భకర్‌వాడి

10 Oct, 2018 00:56 IST|Sakshi

క్విక్‌ ఫుడ్‌ 

కావలసినవి: మైదా పిండి – ఒకటిన్నర కప్పులు ; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు + డీప్‌ ఫ్రైకి సరిపడా; ధనియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; సోంపు – అర టీ స్పూను; లవంగాలు – 2; నువ్వులు – ఒక టీ స్పూను ; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – చిటికెడు; గరం మసాలా – ఒక టీ స్పూను; ఆమ్‌ చూర్‌ – అర టీ స్పూను; సెనగ పిండి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; పంచదార – ఒక టీ స్పూను

తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, 3 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి పావు గంట సేపు పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి వేయించాలి. జల్లెడ పట్టిన సెనగ పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఆ పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. నూనె లేకుండా స్టౌ మీద బాణలి ఉంచి, అందులో ధనియాలు వేసి వేగాక, జీలకర్ర, సోంపు, లవంగాలు జత చేసి మరోమారు వేయించాలి. బాగా వేగిన తరవాత నువ్వులు జత చేసి వేయించి దింపి చల్లారాక, మిక్సీలో వేసి పొడి చేయాలి. మిరప కారం, పసుపు, గరం మసాలా, ఆమ్‌ చూర్, జత చేసి మరో మారు మిక్సీ తిప్పాలి. ఈ పొడిని సెనగ పిండిలో వేసి, కొద్దిగా ఉప్పు, పంచదార పొడి కూడా జత చేసి బాగా కలపాలి. పక్కన ఉంచిన మైదా పిండిని ఒక ఉండ పరిమాణంలో తీసుకుని చపాతీలా ఒత్తి, దాని మీద కొద్దిగా నూనె పూయాలి. సెనగ పిండి మిశ్రమాన్ని పైనంతా ఒక పొరలా పూయాలి. ఒత్తి ఉంచుకున్న చపాతీని కొద్దికొద్దిగా మడుస్తూ గట్టిగా దగ్గరగా ఉండేలా రోల్‌ చేయాలి. ఆఖరి మడత దగ్గర మరి కాస్త నూనె పూసి చుట్టి రోల్‌ చేయాలి. చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. చేతికి కొద్దిగా తడి చేసుకుని కట్‌ చేసిన ముక్కల అంచులకు తడి పూయాలి. బాణలిలో నూనె కాగిన తరవాత వీటిని అందులో వేసి రంగు మారేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

మరిన్ని వార్తలు