పక్షులకూ మనసుంటుంది!

15 May, 2017 23:40 IST|Sakshi
పక్షులకూ మనసుంటుంది!

పక్షిపాతం

చుట్టూ పాలరాతి మెరుపులు, అద్దాల తలుపులు, మండే ఎండల్లోనూ చల్లని పవనాలు అన్నీ ఉన్నా ఏదో వెలితి. నవీన కాలంలో మనిషికి మనిషి తోడు లేని మనసులు. లోలోపల కుంగదీస్తున్న మనసును బుజ్జగించే నాథుడు లేక తోడును వెతుక్కునే క్రమంలో నేటి మనిషి పెంపుడు జంతువులను ఆశ్రయిస్తున్నాడు. ఇంకొందరు పక్షులను తెచ్చి నట్టింట్లో పంజరం వేలాడదీసి వాటిని అందులో ఉంచి గారాలు పోతున్నారు. ఇంటికి అతిథి వచ్చినా పలకరించకుండా పక్షులకు కావల్సిన తిండి ఎలాంటిదైతే బాగుంటోందని నెట్టింట్లో వెతుకుతున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ స్వేచ్ఛగా ఉండాల్సిన పక్షులు సిమెంట్‌ ఇళ్ల గదుల్లో ఇమడలేక మనుషుల్లాగే రోగాల పాలబడుతున్నాయంటున్నారు పరిశోదకులు. యూనివర్శిటీ ఆఫ్‌ చికాగో పరిశోధన బృందం ప్రత్యేకంగా ఆఫ్రికన్‌ బర్డ్స్‌పై జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మాట్లాడే చిలుకలకు డిమాండ్‌..
సహజంగానే పక్షులు మనల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. వీటిలో ఆఫ్రికన్‌ గ్రే కలర్‌ రామచిలుక, ఆస్ట్రేలియన్‌ కాక్టూస్, సౌత్‌ అమెరికన్‌ మకావ్స్‌.. పక్షులు అద్భుతమైన రంగులతో ఆకర్షిస్తాయి. అందుకే వీటిని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్‌ ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఈ పక్షుల్లో చాలా వరకు మనుషులు ఎదుర్కొనే ఊబకాయం, డిప్రెషన్, చురుకుదనం లేమి.. వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీంతో అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలలో పక్షుల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్స్‌ సంఖ్య పెరుగుతోంది.

జీవితకాలపు తోడు...
నగరాల్లోనే కాదు చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రతియేటా పక్షులను పెంచుకునేవారి శాతం పెరుగుతుంది. ఎందుకంటే వీటిని చిన్న చిన్న ప్లాట్లలోనూ మ్యానేజ్‌ చేయవచ్చు. ‘పక్షుల పెంపకం సులువు’గా  భావించడం కూడా వీటి కొనుగోళ్లను పెంచుతుంది. కొన్ని ప్రత్యేకమైన పక్షులైతే 60–70 ఏళ్లు జీవించగలవు. దీని వల్ల ఒక మనిషి తన జీవితకాలం ఒక పక్షినే పెంచుకోవచ్చు. ఈ తరహా పక్షులు తమ యజమాని ఎవరో ఇట్టే గుర్తుపట్టేస్తాయి. వారిని ఉద్దేశించే సంభాషిస్తుంటాయి. ‘మా రామచిలుక అయితే గోళ్లు, రెక్కలను కత్తిరించేవారెవరో గుర్తుపట్టేస్తుంది. నేను కాకుండా మరెవరినీ దగ్గరకు రానీయదు’ అంటాడు ఆనందంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉదయ్‌. ‘నేను ఇంట్లోకి అడుగుపెడుతూనే నా అడుగుల శబ్దం విని తెగ అల్లరిచేసేస్తుంటుంది మా డియర్‌’ అని మురిపెంగా తన పెంపుడు చిలుక గురించి చెబుతుంది సోనీ!

