ధర్మనిర్ణయ గీత

12 Dec, 2013 00:26 IST|Sakshi

 (రేపు గీతాజయంతి)

భగవద్గీత... సన్మార్గ దర్శిని... సాక్షాత్తూ భగవంతుని ముఖత వెలువడిన అమూల్యమైన గ్రంథం. జీవితాన్ని ఎలా నడుపుకోవాలో చెప్పే మార్గదర్శక మణిదీపం. గాంధీజీ వంటివారు కూడా నిరంతరం పఠించి, చేతితో పట్టుకు తిరిగిన గ్రంథం.
 
అసలు భగవద్గీత ఎందుకు పుట్టింది?
మంచితనంతో పాండవులు రాజ్యాన్ని చేసుకోనిస్తే దాన్ని హస్తగతం చేసుకోదలచీ- ధర్మంగా సంపాదించిన రాజ్యంగా ప్రకటించుకోదలచీ జూదాన్ని ఆడించాడు దుర్యోధనుడు. తెరవెనుక నిలబడ్డాడు ధృతరాష్ట్రుడు. అధర్మంగానూ వంచనతోనూ ఎదుటి వ్యక్తులు శత్రువులుగా మారి యుద్ధానికి దిగినప్పుడు వీళ్లు మా అన్నలు తమ్ముళ్లు తాతలు గురువులు- అనుకుంటూ కూచోకు! ఇది వెనుకడుగు వేయాల్సిన సందర్భం కాదు! అందుకే ఈ దశలో హృదయ దౌర్బల్యాన్ని విడువు! తెగబడి యుద్ధం చేసి విజయుడనే పేరుని సార్థక పరచుకో- అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునునితో. కాబట్టి గీత అనేది ధర్మసంకటం వచ్చినప్పుడు తీర్చగల చక్కటి న్యాయగ్రంథమన్నమాట. అందుకు పుట్టింది గీత. ఇది రెండవ అంశం.
 
అందరం మానవజాతికి చెందినవాళ్లమే అయినప్పుడూ కులాలనేవి మనం ఏర్పాటు చేసుకున్నవే అయినప్పుడు కులాంతర వివాహం చేసుకోవడం నేరమా? అలా చేసుకున్నవాళ్లని చాటుగా మరోలా అనుకోవడం ధర్మమా? అనేది మరో ధర్మసందేహం.

కులాంతరంలాగానే మంతాంతర వివాహం చేసుకున్నాడు. మరొకరు దేశాంతర స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ పరస్పరం ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆచారాలూ విధానాలూ అంటూ ఎందుకు తప్పుపట్టాలనేది మరో సందేహం!
 
దీనికి భగవద్గీత చక్కటి సమాధానం చెప్తుంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి నిదానంగా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి కూడ. ఉదాహరణకి ఓ బ్రాహ్మణుడు మరో కులపు స్త్రీని వివాహం చేసుకున్నాడనుకుందాం. ముందుగా తేడా వచ్చేది భోజనం వద్ద. ఈయన శాకాహారి. ఆమె, ఆమెవైపు బంధుమిత్ర జనం మాంసాహారులు. వంటింటి వద్ద పేచీ ప్రారంభమవుతుంది.  
 
ఇక ఎవరైనా మరణించిన సందర్భంలో జరిగే క్రియాకలాపాలూ ఆ మీదట చేయవలసిన మాసిక సాంవత్సరిక శ్రాద్ధాది క్రియాలూ స్నానాలూ మంత్రాలూ విధివిధానాలూ ఆమెకి అలవాటు లేక... వీటి ప్రాశస్త్యం తెలియక... నిరాసక్తతతో చేస్తుంటే చూసేవారికి మరోలా అనిపించవచ్చు.
 
ఇలా ఆచార వ్యవహారాలు ధ్వంసమయ్యే అవకాశాన్ని ముందే పసిగట్టిన గీత ఇలాంటి వివాహాలు ఈ కారణంతో వద్దు - అంది. ఇది నిజమే కదా! ఆ స్త్రీ ఇంట్లో కొన్ని ఆచారాలుంటాయి. వాటిని ఇతడు పాటించకపోతే వాళ్లకీ కష్టమే కదా!
 కాబట్టి గీత అనేది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని అందునా కుటుంబానికి సంబంధించిన వాటిని కూడా ముందుచూపుతో పరిష్కరిస్తుందన్నమాట.
 
