హాస్యమా? అపహాస్యమా?

19 Nov, 2019 08:03 IST|Sakshi

గుడ్‌ న్యూస్‌

గర్భధారణ గురించి మన సంస్కృతిలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. కృత్రిమ గర్భధారణ గురించి ఇంకా పూర్తి అవగాహన, అంగీకరం లేని శ్రేణులు మన సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘ఐవిఎఫ్‌’ విధానంలో ఒక పొరపాటును కల్పించి తీసిన ‘గుడ్‌న్యూస్‌’ చిత్రం ఎలా స్పందన పొందనుంది?ఐ.వి.ఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) ద్వారా సంతానాన్ని పొందుతున్నవారు చాలామంది ఉన్నారు మన సమాజంలో. బాధ్యతాయుతమైన ఐవిఎఫ్‌ సెంటర్స్‌ సంతానం కలగని దంపతుల జీవితాల్లో సంతానాన్ని కలుగజేయడం ద్వారా ఆనందాన్ని నింపుతున్నాయి. అండోత్పత్తి సరిగా లేని స్త్రీ, వీర్య కణాల సంఖ్య తగినంత లేని పురుషుడు, ఇవి రెండూ సక్రమంగా ఉన్నా ఫలదీకరణం పదే పదే వైఫల్యం అవుతున్న సందర్భాల్లో ఐ.వి.ఎఫ్‌ ద్వారా సంతానాన్ని పొందుతుంటారు.

ప్రస్తుతం కరణ్‌ జోహర్‌ నిర్మాణంలో సిద్ధమయ్యి త్వరలో విడుదల కానున్న ‘గుడ్‌ న్యూస్‌’ సినిమా హాస్యాన్ని సృష్టిస్తుందా అపహాస్యాన్ని మూటగట్టుకోనుందా అనేది తేల వలసి ఉంది. ఇందులో రెండు జంటలు అక్షయ్‌ కుమార్‌– కరీనా కపూర్, దిల్జిత్‌ దోసన్జ్‌–కైరా అద్వానీలు సంతానం కలగకపోవడంతో ఒకే సమయంలో ఒక ఐ.వి.ఎఫ్‌ సెంటర్‌కు చేరుకుంటారు. ఇద్దరి ఇంటిపేరూ ‘బాత్రా’ కావడంతో పొరపాటున భర్తల వీర్యకణాలు అటూ ఇటూ మారుతాయి. అంటే దిల్జిత్‌ వీర్యకణం కరీనా కపూర్‌ అండంలోకి, అక్షయ్‌ కుమార్‌ వీర్యకణం కైరా అద్వానీ అండంలోకి ప్రవేశింపబడతాయి. ఆ సంగతి తెలిసిన రెండు జంటలూ గొడవకు దిగుతాయి. కాని గర్భాన్ని నిలుపుకుంటాయి. ఆ తర్వాత ఏమవుతుందనేది కథ.

ఐ.వి.ఎఫ్‌ విధానంలో వీర్యదాతలు ఎవరో, అండాన్ని ఇచ్చే మాతృమూర్తులు ఎవరో రహస్యంగా ఉంచబడుతుంది. ఎందుకంటే ఇది భావోద్వేగాలకు, బంధాలకు సంబంధించిన అంశం. అలాంటిది ఎదురుగానే అటుకులు చిటుకులు మారిన గర్భాలతో భార్యలు ఉంటే ఆ భార్యలు, సదరు భర్తలు ఏం ఫీలవుతారనేది ఈ కథ. కృత్రిమ గర్భధారణ పద్ధతుల చుట్టూ ఎన్నో సీరియస్‌ అంశాలు ఉన్నాయి. వాటితో సినిమా తీస్తే ఆ కథ వేరే విధంగా ఉంటుంది. కాని హాస్యం కోసం ఇలాంటి పాయింటు తీసుకుంటే మన ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో. భార్యాభర్తలు తల్లిదండ్రులు కావడమే వారికి అసలైన ‘గుడ్‌ న్యూస్‌’. మరి ఈ గుడ్‌న్యూస్‌ నిర్మాతకు గుడ్‌ న్యూస్‌ ఇస్తుందో బ్యాడ్‌ న్యూస్‌ ఇస్తుందో. కొత్త దర్శకుడు రాజ్‌ మెహెతా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 27న విడుదల కానుంది.
 

మరిన్ని వార్తలు