శతపద్మం

18 Jun, 2018 01:12 IST|Sakshi

ఆమె డెబ్బయ్‌ ఏళ్లకు పైగా వైద్యం చేస్తున్నారు. మీరు చదివింది నిజమే!ఆమెకు డెబ్బయ్‌ ఐదేళ్లు కాదు డెబ్బయ్‌ ఐదేళ్లుగా వైద్యం చేస్తున్న డాక్టర్‌ ఆమె. మరి ఆమెకిప్పుడు ఎన్నేళ్లు?   వందేళ్లు దాటాయి! ఎల్లుండి బుధవారానికి 102లోకి అడుగు పెడతారు. పేరు డాక్టర్‌ ఎస్‌.ఐ. పద్మావతి. దేశంలో తొలి మహిళా కార్డియాలజిస్ట్‌ ఆమె. వేల గుండెల్ని కాపాడిన చెయ్యి ఆమెది. అంతకంటే ముందు.. యుద్ధం... ఆమె జీవితంలో కల్లోలాన్ని రేపింది. ఆ అలజడిని తట్టుకున్న ‘గుండె’ ఆమెది.

డాక్టర్‌ ఎస్‌. ఐ. పద్మావతి నేషనల్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌. అఖిల భారత జాతీయ హార్ట్‌ ఫౌండేషన్‌కి స్థాపకాధ్యక్షురాలు కూడా. పద్మావతి రంగూన్‌ (బర్మా రాజధాని)లో ఎం.బి.బి.ఎస్‌ చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం రేపిన కల్లోలంతో కొంత విరామం. ఆ తర్వాత 1949లో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఫెలోషిప్‌తో లండన్‌కు వెళ్లారు. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ, హార్వర్డ్‌ మెడికల్‌స్కూల్‌లో చదివారు.

లండన్‌లో కార్డియాలజిస్టుగా ప్రాక్టీస్‌ చేశారు. స్వీడన్‌లో అడ్వాన్స్‌డ్‌ కోర్స్‌ చేసి 1953లోఇండియాకి వచ్చి ఢిల్లీలో మహిళల కోసం మహిళలే డాక్టర్లుగా సేవలందించిన లేడీ హార్డింగే మెడికల్‌ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరారు. ఢిల్లీలో క్లినిక్‌ ప్రారంభించి ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అప్పటికి మనదేశంలో గుండె వ్యాధులకు సరైన వైద్యం లేకపోవడమే కాదు, వ్యాధుల గురించిన అవగాహన కూడా ఉండేది కాదు. ఆ సమయంలో ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి తొలి అడుగు వేశారామె.

వైద్యాన్ని తెచ్చారు
మనదేశంలో కార్డియాలజీ విభాగంలో డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (డిఎమ్‌)కోర్సును ప్రవేశపెట్టడం పద్మావతి చొరవతోనే సాధ్యమైంది. మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజ్‌ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ, జి.బి.పంత్‌ హాస్పిటల్‌లో కార్డియాలజీకి విడిగా డిపార్డ్‌మెంట్‌ ఏర్పాటు చేశారామె. 1978లో  రిటైరయిన తర్వాత నేషనల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ స్థాపించారు.

అంతకుముందు ఆల్‌ ఇండియా హార్ట్‌ ఫౌండేషన్‌ కూడా స్థాపించారు. యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీలో ఇప్పటికీ ఆమె గౌరవ ఆచార్యులు (ఎమెరిటస్‌ ప్రొఫెసర్‌)గా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న వైద్యప్రక్రియలను ఔపోశన పట్టారామె. మనదేశానికి తెలియని వైద్య సేవలను అందుబాటులోకి తేవడానికి జీవితాన్ని అంకితం చేశారు.

ఒకప్పుడు గుండె ఆపరేషన్‌ అంటే విదేశాలకు వెళ్లాల్సిందే, అమెరికా, లండన్‌లకు వెళ్లి ఆపరేషన్‌ చేయించుకోగలిగిన సంపన్నులు మాత్రమే గుండె జబ్బుల నుంచి బతికి బట్టకట్టేవాళ్లు. అలాంటి గుండె వైద్యం ఇండియాకి వచ్చి, పట్టణాలకూ విస్తరించడంలో చొరవ చూపిన దార్శనికత పద్మావతిది.