భగవంతుణ్ణి చూడాలంటే... భగవంతుడుంటే అందరికీ  కన్పించాలి కదా! అని వాదిస్తుంటారు కొందరు. ఏదైనా ఓ విషయాన్ని నిరూపించాలంటే కొన్నిటిని ప్రత్యక్షంగా నిరూపించవచ్చు. కొన్ని అనుభవం ద్వారానే సాధ్యం. ఉదాహరణకి మనోబాధ, వాయుప్రసారం, నిప్పువేడిమి వంటివన్నీ అనుభవం ద్వారా తెలుసుకోదగినవే తప్ప నిరూపించలేం. ఈ దృష్టితో చూస్తే భగవంతుడున్నాడా? అనే ప్రశ్నకి సాక్ష్యం అనుభవమే.
 
మరణానికి భయమా?... కొంతమంది మరణమనేదానికి చాల భయపడుతూ కన్పిస్తారు. మరణానికి దుఃఖించాల్సింది ఎప్పుడంటే- వస్త్రం జీర్ణం (శిథిలం) అయినప్పుడెలా విడిచి కొత్తదాన్ని ధరిస్తామో అలా శరీరం కూడ వృద్ధాప్య దశ దాకా వచ్చి శిథిలమై విడవనప్పుడు - మాత్రమే. ఏ అపమృత్యువో సంభవించినట్లయితే దుఃఖించే అంశమే అంటున్న ఆ భగవంతుడెంతటి హేతువాది!
 
రహస్యాల స్థావరం ఆకాశం: ఈ రోజున నాసా వంటి సంస్థలన్నీ ఆకాశాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు బహిరంగ పరిశోధనాలయం, ప్రయోగవేదిక అని చెప్తున్నారుకానీ, ఈ విషయాన్ని భగవంతుడు తన గీతలో ఏనాడో చెప్పాడు ఆకాశాన్ని గూర్చి.

 ఆః అంటే ఆశ్చర్యమంది సంస్కృతం. ఆకాశం పేరు వినగానే అలాగే ఆశ్చర్యంతో చూస్తాట్ట ప్రతివ్యక్తీ. ఇలా ఆశ్చర్యమాశ్చర్యమంటూండ టమే తప్ప ఎవరికీ ఏమీ తెలియనంత ఉంది ఆకాశంలో... అన్నాడు గీతలో భగవంతుడు. అన్ని రహస్యాలున్నాయి కాబట్టే అది కనిపించకుండా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది.


 ఇలా ఎన్నెన్నో కుటుంబం- సంఘం నడవడికల గురించిన అనేక ధర్మసందేహాలను తీర్చగల ధర్మనిర్ణయ శాస్త్ర గ్రంథంగా కనిపించే ఈ గీత పుట్టింది మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు. ఆ రోజున శిరఃస్నానాన్ని చేసి భగవద్గీతను పూజించి 10, 11 అధ్యాయాలని చదివి శ్రీకృష్ణునికి షోడశోపచారాలు చేయాలి.
 - డా. మైలవరపు శ్రీనివాసరావు
 
 నువ్వు ముందు ఏదైనా నేర్చుకోవాలంటే మంచి విద్యార్థివి కావాలి. నా బోధనల్ని కంఠతా పడితే ఉపయోగం లేదు. ఆచరణ లేని బోధ వంటబట్టదు. నా లీలల్ని చదివి నువ్వు ఆశ్చర్యం చెందాలన్నది నా అభిమతం కాదు. వాటిని చిత్తశుద్ధితో ఆచరించాలన్నదే నా సంకల్పం. అందుకే జీవితాంతం మంచి విద్యార్థిగా ఉండు.
 - శ్రీ షిరిడీ సాయిబాబా
 

మరిన్ని వార్తలు