మనిషిలోని  దైవత్వాన్ని లోకం చూడాలి

12 May, 2019 01:28 IST|Sakshi

‘నేను చేసే క్రియలకన్నా గొప్ప క్రియలు మీరు చేస్తారు’ అన్నాడు ఒకసారి యేసుప్రభువు (యోహాను 14:12). ‘నీవు పాపివి’ అంటూ  వేలెత్తి చూపించిన యేసుప్రభువే మనిషిని ఇంతగా హెచ్చించడం ఒకింత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్‌ చెబుతోంది. అంటే మనిషి స్వరూపం, స్వభావం, సౌందర్యం, అతనిలోని స్వతంత్ర భావన, సాధికారత, సదాశయాలు, సద్భావనాలన్నీ దేవుని లక్షణాలే. అందువల్ల గొప్పపనులు చెయ్యగలిగిన శక్తిసామర్థ్యాలను దేవుడు మనిషిలో ముందే నిక్షిప్తం చేశాడు. కాకపోతే మనిషిలోని స్వతంత్ర భావనలతోనే చిక్కు ఏర్పడింది. మనిషిని తన చెప్పుచేతల్లో నడిచే ఒక మరయంత్రంగా కాకుండా స్వతంత్ర చలనం, జీవనమున్న ఒక ‘సామాజిక శక్తి’ గా దేవుడు ప్రేమతో, కనికరంతో తయారు చేశాడు. లోకాన్ని పగలంతా వెలుగుతో నింపే సూర్యుణ్ణి దేవుడు సృష్టిస్తే, రాత్రిళ్ళు కూడా ఎంతో వెలుగు నిచ్చే విద్యుచ్ఛక్తిని దానితో వెలిగే బల్బును థామస్‌ అల్వా ఎడిసన్‌ అనే మానవుడే కనుగొన్నాడు.

అదే విద్యుచ్ఛక్తితో మరెన్నో పనులను మనిషి సునాయాసంగా చేసుకోగలుగుతున్నాడు. నడిస్తే గంటకు మహా అయితే నాల్గు కిలోమీటర్లు మాత్రమే నడిచే మనిషి అదే గంటకు 120 కిలోమీటర్లు నడవగల్గిన వాహనాలను, రైళ్లను, గంటకు 800 కిలోమీటర్లు దూరం ఎగిరి ప్రయాణించగల్గిన విమానాలను ఆవిష్కరించి వాటితో తన జీవితాన్ని సులభ సాధ్యం చేసుకున్నాడు. ఏ విధంగా చూసినా ఇవన్నీ గొప్ప క్రియలే, సంతోషించదగిన విజయాలే. అయితే మనిషి తన సామాజిక బాధ్యతలు నెరవేర్చే విషయంలో కూడా అంతే సమున్నతంగా వ్యవహరించి గొప్ప క్రియలు చేయాలన్నది దేవుని ఆకాంక్ష. అయితే  బైబిల్‌ గ్రంథం మూడవ అధ్యాయంలోనే మానవ చరిత్రను, ఆధ్యాత్మికతను సమూలంగా మరో మలుపు తిప్పిన పరిణామం ఏర్పడింది. తొలిమానవులైన ఆదాము, హవ్వ దైవాజ్ఞను ఉల్లంఘించి పాపం చేశారు.

నాల్గవ అధ్యాయంలో రెండవతరం వాడైన కయీను అసూయతో, పట్టరాని కోపంతో తన తమ్ముడైన హేబెలును హత్యచేసి మానవజాతిని మరింత పతనం వైపునకు మళ్ళించాడు.. అప్పటికి ప్రపంచ జనాభా నలుగురే!! పైగా వారికి శత్రువులంటూ ఎవరూ లేరు. అయినా దుర్మార్గం అంతగా ప్రబలింది. సమస్య ఎక్కడుంది? దేవుడు తనకు సహవాసంగా ఉండేందుకుగాను  ఏర్పర్చుకున్న మనిషి ఇంతగా దేవునికి ఎందుకు దూరమయ్యాడు? అతని స్వతంత్ర భావనలే దానిక్కారణం. ఆ స్వతంత్ర భావనలే స్వార్థానికి, గర్వానికి, దౌర్జన్యానికి ఇలాంటి మరెన్నో దైవవ్యతిరేక దుర్లక్షణాలకు బీజాలు వేశాయి. ఆ కారణంగానే మనిషి ఒక అడుగు పురోగమనం వైపునకు మరో అడుగు తిరోగమనం వైపునకు అన్నవిధంగా ఈనాటి తన జీవనశైలిని నిర్మించుకున్నాడు. సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో పూర్తిగా వెనకబడ్డాడు.  ఇప్పటి టర్కీ దేశంలో ఉన్న లుస్త్ర అనే ప్రాచీన పట్టణంలో పౌలు, బర్నబా పరిచర్య చేస్తున్నపుడు, అవిటివాడైన ఒక వ్యక్తిని పౌలు బాగుచేశాడు.

వాళ్లిద్దరూ చెప్పిన సువార్తకన్నా ఈ అద్భుతకార్యం అక్కడి ప్రజలను గొప్పగా ఆకర్షించింది. అక్కడి వాళ్లంతా తమ మధ్యకు దేవుళ్ళు దిగి వచ్చారంటూ సంబరపడి వాళ్ళిద్దరికీ తమ దేవుళ్ళ పేర్లు కూడా పెట్టారు. వాళ్లకు సన్మానం చేసి జంతువులను వారికి బలివ్వడానికి కూడా ప్రయత్నిస్తే పౌలు, బర్నబా వారిని తీవ్రంగా మందలించారు. ‘మేము దేవుళ్ళం కానే కాదు, జీవము గల్గిన దేవుని వైపునకు మిమ్మల్ని తిప్పడానికి గాను యేసు సువార్త చెప్పడానికి వచ్చామంతే!!’ అంటూ వారిని శాంతింప జేశారు. ఈ రోజుల్లో కూడా సువార్తకన్నా, అద్భుతాలకే ప్రజల ప్రాధాన్యం. సువార్తికులకన్నా, అద్భుతాలు చేసే వారికే ఎక్కువ ఫాలోయింగ్‌!! ఇలా  మనిషిలో దేవుళ్లను చూసేందుకు లోకం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మనిషిలోని  ప్రేమ, క్షమాపణ, నమ్రతతో కూడిన తన దైవికస్వరూపాన్నే లోకం చూడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. 
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌  

మరిన్ని వార్తలు