పక్షులకూ ఊబకాయం సమస్య...
‘సాధారణంగాæ పక్షులు వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. ఆహారం కోసం ఆకాశంలో ఎంత దూరమైనా స్వేచ్ఛగా విహరిస్తాయి. వాటికి విశాల విశ్వమే హద్దు. అలాంటి వాటిని తీసుకొచ్చి ఎక్కడకూ కదలడానికి వీలులేని పంజరంలో ఉంచి, అవసరానికి మించి వాటికి ఆహారాన్ని పెడుతున్నారు. ఆ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే శక్తిని ఖర్చుపెట్టుకోనీయడం లేదు. పైగా పక్షి ఒంటరిగా ఉండటం వల్ల చురుకుదనం కోల్పోయి డిప్రెషన్‌ వంటి బాధలను అనుభవిస్తున్నాయి’ అంటారు ఆఫ్రికన్‌ డాక్టర్‌ గంజ్వాన్‌!
‘ఆనందంగా ఉండే పక్షి రెక్కలు నవనవలాడుతూ శుభ్రంగా ఉంటాయి. అదే డిప్రెషన్‌ పక్షి రెక్కలు డీలాపడిపోయి ఉంటాయి. వాటి పునరుత్పత్తి విషయంలోనూ తేడాలు వస్తున్నాయి. రెక్కలు విప్పుకోవడానికి కావల్సినంత చోటు లేక విపరీతమైన బాధలను అనుభవిస్తున్నాయి’ అని తమ పరిశోధనలో వివరించారు చికాగో పరిశోధకులు. వేల రకాల పక్షులను పరీక్షించిన తర్వాత ఓ నిర్ధారణకు వచ్చారు ఈ పరిశోధకులు  ‘పక్షులు అతి తెలివైనవనీ, అవి తమ తోటి పక్షుల అటెన్షన్‌ను కోరుకుంటాయని, లేదంటే అంటిపెట్టుకుని ఉండే మనుషులు తమతో ఎక్కువ సమయం ఉండాలనుకుంటాయ’ని వివరించారు.

చట్టాలు కఠినం కావాలా!
‘పక్షి ప్రేమికులు ప్రపంచమంతటా ఉన్నారు. అయితే, వీరిలో చాలా మంది పక్షులను తమ ఫార్మ్‌హౌజ్‌లలో ఎక్కువ సంఖ్యలో పక్షులను పెంచుతున్నవారే!’ అంటారు డాక్టర్‌ టండెల్‌. కలకత్తాకు చెందిన ఈ డాక్టర్‌ ‘చాలా దేశాలలో వన్యప్రాణి సంక్షరణ కేంద్రాల చట్టం అంతరించిపోతున్న పక్షులను సంరక్షిస్తుంటుంది. అయితే, వలస పక్షుల పెంపకం, అమ్మకంలో మాత్రం కఠిన∙చట్టాలు తీసుకోవడం లేదు’ అంటారాయన.
– ఎన్‌.ఆర్‌

పెంపుడు పక్షుల కోసం కనీస జాగ్రత్తలు
ఆఫ్రికన్‌ వెటర్నరీ డాక్టర్‌ గంజ్వానీ పక్షుల పెంపకానికి తీసుకోవాల్సిన కనీసం జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. పక్షులు ఒంటరితనం ఫీలవకుండా టీవీ లేదా రేడియో, అద్దం ముందు పక్షి పంజరాన్ని ఉంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పంజరంలో మరో పక్షి బొమ్మనైనా ఉంచాలి కొంతమంది తాము ఆహారాన్ని తింటూ వాటినే పక్షులకు పెడుతుంటారు. ఉదాహరణకు.. రోటీ, పాస్తా వంటివి. ఇవి పక్షులకు జీర్ణం కావు. సరైన వాతావరణంలో ప్రకృతి సిద్ధంగా లభించేవి, వాటికి అనుకూలమైన ఆహారం ఉండాలి.   మీ పక్షికి ఏం కావాలో, ఎలా ఉండాలో అర్థం చేసుకోండి. పక్షి జీవితం సంతోషంగా ఉండటం మీ చేతుల్లో ఉంది. లేదంటే, ఆ పక్షిని మీ చేతులతో ఆకాశంలోకి స్వేచ్ఛగా వదిలిపెట్టడం మంచిది. 

మరిన్ని వార్తలు