గల్లీ బాయ్‌ గెలిచాడు

5 Nov, 2019 00:16 IST|Sakshi

బిగ్‌బాస్‌–3 విజేత/ రాహుల్‌ సిప్లిగంజ్‌

డబ్బు, ఐశ్వర్యం, అవకాశాలు కల్పించగల కుటుంబ నేపథ్యం... ఇవి ఉన్నవారు విజేతలు కావడంలో పెద్ద విశేషం లేదు. కాని ఒక పక్కింటి కుర్రాడు, మన గల్లీ కుర్రాడు విజేత కావడం చాలా పెద్ద విశేషం. బిగ్‌బాస్‌-3 రియాలిటీ షోలో చాలా గట్టి కంటెస్టెంట్‌లను దాటి గెలిచిన రాహుల్‌ ఇటీవలి యువతకు ఇన్‌స్పిరేషన్‌గా నిలవవచ్చు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో సినిమా హీరో వరుణ్‌ ఉన్నాడు. సిక్స్‌ప్యాక్‌ అందగాడు అలీ రజా ఉన్నాడు. తన యాసతో ఆకట్టుకునే మహేష్‌ విట్టా ఉన్నాడు. ఇంకా అమ్మాయిలలో అయితే సావిత్రక్కగా ఫేమస్‌ అయి తెలంగాణ బిడ్డగా అభిమానం పొందిన శివజ్యోతి ఉంది. హుషారు శ్రీముఖి ఉంది. తన మంచితనంతో ఆకట్టుకున్న బాబా భాస్కర్‌ ఉన్నాడు. ఇంకా ప్రతి ఒక్కరూ గట్టి పోటీదారులే. అయినప్పటికీ రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. తను తనలాగే ఉండటం, తన ప్రవర్తనతోనే ఆకట్టుకోవడం, పాటగాడిగా తన ప్రతిభ, పెద్దగా మతలబులు చేయకపోవడం ఇవన్నీ అతనికి లాభించాయని చెప్పవచ్చు.

విజయనగర్‌ కాలనీలో రాహుల్‌ ఇల్లు

వృత్తిరీత్యా బార్బర్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రాథమికమైన రెండు కోరికలతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఒకటి: మంచి సొంత సెలూన్‌ తెరవడం. రెండు: ఒక సొంత ఇల్లు సంపాదించుకోవడం. బిగ్‌బాస్‌ విజేతగా ఈ రెండు కోరికలు తీర్చుకోవడం అతనికి ఇక కష్టం కాకపోవచ్చు. రాహుల్‌ది హైదరాబాద్‌ ధూల్‌పేటలోని మంగళ్‌హాట్‌. అతని కుటుంబం ప్రస్తుతం విజయ నగర్‌ కాలనీలోని ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. రాహుల్‌ ఫోక్‌ సింగర్‌గా, సినిమా గాయకునిగా మారకముందు తండ్రితో కలిసి నాంపల్లిలోని శ్రీ సాయి కిరణ్‌ సెలూన్‌లో పని చేసేవాడు. వచ్చిన కస్టమర్లను తన మాటలతో పాటలతో అలరించేవాడు. విజయనగర్‌ కాలనీలో కూడా చుట్టుపక్కల వారికి అతడు ఆత్మీయుడు. ‘రాహుల్‌ మమ్మల్ని చాలా ప్రేమగా పలకరిస్తాడు’ అని అనిల్‌ సింగ్‌ అనే అతని స్నేహితుడు తెలిపాడు. ‘దీపావళి వస్తే చాలా సందడి చేస్తాడు.

నాంపల్లిలో రాహుల్‌ పని చేసిన సెలూన్‌ ఇదే!

ఈసారి పండగ సమయానికి అతడు హౌస్‌లో ఉండటంతో మేమంతా కొంచెం నిరాశ పడ్డాం’ అని మరో స్నేహితుడు శ్రీవత్స చెప్పాడు. హౌస్‌లో ఉన్న రోజుల్లో తోటి కంటెస్టెంట్‌ శ్రీముఖితో తనకి సఖ్యత కుదరలేదు. అదే శ్రీముఖిని రాహుల్‌ ఫైనల్స్‌లో ఓడించడం అభిమానులకే కాదు, ఎక్కువమందికి నచ్చినట్టు కనపడుతోంది. రాహుల్‌ తన నేపథ్యాన్ని, వృత్తిని దాచకుండా గౌరవంతో సొంతం చేసుకోవడం చాలా మందికి నచ్చి ఉండవచ్చు. నాంపల్లిలోని సాయికిరణ్‌ హెయిర్‌ సెలూన్‌లో తండ్రి రాజ్‌కుమార్‌తో బార్బర్‌గా పని చేసిన రాహుల్‌ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, దర్శకుడు రాజమౌళి వంటి వారికి హెయిర్‌ కట్‌ చేసేవాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఇప్పుడు తమ స్నేహితుడే సెలబ్రిటీగా మారడంతో ఇంటి దగ్గర కోలాహాలం ఏర్పడింది. షో ముగిశాక నిబంధనల ప్రకారం ఇంకా జనంలోకి రాని రాహుల్‌ త్వరలో ఇల్లు చేరి తమతో దావత్‌ చేసుకుంటాడని మిత్రులు ఎదురు చూస్తున్నారు.
– జెమిలిప్యాట వేణుగోపాల్, సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు