అవునా సార్‌?!

28 Apr, 2018 00:43 IST|Sakshi

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ డయానా హైడన్‌ పై చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి?

దేశంలో ‘మీటూ’ ఉద్యమం జరుగుతోంది. ఆడవాళ్ల మీద, పసి పిల్లల మీద ఆత్యాచారాల విషయంలో, స్త్రీల హక్కులను భంగపరిచే విషయంలో భూగోళంలోనే భారతదేశం ముందు వరసలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. స్త్రీలను గౌరవించే, వారి మర్యాదను కాపాడే వ్యక్తిత్వాన్ని అలవరుచుకునే పరిస్థితుల లేమి గురించి, వాటి అవసరాన్ని గురించి చర్చ జరుగుతున్నది. ఇలాంటి సమయంలో నేతలు ఆచితూచి మాట్లాడాలి. కాని అలా జరగడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నోరు జారుతున్నారు.

‘దేశంలో అత్యాచారాలు ఆపలేం.. అవి ఏవో ఒక మూల జరుగుతూనే ఉంటాయి. వాటిని రాద్ధాంతం చేయవద్దు’ అని ఒక పురుషనేత అంటే ‘అత్యాచారాలు సంస్కృతిలో భాగం’ అన్నట్టుగా ఒక మహిళా నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి ‘బాడీ షేమింగ్‌’కు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ జోరుగా వార్తలకెక్కుతున్నారు. మహా భారతం కాలంలోనే మనకు ఇంటర్‌నెట్‌ ఉండేదని ఆయనన్న వ్యాఖ్యతో దేశంలో కొందరు నొసలు చిట్లిస్తే మరికొందరు మంచి జోక్‌ విన్నట్టుగా హాయిగా నవ్వారు.

ఈయన ఇప్పుడు ‘అందంను కొలిచే’ షరాబు అవతారం ఎత్తారు. శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిప్లబ్‌ ‘భారతీయ అందానికి ప్రతీక ఐశ్వర్యరాయ్‌ మాత్రమే. డయానా హైడన్‌ను అందగత్తె అంటారా ఎవరైనా? ఆమె మిస్‌ వరల్డ్‌ గెలిచిందంటే నవ్వొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఐశ్వర్యారాయ్‌ 1994లో ‘మిస్‌ వరల్డ్‌’ టైటిల్‌ గెలుచుకున్నారు. మన హైదరాబాద్‌కు చెందిన డయానా హైడన్‌ 1997లో ‘మిస్‌ వరల్డ్‌’ గెలుచుకున్నారు. బిప్లబ్‌ ఏమంటారంటే ‘సౌందర్య సాధనాల సంస్థలు మన దేశ మార్కెట్‌ను వశపరుచుకోవడానికి దేశ యువతులకు వరుసగా అందాల టైటిల్స్‌ ఇస్తూ వెళ్లాయి.

ఆఖరుకు డయానా హైడన్‌కు కూడా ఇచ్చాయి’ అనే అర్థంలో మాట్లాడారు. ఇది డయానా రంగు, రూపును అవమాన పరచడమే అని సోషల్‌ మీడియాలో చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. రూపాన్ని, ఆకారాన్ని బట్టి అందాన్ని వ్యాఖ్యానించడం ఏమిటి అంటున్నారు. ద్రవిడులు రంగు తక్కువగా ఉండొచ్చు, కొందరు పొట్టిగా ఉండొచ్చు, కొందరి ముక్కు వెడల్పుగా ఉండొచ్చు... కాని దేని సౌందర్యం దానిదే... ఫలానా విధంగా ఉండటమే అందం అని నిర్థారించడం సాంస్కృతిక ఆధిపత్యం అని విమర్శిస్తున్నారు. ‘అందమైన యువతి లక్ష్మీ దేవి, సరస్వతి దేవిలా ఉండాలి’ అని బిప్లబ్‌ వ్యాఖ్యానించారు.

ఇలా అనడం వల్ల అలా లేని వాళ్లను ఎద్దేవా చేయొచ్చని ప్రోత్సహించినవారయ్యారు. ఇది కచ్చితంగా ‘బాడీ షేమింగ్‌’ కింద వచ్చే అంశమే అంటున్నారు నెటిజన్లు. ‘మన ఆడపిల్లలకు అందాల టైటిల్స్‌ ఇచ్చి ఇక్కడి మార్కెట్‌ను వశ పరుచుకున్నాక ఇక అలాంటి టైటిల్స్‌ ఇవ్వడం మానుకున్నారు’ అని బిప్లబ్‌ అన్నారు. ‘ఈ పెద్ద మనిషికి గత సంవత్సరమే మానుషి చిల్లర్‌కు మిస్‌ వరల్డ్‌ వచ్చిన సంగతి తెలియనట్టుంది’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని నరేందర్‌ మోడీ ఇటీవల తన పార్టీ శ్రేణులకీ, పదవుల్లో ఉన్నవారికి ‘ఆచి తూచి మాట్లాడండి’ అని ఆదేశాలు ఇచ్చారు. కాని– ఈ బిజెపి ముఖ్యమంత్రి మాత్రం నోరు దఫదఫాలుగా తెరుస్తూ విమర్శలకు పాత్రమవుతున్నారు.

మరిన్ని వార్తలు