కెరీర్‌ ఉడికింది

24 Feb, 2020 07:15 IST|Sakshi
నల్ల బియ్యం ,ముదిత

నల్ల బియ్యం

‘‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బియ్యం లేని భోజనమే లేదు. అందుకే బియ్యం వ్యాపారాన్ని మొదలు పెట్టాను. పిడికెడు బియ్యం మనిషి మనుగడకు భరోసా.ఆ బియ్యమే నా బిజినెస్‌ కెరీర్‌కు పూజాక్షతలు’’ అంటోంది మణిపురి యువతి ముదిత.

నిజమే! ముదిత అన్నట్లు కశ్మీరీ పులావ్, బిర్యానీలతో ఉత్తరాది విందులో అగ్రస్థానం బియ్యానిదే. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇడ్లీ, దోసెల రూపంలో తెల్లవారేదే బియ్యంతో. అయితే ఇప్పుడు టెక్‌ ఇండియా బియ్యానికి దూరంగా జరిగిపోతోంది. ‘మనదేశాన్ని డయాబెటిక్‌ హబ్‌గా మారుస్తున్నది బియ్యమే..’ అని అంటున్న ఈ రోజుల్లో ఈ అమ్మాయికి బియ్యంతో తన కెరీర్‌ను ఉడికించుకోవచ్చన్న ధైర్యం ఎలా వచ్చింది! ‘‘మా ముత్తవ్వను వందేళ్లు ఆరోగ్యంగా బతికించిన బియ్యం ఇవి. చైనాలో రాజకుటుంబం కోసం గోదాముల్లో ప్రత్యేకంగా దాచిన బియ్యం ఇవి. ఇటలీలో రెస్టారెంట్లు వండేది ఈ బియ్యాన్నే’’ అంటోంది ముదిత.

ఆర్థికమా? ఆహారమా?
ముదిత ఢిల్లీలోని ‘జీసస్‌ అండ్‌ మేరీ కాలేజ్‌’లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. లండన్‌లో 2011లో మాస్టర్స్‌ పూర్తి చేసే నాటికి ఆమె లక్ష్యం అర్థికరంగంలో నైపుణ్యం సాధించి గొప్ప ఆర్థికవేత్తగా ఎదగాలన్నది మాత్రమే. అందుకోసమే ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీల్లో మరికొన్ని కోర్సులు కూడా చేసింది. ఇండియా వచ్చి పెద్ద కార్పొరేట్‌ కంపెనీలో డిప్యూటీ ఫైనాన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం కూడా సంపాదించింది. అయితే అప్పటివరకు తన చదువు, తన ఉద్యోగం అనుకుంటూ సాగిన ముదితలో తన చుట్టూ ఏం జరుగుతుందోననే గమనింపు మొదలైంది. దగ్గరి స్నేహితుల ఇళ్లలోనూ, తన బంధువుల్లో చాలా మంది డయాబెటిస్‌ పేషెంట్‌లు, హార్ట్‌ పేషెంట్‌లు. అది కూడా నలభై ఐదేళ్లలోపే! ‘‘ఇవన్నీ లైఫ్‌స్టైల్‌ సమస్యలే. ముఖ్యంగా సరిగ్గా తినడం తెలియకపోతే వచ్చే ఇబ్బందులే. ఢిల్లీ ఇలాగుంది, కానీ మా సొంత రాష్ట్రం మణిపూర్‌ ఇలా లేదు. మా నానమ్మ, తాతయ్యలు బతికినంత కాలం అన్నమే తిన్నారు. పొట్టలను రసాయనాలతో నింపలేదు. మా ముత్తవ్వకి ఎటువంటి అనారోగ్యమూ లేకుండా ఏకంగా వందేళ్లు జీవించిన రికార్డ్‌ ఉండనే ఉంది. అంటే ఈశాన్య రాష్ట్రాల ఆహారంలోనే ఆరోగ్యం ఉందా?  సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి మణిపూర్‌ రాష్ట్రంలో ఆరు నెలల పాటు ఉండిపోయాను. అక్కడి మార్కెట్‌లన్నీ తిరిగి చూశాను. రైతులతో మాట్లాడాను. అక్కడి ‘ఇమా ఖైతాల్‌’ (మదర్స్‌ మార్కెట్‌) లను ఇంకా నిశితంగా గమనించారు’’ అని చెప్పారు ముదిత. ఈ మదర్స్‌ మార్కెట్‌లను మొత్తం మహిళలే... ‘స్వయం సహాయక బృందాలు’గా ఏర్పడి నిర్వహిస్తారు.

నానమ్మ తిన్న బియ్యం
ఇటలీలో రెస్టారెంట్లన్నీ యాంటి ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉండే ఈ బియ్యాన్నే వండుతాయి. ఈ బియ్యం మనదేశంలోకి ఇతర ఆసియాదేశాల నుంచి దిగుమతి అవుతుండేవి. ఆ బియ్యాన్ని చూసినప్పుడు మణిపూర్‌ రాష్ట్రంలోని మా సొంతూరు థౌంబాల్‌లో మా నానమ్మ తిన్న బియ్యం ఇలాగే ఉండేవి కదా అనుకున్నాను. ఈశాన్య రాష్ట్రాల్లో మనుషులు అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా ఈ నల్లబియ్యమే. అందుకే దేశం ఆరోగ్యంగా ఉండాలన్నా, నా వ్యాపారం పరిపుష్టం కావాలన్నా ఈ నల్లబియ్యాన్ని అందరికీ పరిచయం చేయడమే మంచి మార్గం అనుకున్నాను.– ముదిత అకోయిజామ్‌ సింగ్, బ్లాక్‌ రైస్‌ వ్యాపారవేత్త

ఆరోగ్య దేశం
మణిపురి నుంచి వచ్చేశాక ఢిల్లీ కేంద్రంగా బియ్యం వ్యాపారాన్ని చేయాలనుకున్న ముదిత అందుకోసం మణిపూర్‌లో ఐదు వందల మంది రైతులను తనతో కలుపుకుంది. గత ఏడాది జనవరిలో ఆమె ఈ పని మొదలు పెట్టింది. ఈ ఏడాది కాలంలోనే ఢిల్లీలోని పెద్ద రెస్టారెంట్‌లు ముదిత సరఫరా చేస్తున్న నల్లబియ్యానికి బాగా అలవాటైపోయాయి! ముంబయికి కూడా  విస్తరించింది. నల్లబియ్యంతోపాటు అస్సాంలో పండే హిమాలయన్‌ రెడ్‌ రైస్, నాగాలాండ్‌లో పండే వెదురుబియ్యాన్ని కూడా దేశవ్యాప్తంగా పరిచయం చేసింది ముదిత.ఆరోగ్యవంతమైన దేశం ఆరోగ్యవంతులతోనే సాధ్యం. రోగాల మీద జరిగే వ్యాపారం టర్నోవర్‌ వేల కోట్లయినా, లక్షల కోట్లయినా సరే అది దేశానికి ఆరోగ్యకరం కాదు.– మంజీర

మరిన్ని వార్తలు