బంధాలు... బంధనాలు

3 Jul, 2016 22:43 IST|Sakshi
బంధాలు... బంధనాలు

రమజాన్ మాసం వచ్చిందంటే హైదరాబాద్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సహజంగానే చార్మినార్ పరిసరాలు జనరద్దీతో కళకళలాడుతుంటాయి. రకరకాల వస్తుసామగ్రితో పాతబస్తీ దుకాణాలు మెరిసిపోతుంటాయి. చిన్నా పెద్దా వయోభేదం లేకుండా ఆడమగ అనే లింగభేదం లేకుండా ఆ పరిసరాలు జనజాతరను తలపిస్తుంటాయి. చార్మినార్ ప్రాంతంలో మాత్రమే దొరికే కొన్ని రకాల వస్తువులను కొనుక్కోవడానికి మహిళలు క్యూ కడతారు. రంగురంగుల, రకరకాల గాజులు, అత్తర్లు, నగలు, రకరకాల డ్రైఫ్రూట్స్, సేమియాలు, గాజు, పింగాణి వస్తువులు, వస్త్రాల కొనుగోలులో తలమునకలై పోతారు. హైదరాబాద్‌లో రంజాన్ హడావిడి, ప్రత్యేకించి పాతబస్తీ సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. పాతబస్తీకి పగలు-రేయి ఒక్కటే. మహిళల షాపింగ్‌తో చార్మినార్ పరిసరాలు పోటెత్తుతాయి. పిల్లల ఆనందానికి అవధులే ఉండవు. ఈ ఆహ్లాదకరమైన నేపథ్యంలో...
 
 
ఓ రోజు సాయంత్రం

షమీమ్ తన కొడుకు అంజుమ్‌ను ఇఫ్తార్ సామగ్రి కోసం చార్మినార్‌కు పంపింది. అంజుమ్ హుషారుగా బైక్ మీద బయలుదేరాడు. చార్మినార్ పరిసరాలన్నీ పోలీసుల పహరాలో ఉన్నాయి. ఏమై ఉంటుంది? ఇంత మంది పోలీసులు ఉన్నారెందుకు? అనుకుంటూనేదుకాణాల వైపు వెళ్తున్నాడు. క్షణాల్లోనే పాతబస్తీ మొత్తం పోలీసులు విస్తరించారు. అంజుమ్ అడుగుపెట్టేటప్పటికి పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు ఇప్పుడు వందకి పైగా ఉన్నారు. అంజుమ్ మనసు కీడును శంకించింది. తాను వచ్చిన పని పూర్తి చేసుకుని త్వరగా వెళ్లిపోవడం శ్రేయస్కరం అని తోచింది. ైబైక్‌ని తనకు అవసరమైన సరుకులు దొరికే దుకాణాల వరుసలోకి తిప్పాడు. అంతలో... ఓ పోలీస్ దారికి అడ్డుగా నిలబడి ఉన్నాడు. అంజుమ్‌ని ఆపేశాడు.
 
 
బండి కాగితాలు తియ్

బిక్కుబిక్కుమంటూ బండి దిగుతున్న అంజుమ్‌ను పోలీసు భాషలో నోటికొచ్చినట్లు తిడుతూ, ‘బండి కాగితాలు తియ్’ అని హూంకరించాడు. కాగితాల కోసం టూల్‌కిట్ దగ్గరకు వంగుతున్న అంజుమ్ జేబులో నుంచి రెండు పేపర్లు జారిపడ్డాయి. వెంటనే పోలీసు వాటిని తీసుకున్నాడు. అవి అరబ్, ఉర్దూ భాషల్లో ఉండడంతో అతడిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ‘ఐసిస్‌తో నీకెప్పటి నుంచి సంబంధం ఉంది? నువ్వెప్పుడైనా సిరియా వెళ్లావా? ఇక్కడ నీ బాస్ ఎవరు? ఎవరెవరితో పరిచయాలున్నాయి’ వంటి రకరకాల ప్రశ్నలు సంధించాడు. వాటిలో ఏ ఒక్క ప్రశ్నకూ అంజుమ్ దగ్గర సమాధానం లేదు. అతడి చేతిలో ఉన్నవి రంజాన్ వేళలు తెలిపే సమయ పట్టిక, నమాజుకు సంబంధించిన అరబీ బుక్‌లెట్స్.
 
 
వెళ్లినవాడు ఎంతకీ రాడేం?
 ఇక్కడ షమీమ్.. ఇంట్లో ఇతర పనులు పూర్తి చేసుకుని వంటకు సమాయత్తమవుతోంది. సరుకుల కోసం వెళ్లిన అంజుమ్ ఇంకా రాలేదేమిటి అనుకుంటూ ఇంట్లోకి, బయటకు తిరుగుతోంది. క్షణానికోసారి వీధి మలుపు వైపు చూస్తోంది. భర్త ఇక్బాల్ ఇంటికి వచ్చాడు. వంట చేసిన ఆనవాళ్లు కనిపించలేదు. ఇఫ్తార్ సమయం దాటిపోయింది. ఆలస్యమయ్యే కొద్దీ వారిలో ఆందోళన పెరుగుతోంది. అంతలో అంజుమ్ రానే వచ్చాడు. రావడానికైతే వచ్చాడు కానీ చేతిలో సరుకుల్లేవు. ముఖం పాలిపోయి ఉంది. బాగా భయపడ్డాడని తెలుస్తోంది. బైక్ నడపడం సరిగా రాకుండానే సెంటర్‌కు తీసుకెళ్లాడు. యాక్సిడెంట్ ఏమైనా జరిగిందేమోనని తల్లిదండ్రులు సందేహించారు. ఏమైందని అడిగితే మెల్లగా నోరు విప్పాడు అంజుమ్.
 

‘‘ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు పన్నాగం పన్నుతున్నారని పాతబస్తీలో పోలీసులు మోహరించారు. అనుమానం వస్తే చాలు వంద ప్రశ్నలు వేస్తున్నారు. చార్మినార్ దగ్గర నన్ను ఆపేశారు. నాకేమీ తెలియదని నమ్మకం కుదిరే వరకు కదలనివ్వలేదు. వాళ్లు వెళ్లమనగానే ఇంటికొచ్చేశాను. ఇక అక్కడ సరుకుల కోసం తిరగడానికి భయమేసింది’’ అంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు.  ‘‘టీవీలో అన్నిసార్లు చెప్తుంటే పిల్లాడిని చార్మినార్‌కి పంపిస్తావా’’ అని కసురుకుంటూ వెళ్లి టీవీ ఆన్ చేశాడు ఇక్బాల్.
 
 
ఎవరో ఏదో చేశారని!

టీవీలో దృశ్యాలు చూస్తుంటే షమీమ్‌కు స్పృహ తప్పినంత పనైంది. కొడుకుకు తప్పిన గండం గుర్తు చేసుకుని మరీ భయపడుతోంది. పదే పదే అల్లాను తలుచుకుంటోంది. ‘‘అల్లాహ్! పరుల ప్రాణాలు తియ్యమని, ప్రార్థనమందిరాలు ధ్వంసం చేయమని నా మతం ఎక్కడా చెప్పలేదు. ఎవరో ముష్కరులు ఏదో చేశారని అన్నెం పున్నె ఎరుగని నా కొడుకును అనుమానించారు. నా కొడుకును పెద్ద ఆపద నుంచి రక్షించావు. ఇలా ఎంతమందిని అనుమానిస్తారో? దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులతోపాటు ఎంతమంది అమాయకులు ఈ విషవలయంలో చిక్కుకుంటారో?’’ అని ఆవేదనతో ఆమె ఆత్మ ఘోషించింది.

ఈ ఆత్మఘోష ఒక్క షమీమ్‌ది మాత్రమే కాదు. పాతబస్తీలో అనేకమంది గుండెకోత. రంజాన్ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. మాసం మొదలైనప్పటి నుంచి పండుగను ఎంత వేడుక చేసుకోవాలోనని కలలుకంటారు. నిన్న, మొన్నటి కలకలంతో పాతబస్తీలో మాత్రమే కాదు హైదరాబాద్‌లో అనేక కుటుంబాలు భయం గుప్పెట్లో రోజులు గడుపుతున్నాయి. పండుగ సంతోషం నగరవాసుల ముఖాల్లో కనిపించడం లేదు. ‘అల్లాహ్! పండుగ రోజుల్లో కూడా ఈ శిక్ష ఏంటి? మాకెందుకీ శిక్ష’ అంటూ నగరవాసి ఆవేదన. నగరంతో బంధం కలుపుకున్న ప్రతి ఒక్కరి ఆందోళన.
 - ఎం.డి ఉస్మాన్‌ఖాన్
 
 
ఇస్లాం బోధనలు

నిష్కారణంగా ఒక మనిషిని హతమారిస్తే మానవజాతిని చంపినట్లే.ఎవరి మాటల ద్వారా, చేతల ద్వారా వారి పొరుగువారు సురక్షితంగా ఉండరో వారు విశ్వాసులు కారు. మీ పొరుగువారు పస్తులుంటే, మీరు గనుక కడుపు నిండా భుజిస్తే మీలో విశ్వాసం లేదు. భువిలో కల్లోల్లాన్ని రేకెత్తించకండి. అలాంటి వారిని దేవుడు ప్రేమించడు. మంచికీ, దైవభక్తికీ సంబంధించిన పనుల్లో అందరితో సహకరించండి. పాపకార్యాల్లో, అత్యాచారాల్లో ఎవరితోనూ సహకరించకండి. దైవానికి భయపడండి. ఇది దైవభక్తి పరాయణతకు నిదర్శనం.సాటి వారిని ప్రేమించండి. వారి ధన, మాన, ప్రాణాలకు హాని తలపెట్టకండి. అది నిషిద్ధం. అది పాపం. అది నరకం.  హింసా దౌర్జన్యాలు పరిష్కార మార్గాలు కానేకావు. అవి ప్రగతికి, మన ఉనికికే అవరోధాలు, ప్రమాదాలు.
 
 
 

>
మరిన్ని వార్తలు