అవును.. మైనే ప్యార్‌ కియా

5 May, 2019 00:29 IST|Sakshi

తెలుగు నేల మీద ఆ పావురం మురిపెంగా వాలింది.‘పావురమా హే.. హే.. హే... పావురమా హే..హే..హే’డబ్బింగ్‌ పాటైనా యువలోకమంతాకాలేజీ దారుల్లో హమ్‌ చేసింది.అమ్మాయిలు ఇలాంటి సౌందర్యానికి అసూయ పడ్డారు.అబ్బాయిలు పోస్టర్లను గోడల మీద గుండెల మీద అంటించుకున్నారు.భాగ్యశ్రీ ‘మైనే ప్యార్‌ కియా’తో దేశాన్ని ఒక వూపు ఊపింది.దేశం ఆమెను ప్రేమించింది.కాని ఆమె మాత్రం కెరీర్‌ కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించింది.ఆ ప్రేమ కథే ఈ మాటాముచ్చటా.

20 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలు చేస్తున్నారు.. పైగా హైదరాబాద్‌తో మీ ‘లవ్‌ లైఫ్‌’కి ఓ స్పెషాల్టీ ఉంది కదా?
భాగ్యశ్రీ: (నవ్వేస్తూ). అవును. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని హిమాలయ్‌ నాతో చెప్పింది హైదరాబాద్‌లోనే. మేమప్పుడు ముంబై నుంచి స్కూల్‌ ట్రిప్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాం. అప్పటికే మేం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. కానీ బయటకు చెప్పుకోలేదు. చివరికి హైదరాబాద్‌ సాక్షిగా మా లవ్‌ గురించి మాట్లాడుకున్నాం.

చార్మినార్‌ సాక్షిగా హిమాలయ్‌ చెప్పారా? లేక వేరే ఏదైనా ప్లేస్‌లోనా?
ఇప్పుడంటే లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్‌ చూసుకుంటున్నారు. మూన్‌ లైట్‌లో చెబుతుంటారు. రోజా పువ్వులు ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. 30 ఏళ్ల క్రితం ఇలా లేదు. ట్రిప్‌లో మేమిద్దరం పక్క పక్కన కూర్చున్నాం. అప్పుడు తను నాతో చెప్పాడు. అప్పటికే మేం ఇక్కడ బోలెడన్ని హిస్టారికల్‌ ప్లేసెస్‌ని సందర్శించాం. ఇక ఇంతకంటే మంచి ప్లేస్‌ ఏం ఉంటుందని ఇప్పుడు అనిపిస్తోంది.

అప్పుడు మీరిద్దరూ ఏం చదువుకుంటున్నారు? చదువు విషయంలో ఒకరికొకరు హెల్ప్‌ చేసుకున్నారా? అసలు మీ మధ్య ప్రేమ ఎలా మొదలైంది?
టెన్త్‌ స్టాండర్డ్‌లో ఉన్నాం. నేను లెక్కల్లో బాగా వీక్‌. హిమాలయ్‌ సూపర్‌. తను నాకు లెక్కలు నేర్పించేవాడు. తను మ్యాథ్స్‌ బాగా నేర్పించాడు కాబట్టే నేను బోర్డ్‌ ఎగ్జామ్‌ పాస్‌ కాగలిగాను. ఇద్దరం కలిసి చదువుకునేవాళ్లం కాబట్టి మా మధ్య ప్రేమ మొదలైంది. టెన్త్‌ అయ్యాక ఇద్దరం వేరే వేరే కాలేజీలకి వెళ్లిపోవాలి.  అలా అయితే దూరం అవుతాం. ‘ఈ వ్యక్తిని వదులుకోకూడదు’ అనే ఫీలింగ్‌ ఇద్దరిలోనూ ఉంది. అప్పుడు తను ప్రపోజ్‌ చేయడం, నేను ఒప్పుకోవడం జరిగింది.

మీది రాయల్‌ మరాఠీ ఫ్యామిలీ అంటే రాజుల కుటుంబం కదా... మరి ఇంట్లో ఒప్పుకున్నారా?
ఒప్పుకోలేదు. ఇంట్లోవాళ్లను ఎదిరించాలని మాకూ లేదు. అప్పుడు హిమాలయ్‌ చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. అదే సమయంలో నాకు ‘మైనే ప్యార్‌ కియా’లో యాక్ట్‌ చేసే అవకాశం వచ్చింది. అమ్మానాన్న కూడా ఓకే అన్నారు.

అంటే.. ఆకర్షణకి, ప్రేమకీ తేడా తెలియని వయసు కాబట్టి మీ ఇంట్లోవాళ్లు మీ ఇద్దరి ప్రేమను కాదన్నారా?
మా మధ్య ఉన్నది ఆకర్షణ కాదు... ప్రేమే. అదే విషయం నాన్నతో చెబుతూ ‘మాది ట్రూ లవ్‌’ అన్నాను. అయితే అతను అమెరికా నుంచి వచ్చాక కూడా నిన్ను కలవడానికి వస్తాడేమో చూద్దాం. ఒకవేళ వస్తే మాకేం అభ్యంతరం లేదన్నారు. హిమాలయ్‌ అమెరికా నుంచి రాగానే మేం కలిశాం. వెళ్లేముందు నా మీద ఎంత ప్రేమ ఉందో తిరిగొచ్చాక కూడా అంతే ఉంది. అమెరికాలో ఒక్కడే ఉన్నాడు. కావాల్సినంత స్వేచ్ఛ. పడాలనుకుంటే ఏదైనా అమ్మాయితో రిలేషన్‌ మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ హిమాలయ్‌కి నేనంటే ప్రేమ. అది మా పెద్దలకు కూడా అర్థమైంది. దాంతో మా పెళ్లికి ఒప్పుకున్నారు.

ఇప్పటి యూత్‌ లవ్‌లో ఉంటే రెస్టారెంట్లు, సినిమాలంటూ తిరుగుతుంటారు. అప్పట్లో సూర్యాస్తమయం కాకముందే మీరు ఇంట్లో ఉండాలనే నిబంధన ఉండేదట?
అవును. స్కూల్‌ ఫినిష్‌ కాగానే ఇంటికి వెళ్లిపోవాలి. దాంతో మేమిద్దరం ఎక్కడా బయటకు వెళ్లింది లేదు. స్కూల్లో మాట్లాడుకోవడమే. అసలు పబ్బులు, డిస్కో థెక్‌లు పెళ్లయ్యాకే చూశాను. అలాగే డిన్నర్‌ డేట్, నైట్‌ పార్టీలన్నీ కూడా పెళ్లయ్యాక చేసుకున్నవే. పెళ్లి కాకముందు పుట్టింట్లో చాలా పట్టింపుల మధ్య పెరిగాను. ప్రపంచం చూడ్డానికి కుదిరేది కాదు. కట్టుబాట్లు ఉండేవి. బట్‌.. నేనో కంప్లైంట్‌లా ఇది చెప్పడంలేదు. ఓ పెద్ద ఫ్యామిలీలో అలా కట్టుబాట్లు ఉండటం సహజమే కదా.

మైనే ప్యార్‌ కియా’లో సల్మాన్‌ ఖాన్‌ కోసం స్వెటర్‌ కుట్టారు. మరి రియల్‌ లైఫ్‌ లవర్‌ హిమాలయ్‌కి ఇచ్చిన గిఫ్ట్స్‌ గురించి?
మేం చదువుకున్న రోజుల్లో మాకు ప్యాకెట్‌ మనీ ఇచ్చేవారు కాదు. కానీ ఏం కావాలన్నా కొనిపెట్టేవారు. ఇంట్లో నాకిది కావాలని అడిగితే, ‘అది ఎంత’ అనడిగేవారు. సరిగ్గా ఆ డబ్బు ఇచ్చేవారు. దాంతో ఏం మిగిలేవి కావు. ఒకవేళ హిమాలయ్‌కి ఏమైనా ఇవ్వాలంటే.. ఒకరోజు రిక్షాలో స్కూల్‌కి వెళ్లడం మానేసేదాన్ని. అలాగే ఒకరోజు స్కూల్‌ క్యాంటీన్‌లో తినడం మానుకునేదాన్ని. ఆ డబ్బుతో గ్రీటింగ్‌ కార్డులు కొనిచ్చేదాన్ని. అంతకుమించి వచ్చేవి కావు (నవ్వుతూ).

