కడపలో విజయలక్ష్మిగారిల్లు...

3 Oct, 2019 03:30 IST|Sakshi

ఒకరేమిటి! ఒకటేమిటి!

శరన్నవరాత్రులకు చాలామంది ఇళ్లలో అమ్మవార్లతో పాటు బొమ్మలు కూడా కొలువు తీరడం మామూలే. ఆ ‘బొమ్మల సభ’లోకి చుట్టుపక్కలవాళ్లకు, చుట్టాలకూ సాదర ఆహ్వానం ఉంటుంది. దేవుళ్లు, రాక్షసులు, వాగ్గేయకారులు, మహానాయకులు.. ఎందరెందరో సభలో కొలువై కనిపిస్తారు. జ్ఞానకాంతులను విరజిమ్ముతూ, జీవన వేదాలను సందేశపరిచే ఇలాంటి  బొమ్మల కొలువులలో కడపలోని విజయలక్ష్మిగారింటి కొలువు గురించి మరీ మరీ చెప్పుకోవాలి. వీలు చేసుకుని చూసి రావాలి.

కడప జిల్లా కడప పట్టణంలోని ప్రకాష్‌నగర్‌ క్లాసిక్‌ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు విజయలక్ష్మి. ఈ ఏడాది శరన్నవరాత్రులకు ఆమె తన ఇంట్లో తొమ్మిది మెట్ల మీద దేవతల బొమ్మల్ని కొలువుదీర్చారు. వాగ్గేయకారులనూ గళం విప్పించి కూర్చోబెట్టారు. ఒక మూల ‘వివాహ భోజనంబు’ అంటూ ఘటోత్కచుడు లడ్లు తింటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఏడుకొండలవాడు, గోశాల.. ఒకటేమిటి, ఒకరేమిటి! అనేక ఘట్టాలను, ఘటికులను సృష్టికి ప్రతి సృష్టి చేశారు విజయలక్ష్మి కృష్ణయ్యర్, ఆమె భర్త చంద్రశేఖరరావు. దసరా పండుగ అంటే వీరికి బొమ్మల ప్రతిష్ఠే. విజయలక్ష్మి ఎం.కామ్‌ చదివారు. ఇద్దరూ చరిత్రకారులు. పదకొండేళ్లుగా ఇంట్లో అందమైన బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ‘‘చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ బొమ్మల కొలువు పెట్టేవారు. వివాహమైన కొన్ని సంవత్సరాల తరవాత కడపలో మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలనే ఆలోచన కలిగింది. వెంటనే బొమ్మలు సేకరించడం ప్రారంభించాను.

కంచి, చెన్నై, మధురై ప్రాంతాల నుంచి చాలా బొమ్మలు తెప్పించాను’’ అంటూ తాను సేకరించిన బొమ్మల గురించి చెప్పారు విజయలక్ష్మి. యాత్రాస్థలాలకు వెళ్లినప్పుడు అక్కడ తన మనసుకి నచ్చిన బొమ్మలు తెచ్చుకోవటంతో పాటు.. బంధువులు, స్నేహితులు ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారితో కూడా బొమ్మలు తెప్పించుకునేవారు. అలా చాలా బొమ్మలు సమకూర్చుకోగలిగారు విజయలక్ష్మి దంపతులు. ‘‘బొమ్మల కొలువుకి అన్నీ మట్టితో చేసిన బొమ్మలే కొంటాను. ప్లాస్టిక్‌వి, ఫైబర్‌వి నాకు ఇష్టం లేదు’’ అని చెప్పారు విజయలక్ష్మి.విజయలక్ష్మి ఐదు వరుసలతో ప్రారంభించిన ఈ బొమ్మల కొలువు ఇప్పుడు తొమ్మిది వరుసలకు చేరింది. అరుణాచల గిరి ప్రదక్షిణ, సప్తాశ్వ రథారూఢుడైన సూర్యభగవానుడు, రావణ దర్బారు, ఆంజనేయస్వామి తోక మీద కూర్చోవడం,  స్తంభం పగల గొట్టుకుని వచ్చిన నరసింహావతారం, కామాక్షి వ్రతం చేసే మహిళలు, సత్యనారాయణ వ్రతం, పెళ్లి తంతుతో కూడిన బొమ్మలు, కృష్ణుడు గోపికలు, బృందావనం, గుహుడు... ఇలా రకరకాల బొమ్మలను కొని అమర్చారు విజయలక్ష్మి.

‘‘బొమ్మల కొలువు కేవలం కాలక్షేపం కోసం కాదు, ఇతరులకు విజ్ఞానాన్ని పంచడం కోసం కూడా. మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ ఈ బొమ్మలకు సంబంధించిన కథలు చెబుతాం. పిల్లలు ఆసక్తి చూపుతుండటంతో మాకు మరింత ఉత్సాహంగా ఉంటోంది. భావితరాలకు నాకు తోచినది చెప్పాలనేది కూడా నా ఆకాంక్ష’’ అన్నారు విజయలక్ష్మి. ‘‘ఈ పది రోజులు మా అపార్ట్‌మెంట్‌ అంతా సందడిసందడిగా ఉంటుంది. పిల్లలే కాకుండా పెద్ద వాళ్లు కూడా వస్తారు. ఉదయాన్నే ప్రసాదం చేసి ఇంటికి వచ్చినవారికి పెడతాను. సాయంత్రం వాయనాలు ఇస్తాను’’ అని ఆమె తెలిపారు. బొమ్మలను అందంగా అమర్చడం చాలా కష్టంతో కూడిన పని. అయితే అందరూ వచ్చి ప్రశంసిస్తూంటే కష్టం మరచిపోతామంటారు విజయలక్ష్మి. ‘‘పది రోజులు పూర్తయ్యాక బొమ్మలను తీసేటప్పుడు మనసుకి కష్టంగా ఉంటుంది. కాని తప్పదు కదా, బొమ్మలను తీసి ముందుగా పేపర్‌లో చుట్టి, ఆ పైన గడ్డితో చుట్టి, వాటిని అట్టపెట్టెలలో భద్రపరుస్తాం’’ అని ఆమె చెప్పారు. 

‘మరపొచ్చి’ తప్పనిసరి
తమిళనాడు సంప్రదాయం ప్రకారం అతిథులు ఒక కొత్త బొమ్మ తెచ్చి, బొమ్మల కొలువు పెట్టిన వారికి ఇస్తారు. అలా ఇంట్లో బొమ్మల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇక్కడ అటువంటి సంప్రదాయం లేదు. అన్నీ నేను కొన్న బొమ్మలే. అరేంజ్‌మెంట్‌ ప్రతి సంవత్సరం మారుస్తాను. ‘మరపాచ్చి’ అని చెక్క బొమ్మలు ఉంటాయి. అవి బొమ్మల కొలువులో తప్పనిసరి. ఈ బొమ్మలను పది రోజులు ఉంచి పదకొండో నాడు తీసేస్తాం. నవమి రోజున బొమ్మలను పడుకోబెడతాం. విజయదశమి రోజున నిలబెట్టి, ఆ మరుసటి రోజున తీసేస్తాం. బొమ్మల కొలువు తత్త్వగుణానికి ప్రతీక.– విజయలక్ష్మి

– వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా