హైబీపీ వల్ల ముప్పేమిటి?

21 Oct, 2019 02:17 IST|Sakshi

బీపీ కౌన్సెలింగ్‌

నా వయసు 52 ఏళ్లు. ఇంతవరకు ఎప్పుడూ బీపీ చూసుకోలేదు. కానీ ఇటీవల చూసుకున్నప్పుడు నా బీపీ 150 / 98 ఉంది. దాంతో డాక్టర్‌గారు కనీసం నాలుగైదు బీపీ సార్లు చూసుకొని, రీడింగ్స్‌ నోట్‌ చేసుకొని వారం తర్వాత రమన్నారు. అంతకుముందు ఎలాంటి ఆలోచనా లేదు కానీ... ఆ మాట చెప్పినప్పటి నుంచి నాకెందుకో ఆందోళనగా ఉంది. బీపీ పెరిగితే వచ్చే సమస్యలపై అవగాహన కలిగేలా నాకు సమగ్రంగా వివరించండి.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న రక్తపోటు కండిషన్‌ విపరీతంగా పెరుగుతోంది. రక్తపోటు పెరగడానికి కారణాలు చాలావరకు నిర్దిష్టంగా తెలియవు. ఇలా కారణం తెలియని బీపీని ‘ఇడిపోపథిక్‌ హైపర్‌టెన్షన్‌’ అంటారు. కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక శ్రమ తక్కువగా ఉండే కూర్చుని చేసే వృత్తుల్లో ఉండటం, రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి, ఊబకాయం వంటి అంశాలు దీనికి కారణమని ఊహిస్తున్నారు. రక్తపోటు వచ్చినవారిలోలో దాదాపు 90 శాతం ఇడియోపథిక్‌ హైపర్‌టెన్షన్‌ కేసులే ఉంటాయి. అయితే మిగతా 10 శాతం మందిలో రక్తపోటు పెరగడానికి నిర్దిష్టంగా కారణం ఉంటుంది. ఇలా కారణం తెలిసిన రక్తపోటును సెకండరీ హైపర్‌టెన్షన్‌ అంటారు.

కారణం తెలియకుండా వచ్చే ఇడియోపథిక్‌ హైపర్‌టెన్షన్స్‌ కంటే నిర్దిష్ట కారణంతో వచ్చే సెకండరీ హైపర్‌టెన్షన్లతో చాలా ప్రమాదం. ఇలాంటి సెకండరీ హైపర్‌టెన్షన్‌లతో వచ్చే రక్తపోటును అదుపులో పెట్టేందుకు చాలాసార్లు మూడు నుంచి నాలుగు రకాల మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏడు నుంచి ఎనిమిది రకాలు కూడా వాడాల్సి రావచ్చు. సాధారణ ఇడియోపథిక్‌ రక్తపోటుతో మూత్రపిండాలు దెబ్బతినే పరిస్థితి కాస్తంత అరుదుగా వస్తుంది. కానీ సెకండరీ హైపర్‌టెన్షన్‌ ఉన్నవారిలో మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ.

రక్తపోటు ఉన్నట్లు అనుమానించేవారు చేయించుకోవాల్సిన సాధారణ పరీక్షలు
►పూర్తిస్థాయి మూత్ర పరీక్ష ( కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌)
►రక్తంలో పొటాషియమ్‌ స్థాయి
►బ్లడ్‌ యూరియా అండ్‌ క్రియాటిన్‌ లెవెల్స్‌
►ఈసీజీ
►కిడ్నీ సైజ్‌ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ఆఫ్‌ అబ్డామిన్‌ పరీక్ష
►రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పరీక్ష

మరికొన్ని ప్రత్యేక పరీక్షలు
అత్యధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరం. అవి...
►24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్‌ పాళ్లు  తెలుసుకునే పరీక్ష.
(మూత్రంలో పోయే ప్రోటీన్ల సంఖ్యను ఇటీవల కేవలం ఒక శాంపుల్‌తోనే తెలుసుకునే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి)
►కిడ్నీ బయాప్సీ
►మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌
►బ్లడ్‌ గ్యాస్‌ అనాలిసిస్‌
►రీనల్‌ యాంజియోగ్రామ్‌

కొన్ని ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరం  
►కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి..
►డయాబెటిస్‌ పేషెంట్లు అందరిలో..
►కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారిలో ..
►రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారు
►ముప్ఫయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి..
►తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందిపడే వారికి..

రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు:
►గుండెపోటు రావడం, గుండె ఫెయిల్యూర్‌
►కిడ్నీ దెబ్బతినడం
►పక్షవాతం
►జీవన వ్యవధి (లైఫ్‌ స్పాన్‌) తగ్గడం
►కిడ్నీ దెబ్బతింటే డయాలసిస్‌ వంటివి చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియలు కావడం
పై అంశాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రక్తపోటు ఉన్నవారు తమ హైబీపీని అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో మేలు.

రక్తపోటును నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
►ఒత్తిడిని తగ్గించుకోవాలి.
►తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
►ఆహారంలో ఉప్పు పాళ్లను తగ్గించాలి.
►ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం... పచ్చళ్లు, అప్పడాల వంటి వాటికి దూరంగా ఉండాలి.
►డాక్టర్‌ సలహా లేకుండా ఎలాంటి మాత్రలనూ (ఓవర్‌ ద కౌంటర్‌ తీసుకుని) ఉపయోగించకూడదు.
►రక్తపోటు ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడూ 130 / 80 ఉండేలా క్రమం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి.

నాకు హైబీపీ ఉన్నట్లా లేనట్లా?
నా వయసు 45 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పిగా ఉండటంతో పాటు ఇటీవల బాగా తలతిరుగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ముందుకు పడిపోతానేమో అన్నంత ఆందోళనగా ఉంటోంది. నా లక్షణాలు చూసిన కొంతమంది మిత్రులు నీకు ’హైబీపీ ఉందేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకో’ అంటున్నారు. వారు చెబుతున్నదాన్ని బట్టి నాకు మరింత ఆందోళన పెరుగుతోంది. దాంతో బీపీ లేకపోయినా హైబీపీ ఉన్నట్లుగా చూపిస్తుందేమో అని భయంగానూ ఉంది. ఇంతకూ నాకు హైబీపీ ఉన్నట్లా లేనట్టా?

హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయడం సాధ్యం కాదు.  మనలో రక్తపోటు పెరగడం వల్ల ఎండ్‌ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే మన భంగిమ (పోష్చర్‌)ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ఒకేసారి మనలో రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌ అంటారు. అలాంటి సమయాల్లోనూ మీరు చెప్పినట్లుగా ముందుకు పడిపోతారేమో లాంటి ఫీలింగ్, గిడ్డీనెస్‌ కలగవచ్చు. బీపీలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు చెప్పిన లక్షణాలు కనిపించినప్పటికీ, అవి బీవీ వల్లనే అని కూడా నిర్దిష్టంగా చెప్పలేం.

సాధారణంగా బీపీ వల్ల ఉదయం వేళల్లో తలనొప్పి కనిపించనప్పటికీ, మరెన్నో ఆరోగ్య సమస్యలలోనూ తలనొప్పి ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన గిడ్డీనెస్‌ సమస్యకూ వర్టిగో, సింకోప్‌ లాంటి మరెన్నో సమస్యలు కారణం కావచ్చు. అందుకని కేవలం లక్షణాల ఆధారంగానే బీపీ నిర్ధారణ చేయడం సరికాదు. అందుకే మీరు నిర్భయంగా ఒకసారి డాక్టర్‌ను కలవండి. వారు కూడా కేవలం ఒక్క పరీక్షలోనే హైబీపీ నిర్ధారణ చేయరు. అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచి, ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేసి, దానికి తగిన చికిత్స సూచిస్తారు. మీరు ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి.
డా. నవోదయ కన్సల్టెంట్‌ జనరల్‌ మెడిసిన్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా