ఐఏఎస్‌ అంతు చూశాడు

16 Aug, 2019 08:09 IST|Sakshi
కుటుంబ సభ్యులతో కట్టా సింహాచలం

సంకల్ప బలుడు

 పాత గోనె సంచుల వ్యాపారి కొడుకు కలెక్టర్‌ అయ్యారు!

 పుట్టుకతోనే అంధత్వం.. అయినా ఐఏఎస్‌లో ర్యాంకు!!

అతని సంకల్పం ముందు అంధత్వం ఓడింది. పేదరికం తలవంచింది. పుట్టుకతోనే అంధుడు అయినా, అనుకున్నది ఎందుకు సాధించలేననే దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. విజయం సాధించాడు. అతనే తూర్పు గోదావరి జిల్లామలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కట్టా సింహాచలం.

సింహాచలం 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ట్రై నీ కలెక్టర్‌గా ముస్సోరీలో శిక్షణకు ఎంపికయ్యారు. గూడపల్లి గ్రామంలోని కట్టా వాలి, వెంకట నర్సమ్మలకు ఆయన జన్మించారు.  ఆ దంపతులకు  వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాంబాబు, సింహాచలం.. నలుగురు కుమారులు, ఒక కుమార్తె దుర్గ . కుటుంబ భారం మోసేందుకు తండ్రి వాలి పాత గోని సంచుల వ్యాపారం చేసేవారు. అలానే సంతానాన్ని పెంచి పెద్ద చేశారు. నాలుగో సంతానం అయిన సింహాచలం పుట్టుక తోనే అంధుడు. తండ్రికి కుమారుడిని చదివించే  స్తోమత లేదు. ఆ పేదరికంతోనే సింహాచలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బ్రెయిలీ స్కూల్‌లో చదువుతూ మలికిపురం ఎంవీఎన్‌ జేఎస్‌ అండ్‌ ఆర్వీఆర్‌ డిగ్రీ కళాశాలలో దాతల సహకారంతో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. అండ కోల్పోయిన ఇంటికి తాను అండగా ఉండాలని అనుకున్నాడు. ఐఏఎస్‌ కావాలన్న దృఢ సంకల్పాన్ని తన మనస్సులో గట్టిగా నాటుకున్నాడు. ఆ క్రమంలోనే బీఈడీ కూడా చదివి తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచరు ఉద్యోగం లో చేరారు సింహాచలం. 2014 సంవత్సరంలో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాశారు. 1212 ర్యాంకు సాధించారు.  కలెక్టర్‌ అయ్యే అవకాశం కొద్దిలో మిస్‌ అయింది. అయినా నిరాశ చెందలేదు. 2016లో ఐఆర్‌ఎస్‌లో రాణించి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఎట్టకేలకు 2019 ఐఏఎస్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించారు. ప్రసుతం సింహాచలం ముస్సోరిలో ట్రై నీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. బుధవారం తన స్వస్థలం గూడపల్లి వచ్చిన సందర్భంగా ఆయన  సాక్షితో మాట్లాడారు. – తోట సత్యనారాయణ, సాక్షిమలికిపురం, తూ.గో.జిల్లా

అవయవ దానాన్నిప్రోత్సహించాలి
‘‘అవయవ లోపం అన్నది మనలోని ప్రతిభ వెలికి వచ్చేందుకు అడ్డంకి కాదు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే ప్రతి ఒక్కరూ అవయవ దానాన్ని ప్రోత్సహించాలి.  ఈరోజు నేను సాధించిన ఈ ఐఏఎస్‌ ఘనత  కంటే అవయవ దానం చేసిన వారే  చాలా గొప్పవారని నేను భావిస్తాను.’’– కట్టా సింహాచలం

మరిన్ని వార్తలు