నేటి కథలకు విభిన్న భూమిక

25 Jan, 2020 03:34 IST|Sakshi

యంగ్‌ బాలీవుడ్‌ –12 / భూమి పెడ్నేకర్‌

తను గ్లామర్‌ కోసం ఎక్స్‌పోజ్‌ చేయదు. కాని సీన్‌ డిమాండ్‌ చేస్తే వివస్త్రగా మారడానికి సంకోచించదు. ముఖకవళికలతో చాలా భావాలు పలికించగలదు. కాని చెప్పాల్సిన మాటలు చెప్పాలనుకున్నప్పుడు అనుమతి లేని మాటలు మాట్లాడ్డానికి వెనుకాడదు. మర్యాదస్తులు చాలా మంది ‘ఈ పాత్రనా?’ అనుకునేవి చేసి ‘బాగుందే’ అనిపించేలా చేసిన నటి భూమి పెడ్నేకర్‌. ‘దమ్‌ లగాకే హైసా’, ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమకథ’, ‘శుభ్‌ మంగళ్‌ సావధాన్‌’ వంటి ఈ కాలపు కథలకు ఈమే సరైన ‘భూమి’క.

బాలీవుడ్‌లో ఇప్పుడు వస్తున్న కథలను పోల్చినప్పుడు తెలుగులో ఇంకా ‘అంగీకారం ఉన్న’, ‘సేఫ్‌’ కథలే తయారవుతూ వస్తున్నాయని అనుకోవాలి. బాలీవుడ్‌లో కమర్షియల్‌ హీరోలు, బిగ్‌ స్టార్స్‌ కూడా మంచి కథలు వస్తే వాటిని ఎగిరి గంతేసి చేస్తున్నారు. స్త్రీల శానిటరీ నాప్‌కిన్‌ గురించి అక్షయ్‌ కుమార్‌ ‘పాడ్‌ మేన్‌’ చేసినట్టు, ఆడపిల్లలను రెజ్‌లర్స్‌ను చేయడానికి తాపత్రయ పడే వయసు మళ్లిన తండ్రిగా ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ చేసినట్టు, తన వర్గానికి చెందిన పిల్లలను ఐఐటి ఎంట్రన్స్‌లో గెలిపించడానికి కష్టపడే నిమ్నవర్గాల ట్యూటర్‌గా హృతిక్‌ రోషన్‌ ‘సూపర్‌ 30’ చేసినట్టు మన పెద్ద హీరోలు అలాంటి కథలను చేయరు.
ఇక చిన్న సినిమాలలో వస్తున్న కథలైతే అనూహ్యంగా ఉంటున్నాయి. రాజ్‌కుమార్‌ రావ్, ఆయుష్మాన్‌ ఖురానా, నవాజుద్దీన్‌ సిద్దిఖీలాంటి వారు సినీ లాంఛనాలు పాటించని కథలను ఎంచుకుంటున్నారు. మరి ఇలాంటి కథలను సపోర్ట్‌ చేసే ఫిమేల్‌ ఆర్టిస్ట్‌లు కావాలి కదా. కొంకణా సేన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే... ఇప్పుడు భూమి పెడ్నేకర్‌ అందుకు సిద్ధంగా ఉన్నారు.

‘శుభ్‌ మంగళ్‌ సావధాన్‌’ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా, భూమి పెడ్నేకర్‌ ప్రేమించుకుంటారు. పెద్దలు పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి పనులు మొదలైపోతాయి. అమ్మాయికి, అబ్బాయికి ఏకాంతం దొరుకుతుంది. ఎలాగూ పెళ్లి కాబోతూ ఉంది. ఇప్పుడు ఏకాంతం దొరికింది. ఇద్దరూ అడ్వంచర్‌ చేద్దామనుకుంటారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటారు. కాని వదులుకోవాల్సి వస్తుంది. దానికి కారణం అబ్బాయి. అతడు ‘అందుకు’ సిద్ధం కాలేకపోతాడు. ఆమెను సమీపించలేకపోతాడు. చేయవలసింది చేయలేకపోతాడు. సాధారణంగా ఇంకో అమ్మాయి అయితే దీనికి నానా యాగీ చేయాలి. ఊరంతా చెప్పి అబ్బాయిని రిజెక్ట్‌ చేయాలి. పెళ్లి వద్దు బాబోయ్‌ అని చెప్పాలి. కాని ఆ పాత్ర చేసిన భూమి పెడ్నేకర్‌ నిజంగా ఆ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానాను ప్రేమించి ఉంటుంది. ఆమెకు సంబంధించినంత వరకు అతడి విషయంలో ప్రేమ ముందు ఉంటుంది. తర్వాతే దైహిక విషయం. ‘ఏం కాదు... అది జెంట్స్‌ ప్రాబ్లమ్‌... మెల్లగా పోతుంది... మనం పెళ్లి చేసుకుందాం’ అంటుంది.

