బిహార్‌ సిఎం అభ్యర్థి

12 Mar, 2020 07:49 IST|Sakshi
పుష్పం ప్రియా చౌదరి

బిహార్‌ రాజకీయాల్లోకి ఒక కొత్త అమ్మాయి వచ్చింది. ఒక కొత్త పార్టీతో వచ్చింది. తనే సీఎం అభ్యర్థిని అని కూడా ప్రకటించుకుంది. ఆమె పేరు పుష్పం ప్రియా చౌదరి. ఆమె పెట్టిన పార్టీ పేరు ‘ప్లూరల్స్‌’. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగబోతున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  జెడియు (ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ), ఆర్‌జేడీ (ప్రతిపక్షంలో ప్రధాన పార్టీ) లను ఢీకొని మరీ.. ముఖ్యమంత్రిని కాగలననే ఆమె నమ్ముతోంది. జెడి(యు) నాయకుడు వినోద్‌ చౌదరి కూతురు ప్రియ. ఆ పార్టీలో ఆమె పైకి ఎదిగే అవకాశాలు ఉన్నా.. సొంతంగా ఎదగాలని బయటికి వస్తోంది. ‘లవ్‌ బిహార్, హేట్‌ పాలిటిక్స్‌’.. ఇదీ ఆమె ట్విట్టర్‌ హ్యాండిల్‌లోని నినాదం.

తన వెబ్‌సైట్‌లో బిహార్‌ ప్రజలకు ఒక బహిరంగ లేఖ కూడా రాసింది. ప్రపంచం ముందుకు వెళుతుంటే.. మనమెందుకు ఇక్కడే ఉండిపోయాం! కారణం మన రాజకీయ నాయకుల  విధానాలు’’ అని ఆ లేఖ సారాంశం. ఈ మార్చి 8న మహిళా దినోత్సవం రోజు రాజకీయాల్లోకి వచ్చారు ప్రియ. బిహార్‌లోని దర్భంగా ఆమె జన్మస్థలం. చిన్న చదువులన్నీ అక్కడే. పెద్ద చదువుల కోసం లండన్‌ వెళ్లారు. డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. తర్వాత... పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఇంకో మాస్టర్స్‌ డిగ్రీ. ప్రియ తండ్రి మాజీ ఎమ్మెల్సీ. ‘‘అమ్మాయికి చెప్పి చూడవయ్యా.. ఎందుకీ రాజకీయాలు’’ అని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అన్నారని అప్పుడే వార్తలు బయటికి వచ్చేశాయి. ప్రియ ఆగేలా లేదు. రాజకీయాల్ని ప్రక్షాళన చేయకుండా వదిలే లానూ లేదు. 

మరిన్ని వార్తలు