బోన భాగ్యాలు

15 Jul, 2018 00:50 IST|Sakshi

ఆషాఢమాసమంటే వర్షాకాలం. అంటే అంటువ్యాధులు వ్యాపించడానికి ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు్ట, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాకలు పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. భోజనము అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనము.

మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో పదికాలాలపాటు పచ్చగా ఉండాలనే  సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, గండిమైసమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాంకాళమ్మ తదితర గ్రామ దేవతలను ఆడపడచులుగా భావించి వారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు పెట్టి, భోజన నైవేద్యాలను సమర్పించి చీరసారెలతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా వేడుక జరుపుతారు. ఈ పండుగకే బోనాలపండుగ అని పేరు. ఆంధ్రాప్రాంతంలో కూడా ఈ విధమైన పండుగలు ఉంటాయి కాని వీటికి వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లున్నాయి.

తొలి, తుదిబోనాలు గోల్కొండ జగదాంబికదే!
మొదట వేడుకలు గోల్కొండ∙జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. ఈ మేరకు నేడు అమ్మ తొలిబోనం అందుకోనుంది. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోనూ, ఆ తర్వాత లాల్‌దర్వాజలోనూ,  అనంతరం అన్నిచోట్లా బోనాల సంబురాలు జరుపుతారు. తుదిబోనం కూడా గోల్కొండ జగదాంబికకే సమర్పించి, బోనాల పండుగకు వీడ్కోలు పలుకుతారు.

పరమాత్మలో చేరే జీవాత్మ
బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్రపరంగా చూస్తే వేపాకు, పసుపు, నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్య విన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఎంతో అవసరం.
 

మరిన్ని వార్తలు