కాని ఆయుష్మాన్‌ ఖురానా పూర్తిగా వైముఖ్యంలోకి వెళ్లిపోయి ఉంటాడు. ఇక తన జీవితం సర్వనాశనమైపోయినట్టే భావిస్తాడు. ఆమె నుంచి దూరం దూరం వెళ్లిపోతూ ఉంటాడు. భూమి ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతో సహనంతో డీల్‌ చేస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. శోభనం జరగడం లేదని పెద్దలకు తెలిసినా భర్తను వెనకేసుకొస్తుంది. చివరకు అతడు సరి అయ్యేలా చూసి తన కాపురాన్ని సరి చేసుకుంటుంది. హిందీలో వచ్చిన తొలి ‘ఫ్యామిలీ సెక్స్‌ కామెడీ’ ఈ సినిమా. కాని అలా అనిపించదు. దానికి కారణం పురుషుల అంగస్తంభన సమస్య పట్ల ఆ టీమ్‌ అంతటికీ చీప్‌ భావన లేదు.  ఆ సమస్యను వాళ్లు హేళన చేయాలనుకోలేదు. దానిని ఎదుర్కొనే పురుషుల, వారి జీవితంలో భాగమైన స్త్రీలను చూపాలనుకున్నారు. ఆ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఆయుష్మాన్‌తో పాటు భూమి పెడ్నేకర్‌కు కూడా చాలా పేరు వచ్చింది. భూమి పెడ్నేకర్‌ది ముంబై. వాళ్ల నాన్నది గోవా.

అమ్మది హర్యాణ. గోవాలోని ‘పెడ్నే’ అనే పల్లెకు చెందిన వారంతా తమ ఇంటి పేరు ‘పెడ్నేకర్‌’ అని పెట్టుకుంటారు. అలా భూమి ఇంటి పేరు పెడ్నేకర్‌ అయ్యింది. భూమి మొదటి నుంచి నటి కావాలనుకుంది. 15 ఏళ్లు రావడంతోటే సుభాష్‌ఘాయ్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో నటన నేర్చుకోవడానికి చేరింది. అయితే ఫీజు కట్టలేక ఒక సంవత్సరం తర్వాత ఆ కోర్స్‌ మానేయాల్సి వచ్చింది. 17 ఏళ్లు వచ్చేసరికి సినిమా పరిశ్రమలో పని చేయాలనుకుంది. అయితే ఆమెకు నటిగా పని దొరకలేదు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌కు కాస్టింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న షానూ శర్మకు అసిస్టెంగ్‌గా ఉద్యోగం దొరికింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో ‘చక్‌ దే ఇండియా’, ‘రబ్‌ నే బనాదీ జోడీ’ వంటి సినిమాలకు పని చేసింది. అవే సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న మనీష్‌ శర్మకు భూమిలో మంచి నటి ఉందని అనిపించింది. ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’, ‘శుద్ధి దేశీ రొమాన్స్‌’ వంటి సూపర్‌ హిట్స్‌కు దర్శకత్వం వహించిన మనీష్‌ శర్మ తాను నిర్మాతగా మారి యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌తో కలిసి తీయాలనుకున్న ‘దమ్‌ లగాకే హైస్సా’ సినిమాలో హీరోయిన్‌గా భూమిని ఎంపిక చేసుకోవడంతో భూమి కెరీర్‌ పెద్ద మలుపు తిరిగింది.

