వాల్తేరు రైలు నుంచి వెండితెరకు

13 Jan, 2020 02:46 IST|Sakshi

గ్రామీణ కళ

కళను వెతుక్కుంటూ ప్రజలు రానప్పుడు ప్రజల్ని వెతుక్కుంటూ కళ వెళుతుంది. తన కళకు వేదిక దక్కని అసిరయ్య రైలు కంపార్ట్‌మెంట్‌నే వేదిక చేసుకున్నాడు. ప్రయాణికుల్నే ప్రేక్షకులుగా మార్చుకున్నాడు. ఇవాళ అతని ప్రయాణం సినిమా పరిశ్రమ వరకు చేరింది.

‘పట్టుసీర  కట్టమన్నది మాయత్త కట్టేక వద్దన్నది మరదలు మందారమాల’... ‘నా కాళ్లకు పట్టీలు లేవండో కన్నోరింటికి రానండి’.... ‘బావొచ్చాడో లక్క బావొచ్చాడొ... ఎత్త బావున్నాడో బావ బాగున్నాడు’... ‘ఓరి, ఇటూరికి ఇగురు కూర... పైఊరూకి రొయ్యల కూర’...

రైల్లో ఈ పాటలు వినిపించాయంటే మనం వాల్తేరు చుట్టుపక్కల ఉన్నట్టు. కంపార్ట్‌మెంట్‌లోకి జముకు కళాకారుడు బోనెల అసిరయ్య ఎక్కినట్టు. ఉత్తరాంధ్రలో జముకు వాయిద్యానికి ప్రత్యేక ఆదరణ ఉంది. అక్కడి గ్రామాల్లో  రాములవారి సంబరాలు, ఎల్లమ్మ పేరంటాలు జరిగిన సమయాల్లో జముకులకుండ కళను ప్రదర్శించే కళాకారులు ఉన్నారు. వారిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నవాడు సంతకవిటి మండలంలో వాల్తేరు గ్రామానికి చెందిన అసిరయ్య. ఆ కళను నమ్ముకునే అతను తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. దాని ఆధారంగానే ముగ్గురు ఆడపిల్లలకు వివాహం జరిపించాడు. కుమారుడిని ఎంఏ, బీఈడీ చదివించాడు.

అయితే కాలం మారిపోయింది. జముకుల కథ పాటకు గ్రామాల్లో డిమాండ్‌ తగ్గింది. కల చెదిరింది. దీంతో చేసేదిలేక అసిరయ్య ప్రతిరోజూ ఇంటి వద్ద నుంచి బయలుదేరి దగ్గర్లోని పొందూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని ట్రైన్‌లో తాను నమ్ముకున్న జముకుల కథను వినిపించడం మొదలుపెట్టాడు. విశాఖపట్నం–అనకాపల్లి మార్గంలో రైలులో పాడుతూ ప్రయాణికులు ఇచ్చే డబ్బులతో జీవిస్తున్నాడు. రోజుకి రూ.300 – రూ. 400 సంపాదించి ఇంటికి చేరుకుంటాడు. అయితే అందరి చేతుల్లో సెల్‌ఫోన్లు ఉండటం వల్ల చాలామంది ఇతని పాటలను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అవి వైరల్‌ అయ్యాయి. అవి మెల్లగా అతణ్ణి సినిమా పరిశ్రమకు తీసుకెళ్లాయి.

రఘు కుంచె చొరవతో
రైలు ప్రయాణంతో జీవనం సాగిస్తున్న అసిరయ్య పాట ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘు కుంచె చెవిలో పడింది. ఆయన ఈ కళాకారుడిని గుర్తించడంతోపాటు హైదరాబాద్‌కు రప్పించుకుని ‘పలాస 1978’ సినిమా టైటిల్‌ సాంగ్‌కు జముకును ఉపయోగించుకున్నారు. అసిరయ్య ఒక పాట కూడా పాడారు. రఘు కుంచె స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో ప్రస్తుతం అసిరయ్య గురించి సోషల్‌ మీడియా హల్‌చల్‌ చేస్తుంది. అసిరయ్య అందరి దృష్టిలో పడ్డారు. సోషల్‌ మీడియాలో సెలబ్రిటీ అయిపోయారు.  
– కథనం: కందుల శివశంకర్,
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
ఫొటోలు: వి.వి.దుర్గారావు, సాక్షి, రాజాం.

నా పాటే అన్నం పెడుతుంది

గతంలో నా వద్ద రెండు మూడు కుటుంబాలు బతికేవి. ఇప్పుడు నా జీవనమే కష్టంగా మారింది. కళను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. ట్రైన్‌లలో కళను ప్రదర్శించి జీవనోపాధి పొందుతున్నాను. ఇప్పటికీ నా జీవనాన్ని నా కళే నడుపుతుంది.  జానపద పాటలే కాకుండా, భారతం, సుభద్ర కళ్యాణం, శశిరేఖ పరిణయం, సారంగధర కథలు వంటివి చెప్పగలను.
– బోనెల అసిరయ్య

మరిన్ని వార్తలు