ఇంట్లోని పదివేల సంగతుల్లో ఒకటి

4 Jun, 2018 02:21 IST|Sakshi

కొత్త బంగారం
తల్లికీ తండ్రికీ మధ్యనున్న సంబంధం చెడుతున్నప్పుడు, పిల్లలు కూడా ఎలా ఇంటి జగడాల్లో చిక్కుకుని, దారి తప్పుతారో ఈ నవల తెలియజేస్తుంది. జూలియా పియర్‌పాంట్‌ తొలి నవల, ‘అమంగ్‌ ద టెన్‌ థౌజండ్‌ థింగ్స్‌’లో, ఒకరోజు పదకొండేళ్ల పిల్ల ‘కే షాన్లే’ తమ న్యూయార్క్‌ అపార్టుమెంటు బిల్డింగ్‌ లోపలికి వస్తున్నప్పుడు, సెక్యూరిటీ వ్యక్తి, ‘మీ అమ్మకోసం వచ్చింది’ అంటూ ఒక పెద్ద అట్టపెట్టె అందించడంతో ప్రారంభం అవుతుంది. పెట్టె సరిగ్గా మూసి ఉండదు. దాన్లో కట్టలకొద్దీ ఉన్న కాగితాలని చదివిన ‘కే’కి సరిగ్గా అర్థం కాక, 15 ఏళ్ళ అన్న సైమన్‌కు చూపిస్తుంది. వాళ్ళిద్దరూ జేక్‌ షాన్లే, దెబ్‌ దంపతుల పిల్లలు. పాకెట్‌ తల్లికందిస్తారు. దాన్లో, ‘డియర్‌ దెబొరా, నాకు నీ భర్తతో క్రిత ఏడు నెలలుగా సంబంధం ఉంది...’ అంటూ మొదలైన ఉత్తరంతో పాటు, ఆ స్త్రీకీ, జేక్‌కూ మధ్య జరిగిన లైంగిక సంబంధపు వివరాలున్న మెయిళ్ళ ప్రింట్‌ ఔట్లు ఉంటాయి.

పేరు పొందిన ఆర్టిస్ట్‌ అయిన జేక్‌ అప్పటికే ఆ సంబంధాన్ని వదిలివేయడం, భార్యతో అతని సంబంధం మెరుగవడం కూడా జరుగుతాయి. ‘జేక్‌ నన్ను గౌరవిస్తాడు. అతను సాధువని అనుకోను కానీ, జరుగుతున్నదేమిటో నేను తెలుసుకోదలచుకోలేదు’ అంటూ, స్త్రీల పట్ల భర్తకున్న బలహీనతా, ఈ సంబంధం గురించి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్న దెబ్‌కు పిల్లల అనుభూతులని దృష్టిలో పెట్టుకుని, జేక్‌తో తనకున్న సంబంధం గురించి తిరిగి ఆలోచించుకోవలసి వస్తుంది. పిల్లలు తండ్రిమీదే కాక ఈ సంబంధాన్ని అనుమతించిన తల్లిమీద కూడా కోపం తెచ్చుకుంటారు. కుటుంబంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల, నలుగురూ తమతమ విధానాల్లో చిరాకు పడుతున్నవారే. 

తల్లి పరధ్యాసని ఆసరాగా తీసుకుని సైమన్‌ డ్రగ్స్‌ తీసుకోవడం, చిన్నపాటి నేరాలు చేయడం మొదలెడతాడు. కే తన క్లాసులో ఎదుర్కొంటున్న సమస్యల వల్ల మ«థనపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయికున్న అయోమయాన్నీ, జేక్‌ స్వార్థపూరిత స్వభావాన్నీ, అతని ప్రగల్భాలనీ నేర్పుగా విశ్లేషిస్తారు రచయిత్రి. తల్లికీ తండ్రికీ మధ్యనున్న సంబంధం చెడుతున్నప్పుడు, పిల్లలు కూడా ఎలా ఇంటి జగడాల్లో చిక్కుకుని, దారి తప్పుతారో తెలుస్తుంది. 

పుస్తకపు రెండవ భాగంలో కష్టకాలాన్ని ఎదుర్కునే ప్రయత్నం చేస్తున్న పాత్రల వల్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. పియర్‌పాంట్‌ పిల్లల మనస్సుల్లోకి దూరి వాళ్ళ గురించి పాఠకులకు చెప్పడం మొదలెట్టాక, పుస్తకం తిరిగి దారిలోకి వస్తుంది. మూడో భాగంలో– నవల హఠాత్తుగా భవిష్యత్తులోకి గెంతి, ప్రతీ పాత్ర జీవితంలో ఏమయిందో చెప్తూ, ‘పాత్రలన్నీ తప్పు నిర్ణయాలు తీసుకోవడం కొనసాగిస్తూనే మళ్ళీ కలుసుకుంటాయి’ అన్న ముగింపును పాఠకులకి తెలిపి, ‘అద్భుతంగా కనిపించే కుటుంబాల్లో ఏదీ అద్భుతమైనది కాదు. రహస్యాలు ఏదో విధంగా బయట పడతాయి’ అంటూ, వర్తమానానికి తిరిగి వస్తుంది. 

ఏ వయస్సులోనైనా సరే ఎదగడం అన్నది ఎంత బాధాకరమైనదో అన్నది, ‘పదివేల సంగతుల్లో’ ఒకటి. ‘దాంపత్య జీవితంలో మోసం’ అన్న వృత్తాంతం కొత్తదేమీ కాకపోయినప్పటికీ, చక్కటి వాక్యనిర్మాణం, స్వల హాస్యం ఉన్న నవల ఒకే ఊపులో చదివిస్తుంది. ‘ఒక వివాహబంధంలో చాలినంత ప్రేమ ఉండి ఆర్థికపరంగా సౌకర్యంగానే ఉన్నప్పుడు, వివాహేతర సంబంధాలని చూసీ చూడనట్టు వదిలేస్తేనే నయం’ అన్న అంతర్లీనమైన సందేశం ఇచ్చిన రచయిత్రి వయస్సు పుస్తకం రాసేటప్పటికి 28 ఏళ్ళు మాత్రమే. 

నవల అచ్చయినది 2015లో. రాండమ్‌ హౌస్‌ పబ్లిష్‌ చేసిన ఈ నవల ‘న్యూయార్క్‌ బెస్ట్‌ సెల్లర్‌’గా ఎన్నుకోబడింది. ఆడియో పుస్తకం ఉంది.

- కృష్ణ వేణి

మరిన్ని వార్తలు