భాగ్యరాజా తీసిన ‘చిన్న ఇల్లు’, బాలూ మహేంద్ర తీసిన ‘సతీ లీలావతి’లకు హిందీ రూపమే ‘దమ్‌ లగాకే హైస్సా’. స్థూలకాయస్తురాలైన భార్యను చిన్న చూపు చూసే భర్త కథ ఇది. ఆ భర్తకు ఆమె బుద్ధి చెప్పే కథ. అయితే ఈ రెండు సినిమాల్లోను స్థూలకాయం ఉన్న హీరోయిన్‌గా మలయాళ నటి కల్పన నటించింది. ఆమె స్వాభావికంగా స్థూలకాయస్తురాలు కాబట్టి పాత్ర కోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ కావాల్సిన అవసరం లేకపోయింది. కాని భూమి ఆ పాత్ర కోసం ఏకంగా 12 కిలోల బరువు పెరిగింది. ‘దమ్‌ లగాకే హైస్సా’ పెద్ద హిట్‌. రాత్రికి రాత్రి భూమిని స్టార్‌ని చేసిన సినిమా అది. అయితే ఆ వెంటనే అవకాశాలు ఆమెకు రాలేదు. సినిమా కోసం లావుగా అయిపోయిన అమ్మాయిని హీరోయిన్‌గా ఎలా తీసుకుంటారు? ఆ మొత్తం బరువును కోల్పోడానికి భూమికి దాదాపు సంవత్సరం పట్టింది. ఆ బరువు కోల్పోయాక ఆమెకు వచ్చిన అవకాశం ‘టాయిలెట్‌–ఏక్‌ ప్రేమ్‌ కథ’. ఆడవాళ్లకు టాయిలెట్స్‌ లేకపోవడం, వారు ఆ అవసరానికి ఆరుబయలుకు వెళ్లాల్సి రావడం దీనిని నిరసించే కొత్త పెళ్లికూతురిగా భూమి ఈ సినిమాలో నటించింది. అక్షయ్‌ కుమార్‌ కంటే భూమికే మంచి పేరు తెచ్చిన హిట్‌ సినిమా ఇది. ఇప్పుడు భూమి ఆగాల్సిన అవసరం రాలేదు.

చాలా బోల్డ్‌గా ‘లస్ట్‌ స్టోరీస్‌’లో నటించింది. ఇందులో పెళ్లికాని యువకుడితో లైంగిక సంబంధంలో ఉండే పని మనిషి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ‘రైఫిల్‌ షూటర్స్‌’గా పేరుపొందిన ముసలమ్మల బయోపిక్‌లో ఒక ముసలమ్మగా ‘సాండ్‌ కి ఆంఖ్‌’లో నటించింది. ఇంత చిన్న వయసులో ముసలిపాత్ర పోషించడానికి భూమి చేతులు నులుముకోలేదు. ఆ తర్వాత మళ్లీ ఆయుష్మాన్‌ ఖురానా బట్టతల సమస్య చిత్రం ‘బాలా’లో, ఒకప్పటి సూపర్‌ హిట్‌ ‘పతీ పత్నీ ఔర్‌ ఓ’ రీమేక్‌లో భూమి తన నట పరంపర కొనసాగించింది. ఈ సినిమాలన్నీ హిట్స్‌ సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. భూమి పెద్ద గొప్ప సౌందర్యవతి కాదు. కాని ఆమె ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు ఆమె ఇచ్చే సౌందర్యం అసామాన్యంగా ఉంటుంది. ఆ పాత్ర ఒక నమ్మదగిన పాత్రగా మనకు పరిచయమున్న పాత్రగా మారడంలో భూమి చూపించే నైపుణ్యం, ప్రతిభ ఆమెను ఈ రంగంలో విజయదాయినిని చేశాయి. భూమి పెడ్నేకర్‌ సినిమాలు ఏవీ చూడకపోతే ఇప్పుడు చూడటం మొదలుపెట్టండి. ఆమెకు మీరు ఫ్యాన్‌ అవుతారు. తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తారు.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు