పక్షులకు పరిచిన నేలపట్టు పానువు

9 Jan, 2015 00:05 IST|Sakshi
పక్షులకు పరిచిన నేలపట్టు పానువు

నేలపట్టు. ఈ  పేరు వింటే రంగు రంగుల విదేశీ వలస పక్షులు గుర్తుకొస్తాయి. పేరుకు విదేశీ పక్షులే అయినా వాటి జన్మస్థలం నేలపట్టే. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న ఈ నేలపట్టు దశాబ్దాల కాలంగా పక్షులకు విడిది కేంద్రంగా ఉంటోంది. పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్ధ్దిగా దొరుకుతాయి. అందుకే విదేశీపక్షులు ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి నేలపట్టుకురావటం ప్రారంభిస్తాయి. అప్పటి నుంచి ఆరునెలల పాటు వెదురుపట్టు, బోరులింగలపాడు, శ్రీహరికోట, చింతవరం, మొనపాళెం, మనుబోలు ప్రాంతాల్లో చెట్లపై గూళ్లు కట్టుకుని విడిది ఏర్పాటు చేసుకుంటాయి.
 
భూతల స్వర్గం...
 
ఫ్లెమింగోలు (సముద్రరామచిలుక), పెలికాన్(గూడబాతులు), పెయింటెడ్‌స్టార్క్స్(ఎర్రకాళ్లకొంగలు), ఓపెన్‌బిల్ స్టార్క్స్ (నల్లకాళ్లకొంగ), సీగల్ (సముద్రపు పావురాళ్లు),  గ్రేహారన్ (నారాయణపక్షి), నల్లబాతులు, తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటికాకులు, చింతవక్క, నత్తగుల్లకొంగ, చుక్కమూతి బాతులు, సూదిమొన బాతులు, నీటికాకులు, స్వాతికొంగలులాంటి అనేక విదేశీ, స్వదేశీ పక్షులు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. అందుకే పులికాట్ సరస్సు, నేలపట్టు  పక్షుల భూతల స్వర్గంగా పేరుపొందాయి.
 
రక్షితకేంద్రం...

పక్షులు వచ్చాయంటే ఆ సంవత్సరం వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయనేది  స్థానికుల నమ్మకం. అందుకే  వీటిని దేవతా పక్షులుగా పిలుచుకుంటారు. పక్షులను వేటగాళ్ల బారినుంచి కాపాడేందుకు సూళ్లూరుపేట, నేలపట్టులో పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇలా మొదలైంది...

పులికాట్‌కు వచ్చీపోయే పక్షులను పట్టించుకునే వారు కాదు. ప్రకృతి ప్రేమికులు మాత్రం విదేశీపక్షుల రాకను గమనించి చూసి వెళ్లేవారు. 2000లో నెల్లూరు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన ప్రవీణ్‌కుమార్ ఒకరోజు కుటుంబంతో పులికాట్ సందర్శనకు వచ్చారు. తడ రేవు వద్ద పడవ షికారు చేస్తుండగా వేల సంఖ్యలో ఫ్లెమింగోలు గుంపులు గుంపులుగా కనిపించి కనువిందు చేశాయి. ఇది గమనించిన కలెక్టర్ నాటి స్థానిక శాసనసభ్యులు పరసా వెంకటరత్నయ్య దృష్టికి తీసుకెళ్లి 2001లో ఫ్లెమింగో ఫెస్టివల్(పక్షుల పండుగ) కు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి ప్రతి ఏటా మూడురోజులపాటు పక్షుల పండుగను నిర్వహించడం ప్రారంభించారు.  పులికాట్ సరస్సు అభివద్దికోసం పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు.

నాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పక్షుల పండుగకు గుర్తింపు వచ్చింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చొరవతో అప్పటి పర్యాటకశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ‘పక్షుల పండగ’ను రాష్ట్రస్థాయి పండగగా గుర్తించడమే కాకుండా క్యాలెండర్‌లో కూడా చేర్చి ప్రాధాన్యత కల్పించారు. అప్పటి నుంచి ఏటా జనవరి నెలలో పక్షుల పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పండగను ఎగ్జిబిషన్ స్టాల్స్, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహిస్తారు.

పక్షుల పండుగకు ఇలా చేరుకోవచ్చు...

చెన్నై నుంచి సూళ్లూరుపేటకు చేరుకోవడానికి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంటుంది. దూరం 68 కి.మీ. బస్సు చార్జీ: *60
చెన్నై నుంచి సూళ్లూరుపేటకు ప్రతి గంటకు సబర్‌బన్ రైలు సౌకర్యం ఉంది. చార్జి *25
నెల్లూరు రైల్యేస్టేషన్ నుంచి సూళ్లూరుపేటకు...
ఉదయం 4.30 గంటలకు చెన్నై ఎక్స్‌ప్రెస్
ఉదయం 5.30 గంటలకు చార్మినార్ ఎక్స్‌ప్రెస్
ఉదయం 11గంటలకు పినాకిని ఎక్స్‌ప్రెస్  మధ్యాహ్నం 1.50కి మెమో రైలు
సాయంత్రం 6 గంటలకు మెమో రైలు  రాత్రి 7.30 గంటలకు జనశతాబ్దిరైలు
రాత్రి 8.30 గంటలకు మెమో రైలు  సాధారణ చార్జీ రూ.28
ఎక్స్‌ప్రెస్‌కు రూ.100

బస్సు సౌకర్యం

నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ప్రతి గంటకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంటారు
ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.98  హైటెక్ చార్జీ రూ.115
 - తిరుమల రవిరెడ్డి సాక్షి, నెల్లూరు
 - మొలకల రమణయ్య, సాక్షి,  సూళ్లూరుపేట
 
ఉచిత బస్సులు


పక్షుల పండుగకు వచ్చేవారు సూళ్లూరుపేటలో దిగాలి. అక్కడే ప్రైవేటు లాడ్జిలు ఉన్నాయి. అద్దెలు రూ.600 నుంచి రూ.3వేల వరకు.
సూళ్లూరుపేట నుంచి నేలపట్టు, పులికాట్ సరస్సుకు ఉచిత బస్సులు.
బీములవారిపాళెంలో బోటుషికారు  విద్యార్థులకు ‘షార్’ సందర్శన.

 సందర్శకుల కోసం...

 పర్యావరణ విజ్ఞానకేంద్రం. అందులో పక్షుల పండుగ గురించి వీడియో ప్రదర్శన.  పక్షులను వీక్షించేందుకు వేలాడు మార్గంలో శ్రీహరికోట మార్గంలో టవర్లు, బైనాకులర్లు ఏర్పాటు చేశారు.
 
 

మరిన్ని వార్తలు