టెక్స్‌పీరియెన్స్‌
టెక్నాలజీకి ఎక్స్‌పీరియెన్స్‌ తోడయితే డాక్టర్‌ పద్మావతిలా ఉంటుంది. ఆమె చదువుకున్నప్పటి కంటే ఇప్పటి విజ్ఞానం ఎన్నో రెట్లు మెరుగైంది. కొత్త టెక్నాలజీని అందుకోవడంలో తాను నిత్య విద్యార్థినేనంటారామె. ఆమె అనుభవం హృద్రోగ విభాగంలో అధ్యయనానికి దోహదం చేస్తోంది, కొత్త టెక్నాలజీ ముందున్న సవాళ్లేంటో చెబుతోంది. రెండు తరాలను చూసిన ఆమె అనుభవం... కొత్త విద్యార్థులకు... ఔషధాల వాడకం– వాటి సైడ్‌ఎఫెక్ట్స్‌ మీద సంపూర్ణమైన అవగాహన కలగడానికి దోహదం చేస్తోంది.

తండ్రి బర్మాలో
వేల గుండెల్ని కాపాడిన పద్మావతి జీవితంలో గుండెల్ని అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన గతం ఉంది.  యుద్ధం చిన్నాభిన్నం చేసేది దేశాల్ని మాత్రమే కాదు. అనేక జీవితాలు అల్లకల్లోలానికి గురవుతాయన్నారు డాక్టర్‌ పద్మావతి. ఆమె 1917, జూన్‌ 20వ తేదీన బర్మాలో (మయన్మార్‌) పుట్టారు.

ఎంబీబీఎస్‌ పూర్తయ్యే నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ఉధృతమైంది. ‘ఇరవై నాలుగ్గంటల్లో ఖాళీ చేయండి’ అనే హుకుంతో ఆమె తండ్రి భార్యాపిల్లలను ఇండియాకు పంపించేశారు. అలా 1942లో ఉన్నఫళంగా బర్మాను వదిలి స్వస్థలం కోయంబత్తూర్‌కి వచ్చేసింది వారి కుటుంబం. ఆ తర్వాత మూడేళ్లకు ఆయన కోయంబత్తూర్‌కి వచ్చారు. ఆ మూడేళ్ల కాలంలో ఆయన ఆచూకీ కుటుంబానికి తెలియదు.   

బర్మాకి తొలి డాక్టరమ్మ
పద్మావతి చదువుకున్న రోజుల్లో చదువులు, ఉద్యోగాల్లో మహిళలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవాల్సిందే. ఈ తరానికి ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ, రంగూన్‌ మెడికల్‌కాలేజ్‌లో ఎంబీబీఎస్‌లో చేరిన తొలి మహిళ ఆమె.

స్విమ్మింగ్‌ హాబీ!
తన ఆరోగ్య రహస్యం అడిగితే ఆమె నిశ్శబ్దంగా నవ్వుతారు. బర్మాలో మొదలైన స్విమ్మింగ్‌ అలవాటు  ఇప్పటికీ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఫోర్డ్‌ ఫౌండేషన్‌ స్విమ్మింగ్‌ పూల్‌ ఆమె స్విమ్మింగ్‌ పాయింట్‌. ఏడాదిలో ఆరు నెలలు రోజూ స్విమ్మింగ్‌ చేస్తారు. శీతాకాలంలో వాకింగ్‌ చేస్తారు. స్విమ్మింగ్, వాకింగ్‌తోపాటు బుక్‌ రీడింగ్‌ ఆమె హాబీలు.

ఆమె సౌత్‌ ఢిల్లీలో ఉన్న నేషనల్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ లైబ్రరీకి కస్టోడియన్‌ కూడా. వందేళ్ల జీవనానికి మాత్రం తాతల నుంచి జన్యువులే కారణమంటారు. ఆమె తాతగారు (తండ్రికి తండ్రి) 103 ఏళ్లు జీవించారు. పూర్వికులు జన్యుపరమైన నిధిని ఇస్తారు. అది గొప్ప అదృష్టం. దేహానికి తగినంత శ్రమనిస్తూ మనమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆ జాగ్రత్త లేకపోతే అనారోగ్యాలతో స్నేహం చేయకతప్పదంటారు పద్మావతి.

