‘మాస్టర్‌ జీ’ మరి లేరు

4 Jul, 2020 02:42 IST|Sakshi

బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ గౌరవంగా ‘మాస్టర్‌ జీ’ అని పిలుచుకునే సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ (71) శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. ఆమె అసలు పేరు నిర్మల నాగ్‌పాల్‌. ఇండస్ట్రీలో సరోజ్‌ ఖాన్‌గా గుర్తింపు పొందారు. జూన్‌ 20న ఆమెకు శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురైతే బాంద్రాలోని గురునానక్‌ హాస్పిటల్‌లో చేర్చారు. కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. అయితే సుదీర్ఘకాలంగా ఆమె డయాబెటిస్‌ పేషెంట్‌ కావడం చేత ఇతర వయసు సంబంధ సమస్యల రీత్యా హాస్పిటల్‌లోనే ఉన్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా హఠాత్తుగా వచ్చిన గుండెపోటు వల్ల మరణించినట్టు ఆస్పత్రివర్గాలు చెప్పాయి. ఆమె ఖననం శుక్రవారమే ముగిసిందని ఆమె మేనల్లుడు మనిష్‌ జగ్వాని తెలియచేశాడు.

సరోజ్‌ ఖాన్‌ తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 2000 పాటలకు కొరియోగ్రాఫ్‌ చేశారు. వైజయంతీ మాల, వహీదా రహెమాన్‌లు మొదలు శ్రీదేవి, మాధురి దీక్షిత్, కరీనా కపూర్‌ వరకు ఎందరో తారలు ఆమె నాట్యరీతుల వల్ల పేరు తెచ్చుకున్నారు. మూడుసార్లు జాతీయ పురస్కారం పొందారు. ఫిల్మ్‌ఫేర్‌లో హ్యాట్రిక్‌ కొట్టిన ఏకైక కొరియోగ్రాఫర్‌ ఆమె. చిరంజీవి హిందీ సినిమా ‘జంటిల్‌మేన్‌’, రామ్‌ గోపాల్‌ వర్మ ‘రంగీలా’ సినిమాలకు సరోజ్‌ఖాన్‌ నృత్యరీతులు అందించారు. డాన్స్‌ ఏమాత్రం చేయలేని సంజయ్‌ దత్‌కు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి ‘తమ్మా తమ్మా దేదే’ హిట్‌ ఇచ్చిన గురువు ఆమె. సరోజ్‌ ఖాన్‌ తన నాట్యగురువు సోహన్‌లాల్‌ను తన 13వ ఏట వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 41. ఆ వివాహం నిలువలేదు. ఆ తర్వాత సర్దార్‌ రోషన్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు రాజు ఖాన్‌ బాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా ఉన్నాడు.

మరిన్ని వార్తలు