‘మైనే ప్యార్‌ కియా’ తర్వాత అప్పటి కుర్రకారుకి మీరు డ్రీమ్‌ గర్ల్‌ అయిపోయారు. ఆ సినిమా తర్వాతే మీ పెళ్లయింది. మరి అభిమానులు రాసిన లవ్‌ లెటర్స్‌కి హిమాలయ్‌ అసూయపడేవారా?
లేదు. కానీ భార్య అంటే తను చాలా పొసెసీవ్‌. చెబితే నమ్మరేమో కానీ రోజుకి మూడు బస్తాల లెటర్స్‌ వచ్చేవి. పోస్ట్‌మేన్‌ అయితే అన్నేసి లెటర్లు తీసుకొస్తున్నందుకు ఎక్స్‌ట్రా మనీ అడిగేవారు (నవ్వుతూ). వీలైనన్ని ఉత్తరాలు చదివేదాన్ని.

అంత అభిమానాన్ని సంపాదించుకుని సినిమాలు వదులుకున్నప్పుడు మీ ఫ్యాన్స్‌ ఫీలయ్యారు. అలా సినిమాలు వదులుకున్న విషయంలో ఇప్పుడేమైనా పశ్చాత్తాపపడుతుంటారా?
లేదు. మీరు చెప్పండి? నేనెందుకు పశ్చాత్తాపపడాలి? హిమాలయ్‌తో నా మ్యారీడ్‌ లైఫ్‌ బ్రహ్మాండంగా ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకేం తక్కువైందని రిగ్రెట్‌ అవ్వాలి. ఫ్యాన్స్‌ నన్ను ఎక్కువ సినిమాల్లో చూడాలని కోరుకోవడం సహజం. అయితే నాకు పర్సనల్‌ లైఫ్‌ ముందు ప్రొఫెషనల్‌ లైఫ్‌ పెద్దదిగా అనిపించలేదు. ఐయామ్‌ హ్యాపీ. అంటే.. జీవితం ఓ ‘అందమైన కల’లా బ్రహ్మాండంగా ఉందన్నమాట...నెవర్‌. జీవితం ఎప్పుడూ అలా ఉండదు.

ఇద్దరు కలిసి జీవించడం మొదలుపెట్టాక లైఫ్‌ ‘ఫెయిరీ టేల్‌’లా ఉండదు. ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. చిన్న చిన్న కుదుపులను తట్టుకోవాలి. అన్నింటినీ దాటుకుంటూ జీవించినప్పుడే ఆ ప్రేమ ఇంకా పెరుగుతుంది. మా బంధం మొదలై 30 ఏళ్లు. ఇంకా మా ప్రేమ బలంగా ఉందంటే కారణం మా జీవితం ‘ఫెయిరీ టేల్‌’ కాకపోవడమే. అన్ని కుటుంబాల్లో అప్పుడప్పుడూ ఉండే సహజమైన ఇబ్బందులు ఉండేవి. వాటిని పరిష్కరించుకోవడానికి మేం ఇద్దరు చేసిన కృషి మా బంధాన్ని ఇంకా బలపరిచింది.

బాగుంది... కానీ అమ్మాయిలే కెరీర్‌ని ఎందుకు త్యాగం చేయాలి?
30 ఏళ్ల క్రితం పరిస్థితి వేరు. ఇప్పుడు లైఫ్‌ చాలా సింపుల్‌ అయింది. అత్తామామలు కూడా కోడళ్లను ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఉద్యోగం చేయమంటున్నారు, ఫ్యామిలీ అంతా అర్థం చేసుకుంటున్నారు. అప్పట్లో అర్థం చేసుకునేవాళ్లు లేరని కాదు.. అయితే అమ్మాయి ఇంటినీ, జాబ్‌నీ బ్యాలెన్స్‌ చేసే పరిస్థితి ఉండేది కాదు. నా మటుకు నేను చెప్పాలంటే.. నేను త్యాగం చేసినట్లుగా ఫీలవ్వడంలేదు. కెరీర్‌ వదిలేయడం రాంగ్‌ డెసిషన్‌ కాదు.