రోజుకు 12 గంటలు
ఇప్పటి కార్పొరేట్‌ హాస్పిటళ్లలాగ గంటకు ఎంతమందిని చూడాలనే లెక్కలు తెలియదు పద్మావతికి. పేషంట్‌ ఆరోగ్య స్థితిని బట్టి టైమ్‌ పెరుగుతూ పోతుంటుంది. రోజుకు పన్నెండు గంటల సమయం పేషెంట్‌లతోనే ఉంటారు. అలా వారానికి ఐదు రోజులు. అంత దీక్షగా పని చేయడంతోపాటు ఆమెలో మరో గొప్పతనం పేషెంట్‌ల భాషలు నేర్చుకోవడం.

ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, బర్మా, జర్మన్, ఫ్రెంచ్‌భా భాషలు మాట్లాడతారామె. పేషెంట్‌ తన బాధను ఉన్నదున్నట్టుగా చెప్పుకోగలిగేది సొంత భాషలోనే. తమ బాధను సరిగ్గా చెప్పలేకపోతే సరైన వైద్యం అందదు, అందుకే ఆమె దగ్గరకు ఎక్కువగా వచ్చే పేషెంట్‌ల భాషలు నేర్చుకున్నారు.

పద్మావతి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆమె కుటుంబం గురించిన ఆసక్తి కలుగుతుంది ఎవరికైనా. అదే మాట అడిగిన వాళ్లతో ‘నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోనందుకు నేనేమీ బాధపడడం లేదు. పేషెంట్‌లు, రీసెర్చ్‌లో నిమగ్నమై ఉంటాను. ఇందులో నాకు సంపూర్ణమైన తృప్తి ఉంది. నా జీవితం నేను కోరుకున్నట్లే సాగుతోంది’ అంటారు డాక్టర్‌ పద్మావతి.
 

 రికార్డులు
దేశంలో తొలి కార్డియాలజీ క్లినిక్‌ స్థాపన ∙కార్డియాలజీలో ‘డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ కోర్సును ప్రవేశ పెట్టడం
 మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజ్, జిపి పంత్‌ హాస్పిటల్‌లో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌ స్థాపన
 ఢిల్లీ లో ఆల్‌ ఇండియా హార్ట్‌ ఫౌండేషన్‌ స్థాపన
ఐదవ ప్రపంచ కార్డియాలజీ కాంగ్రెస్‌కు అధ్యక్షత 
 పద్మభూషణ్‌ (1967) పద్మవిభూషణ్‌ (1992)


పేషెంట్‌లే పాఠాలు

(36 ఏళ్ల వయసులో.. లేడీ హార్డింగే మెడికల్‌ కాలేజ్‌లో...)

నేను  పేషెంట్‌ను తాకి, వారు చెప్పేది మొత్తం నా చెవులతో విని, నా కళ్లతో పేషెంట్‌ను నిశితంగా చూసి వైద్యం చేస్తాను. టెక్నాలజీ ఎంత ఎదిగినా పేషెంటుకి సంతోషం కలిగేది డాక్టర్‌ చూపించే శ్రద్ధతోనే.∙ఆ అలవాటు కారణంగానే మా మెడికల్‌ టెక్ట్స్‌బుక్స్‌లో లేని అనేక రోగాలను తెలుసుకోగలిగాను. వాటి మీద రీసెర్చ్‌ చేసే అవకాశం కూడా వచ్చింది. నేనందుకున్న అనేక పురస్కారాలకు మూలం ఆ అబ్జర్వేషనే. ఇన్నేళ్ల అనుభవంలో నేను చెప్పేదొక్కటే... మందులు మనిషి అదుపులో ఉండాలి, అంతే తప్ప అవి మనిషి మీద స్వారీ చేయకూడదు. మనకు జీవనశైలిలో క్రమశిక్షణ లేకపోతే మందులే మనిషికి యజమానులవుతాయి. – డాక్టర్‌ పద్మావతి, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌


– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా