిన మూగప్రాణుల్లా... ఒకళ్ల మీద ఒకళ్లు పడిపోతూ నానా అవస్థలూ పడ్డారు. ఆకలి, దాహం తర్వాతి మాట. బాత్రూమ్‌కి వెళ్లడానిక్కూడా వీల్లేక గుట్టుగా బాధను అనుభవించారు.  ఈ సంగతి తెలిసి... పారిస్‌ ఫ్యాషన్‌ షోలో పాల్గొనేందుకు వచ్చిన ‘బెలెన్షియాగా’ అనే పెద్ద పేరున్న ఫ్యాషన్‌ బ్రాండ్‌...  ఆ అమ్మాయిలందరికీ క్షమాపణ చెప్పుకుంది. వీళ్లను కుదుర్చుకొచ్చిన ఏజెన్సీని రద్దు చేసింది. పైకి రావడానికి ఎన్ని కష్టాలకైనా ఓర్చుకునేవారున్నట్టే... పైకి రావడానికి ఎన్ని కష్టాలైనా పెట్టేవారూ ఉంటారు. అమ్మాయిలూ జాగ్రత్త. అందమైన మోడలింగ్‌ ప్రపంచంలో వికృతమైన మనస్తత్వాలూ ఉంటాయి.

మరిన్ని వార్తలు