ఎందుకంటే నా పిల్లల ఎదుగుదలను చూశాను. ఇవాళ మా అబ్బాయి, అమ్మాయి.. మంచివాళ్లగా ఎదిగారంటే కారణం నేను చాలా ఫోకస్డ్‌గా ఉండటంవల్లే. మంచీ చెడూ నేర్పించగలిగాను. ఇప్పుడు వాళ్లిద్దరూ ‘అమ్మా.. మమ్మల్ని ఇంతవాళ్లను చేశావ్‌. ఇక నీ బాధ్యత అయిపోయింది. నువ్వు హ్యాపీగా సినిమాలు చేసుకో’ అని ఎంకరేజ్‌ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.

మీ అబ్బాయి అభిమన్యు ‘మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా’ ద్వారా హీరో అయ్యారు. తల్లిగా మీ ఫీలింగ్‌?
నేను థియేటర్‌కి వెళ్లి చూశాను. కొన్ని సీన్లకు ఆడియన్స్‌ చప్పట్లు కొట్టడం చూసి ఎమోషనల్‌ అయ్యాను. అప్పట్లో నా ఫస్ట్‌ మూవీ ‘మైనే ప్యార్‌ కియా’ని థియేటర్లో చూడలేదు. నా ఒడిలో ఆడుకుని, నా వేలి పట్టుకుని నడిచిన నా చిన్ని అభిమన్యు ఇవాళ ఇంత ఎత్తుకు ఎదిగాడనే ఫీలింగ్‌తో నోట మాట రాలేదు. అభిమన్యు ఏదో ఆషామాషీగా ఈ సినిమా చేయలేదు చాలా ఫోకస్డ్‌గా చేశాడు.

రిస్కీ ఫైట్స్‌ డూప్‌ లేకుండా చేశాడట కదా?
అవును. అసలైతే నన్ను లొకేషన్‌కి రావద్దన్నాడు. అయినా ఒకరోజు నేను షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లాను. అభిమన్యు పైనుంచి దూకే సీన్‌ తీస్తున్నారు. ‘ఏంటిది? డూప్‌ పెట్టి తీయొచ్చు కదా’ అని కంగారుపడుతూ యూనిట్‌ని అడిగాను. ‘మేం అలానే అన్నాం కానీ మీ అబ్బాయే చేస్తానన్నారు’ అన్నారు. ఆ తర్వాత అభిమన్యుని ఎందుకింత రిస్క్‌ అని అడిగితే – ‘‘డూప్‌తో అంటే లాంగ్‌ షాట్స్‌ తీస్తారు. ఫేస్‌ బాగా చూపించరు. అదే నేనే చేస్తే ఫేస్‌ కూడా చూపిస్తారు. లాంగ్‌ షాట్స్‌ అంటే నేను చేయలేదని తెలిసిపోతుంది. అది నాకిష్టం లేదు’’ అన్నాడు. ఈ ప్రపంచంలో నేను, హిమాలయ్‌ మోస్ట్‌ లక్కీయస్ట్‌ పేరెంట్స్‌.

అలా ఎందుకు అంటున్నానంటే.. మేం దేనికీ మా పిల్లలను ఫోర్స్‌ చేయాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా అభిమన్యు అయితే చాలా ఫోకస్డ్‌గా ఉంటాడు. చదువుకునే రోజుల్లో, చదువు.. చదువు అని తన వెంటపడాల్సిన అవసరం రాలేదు. ‘ఇక చదివింది చాలు.. వెళ్లి ఆడుకో’ అని మా అంతట మేమే చెప్పాల్సి వచ్చేది. అంతలా చదువుకునేవాడు. తను మంచి స్పోర్ట్స్‌మేన్‌ కూడా. ఏం చేసినా హండ్రెడ్‌ పర్సెంట్‌ చేయాలనుకుంటాడు.

మీ అమ్మాయి అవంతిక గురించి?
అవంతిక లండన్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేసింది. మంచి విజన్‌ ఉన్న అమ్మాయి. నేను యాక్ట్‌ చేస్తున్న ఓ సినిమా సెట్స్‌కి వచ్చింది. ‘మామ్‌.. నేనిలా చేయగలనని అనుకుంటున్నావా?’ అనడిగింది. ‘ఒకవేళ నువ్వు చెయ్యాలనుకుంటే మాత్రం చాలా హార్డ్‌వర్క్‌ చేయాలి. యాక్టింగ్‌ క్లాసెస్‌కి వెళ్లాలి. పోటీని తట్టుకోవాలి. ఇంకా చేయడానికి ఏమీ లేదు అన్నంతగా హండ్రెడ్‌ పర్సంట్‌ వర్క్‌ చెయ్యాలి’ అన్నాను. హార్డ్‌వర్క్‌ చేసే మనస్తత్వం తనది. ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే మాకేం అభ్యంతరం లేదు.

ఓకే.. మీ సినిమాల విషయానికొద్దాం.. తెలుగులో చేస్తున్న సినిమా ‘కిట్టీ పార్టీ’ గురించి?
నేను మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ఒకటి బలంగా నిర్ణయించుకున్నాను. మంచి పాత్ర అయితేనే చేయాలనుకున్నాను. ‘కిట్టీ పార్టీ’లో దీప్తీ భట్నాగర్, మధుబాల.. ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. వాళ్లందరితో కలిసి సినిమా చేయడం హ్యాపీ. ఇందులో నాది చాలా మంచి పాత్ర.

అక్క, వదిన, అత్త, అమ్మ పాత్రలకు రెడీయేనా?
చూడండీ.. మన జీవితంలో మనం ఎవరికో ఒకరికి అక్కగా, వదినగా, అత్తగా, అమ్మగా ఉంటాం. వయసుతో సంబంధం లేదు. మనం టీనేజ్‌లో ఉన్నప్పుడే మనల్ని అత్తా అని పిలవడానికి బంధువుల్లో ఎవరో ఒకరి పిల్లలు ఉంటారు. అలాంటప్పుడు స్క్రీన్‌ మీద ఆ పాత్రలు చేయడానికి వెనకాడటం ఎందుకు? అయితే ఆ పాత్రలో స్టఫ్‌ ఉండాలి. ఏదో అలా వచ్చామా? నాలుగు డైలాగులు చెప్పామా... అన్నట్లు ఉండకూడదు.

మరి నెగటివ్‌ రోల్‌ చేయాలని లేదా? అసలు మీరు అలాంటి పాత్రలకు సూట్‌ అవుతారని అనుకుంటున్నారా?
నెగటివ్‌ రోల్స్‌ చేయాలని ఉంది. అయితే మీరన్నట్లు సూట్‌ అవుతానా? అనే సందేహం ఉంది. అందుకే లుక్స్‌తో కాకుండా మైండ్‌ గేమ్‌ ఆడే విలనీ క్యారెక్టర్‌ అయితే బెస్ట్‌ అనుకుంటున్నాను. ఆర్టిస్ట్‌గా నాలో ఇంకో కోణం చూపించాలంటే నెగటివ్‌ రోల్స్‌ చేయాలి.

రియల్‌ లైఫ్‌లో మీలో నెగటివ్‌ యాంగిల్‌ని తీసిన సందర్భాలు. ఫర్‌ ఎగ్జాంపుల్‌ ఇండస్ట్రీలో ఎవరైనా మిస్‌బిహేవ్‌ చేసినప్పుడు?
సినిమా ఇండస్ట్రీలో నాకెలాంటి చేదు అనుభవం లేదు. ‘మైనే ప్యార్‌ కియా’ తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నా భర్త హిమాలయ్‌తో కలిసి నటించాను. ఏ ప్రొడక్షన్‌ హౌన్‌లో చేసినా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌ ఉండేది.

ఒకవేళ ఎవరైనా అభ్యంతరకరంగా ప్రవరిస్తే ఎదుర్కొనేంత ధైర్యం మీలో ఉందా?
అప్పుడు నేను రెండో బేబీతో ప్రెగ్నెంట్‌. మా పెద్దబ్బాయ్‌ అభిమన్యు, నేను థియేటర్‌కి వెళ్లాం. వెనక సీట్లోని వ్యక్తి నన్ను  తాకడం మొదలుపెట్టాడు. చెంప చెళ్లుమనిపించాను. చుట్టూ ఉన్నవాళ్లు నాకు సపోర్ట్‌ చేశారు. ఒకవైపు నేను ప్రెగ్నంట్‌ అని కనబడుతోంది. ఈ స్థితిలో ఉన్న ఏ స్త్రీ గురించి అయినా ఏ మగవాడూ అభ్యంతరకరంగా ఆలోచించడని మనం నమ్ముతాం. ఎక్కడో కొందరు ఇలాంటి మృగాలు ఉంటారు.

హిమాలయ్‌కి ఫోన్‌ చేస్తే వచ్చాడు. అతడ్ని పోలీసులకు అప్పగించాం. తాకాడు కదా అని ఊరుకుంటే అతను ఇంకో అమ్మాయి దగ్గర కూడా ఇలానే చేస్తాడు. అందుకే నలుగురిలో పరువు తీసేయాలి. భాగ్యశ్రీ అందంగా ఉంటుంది, బాగా నటిస్తుంది, ఫ్యామిలీ లైఫ్‌లో చక్కగా సెటిలైంది.. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ అవసరమైతే భాగ్యశ్రీ ఇలానూ చేయగలుగుతుంది (నవ్వుతూ).

మీ మాటలు అమ్మాయిలకు ధైర్యం చెబుతున్నట్లు ఉన్నాయి. ఏదైనా సినిమాలో మగవాడి మీద తిరగబడే పాత్రలు చేశారా?
పేరు గుర్తు లేదు.. శివరాజ్‌కుమార్‌ సరసన ఒక కన్నడ సినిమా చేశాను. ఆ సినిమాలో నా అక్క పాత్ర తన భర్త పెట్టే బాధలు భరించలేక చనిపోతుంది. దాంతో నేను పురుష ద్వేషిని అవుతాను. వాళ్లను హింసించాలనే ధ్యేయం ఉంటుంది. శివరాజ్‌కుమార్‌తో పెళ్లవుతుంది. ఒక భర్త తన భార్యను ఏ విధంగా హింసపెడతాడో అవన్నీ ఇతడ్ని పెడతాను. ఇంటి పనులు చేయించడం, కొట్టడం.. ఇలా అన్నమాట. శివరాజ్‌కుమార్‌ ఆ క్యారెక్టర్‌ చేయడం గ్రేట్‌. భర్తని అలా బాధపెట్టాలని చెప్పడంలేదు కానీ మిమ్మల్ని బాధపడితే ఊరుకోవద్దు.
డి.జి. భవాని

ఫ్యామిలీ ట్రిప్స్‌ వెళుతుంటారా?
ఇంట్లో అందరం బిజీ, అందుకే ఏడాదికి రెండు ట్రిప్స్‌ ప్లాన్‌ చేస్తుంటాం. ఒకటి వీకెండ్‌ షార్ట్‌ ట్రిప్‌. ఇది లోకల్‌ ట్రిప్‌. ఒకటి లాంగ్‌ ట్రిప్‌. విదేశాలు వెళుతుంటాం. పది రోజులు ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి, ముంబై వస్తాం. అలాగే నలుగురం ముంబైలో ఉన్నప్పుడు ఇంట్లో అందరం కలిసి ఒక పూట భోజనం అయినా చేయాలన్నది రూల్‌. ఆ సమయంలో ఫోన్లు పక్కన పెట్టేస్తాం. కెరీర్‌ గురించి, పర్సనల్‌ విషయాలు మాట్లాడుకుంటాం.

మరిన్ని వార్తలు