దైవీయత కంటే మానవీయతకే ప్రాధాన్యం

14 Jan, 2019 03:18 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

‘సాహిత్యశాస్త్రం ఇతర శాస్త్రాలతో సంబంధం లేని స్వయం సమగ్ర శాస్త్రంగా ఆలంకారికుల నుంచి ఆధునిక విమర్శకుల దాకా చాలామంది భావించారు. దీనివల్ల సాహిత్య శాస్త్ర పరిధి సంకుచితమై, అభివృద్ధి మందగించింది’. కానీ డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ మాత్రం ఇతర సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని పరిశీలించారు. తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, మొదలైన శాస్త్ర సాధనాల్నీ, పరిభాషనీ గ్రహించి విలువైన ప్రతిపాదనలు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి పుస్తక రూపమే ఈ ‘సాహిత్యం– మౌలిక భావనలు’. 

ద్వితీయ వాస్తకవికత అంటే ఏమిటి? పరాయితనం ఎలా మొదలైంది? ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల మధ్య ఘర్షణ ఎలాంటిది? కళా వాస్తవికత, భావనా వాస్తవికతల మధ్య తేడాలేమిటి? ఈ క్రమంలో మనిషికి అసలు కళ ఎందుకు అవసరమైంది? అందులోంచి సాహిత్యం ఎలా పుట్టుకొచ్చింది? ఎలా విస్తరించింది? ఏయే పాయలుగా ప్రవహించింది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలను ఆసక్తికరంగా ఆవిష్కరిస్తారు.

జీవిత సాహిత్య దృక్పథం, స్థలకాల బద్ధత, చారిత్రక నియతి, సాహిత్య చలనం, వర్తమానత, గతాగత సంబంధం, అధిచారిత్రక లక్షణం, సాంతత, పాక్షికత్వం తదితర అంశాల ద్వారా ‘సాహిత్య పరిధి’ని నిర్వచిస్తారు. ‘సాహిత్యానికి కేంద్ర బిందువు’ను కనిపెట్టడంలో భాగంగా దైవ–మానవ శక్తుల, నమ్మకాల గురించి కూలంకషంగా చర్చించారు. సాహిత్యంలోగానీ, జీవితంలోగానీ తారసిల్లే దైవాంశని తిరస్కరించే వీలు లేదు. అయితే సాహిత్యంలో దైవీయత కంటే మానవీయతకే ప్రాధాన్యం ఉండాలని ప్రతిపాదిస్తారు.

‘జీవితంలోని సాఫల్య వైఫల్యాలు, వినోద విషాదాలు, చీకటి వెలుగులు సాహిత్యంలో ఆవిష్కరించబడా’లంటారు. రెండు దశాబ్దాల క్రితం ప్రచురితమైన ఈ అయిదు అధ్యాయాల పుస్తకంలో చాలాచోట్ల మార్క్స్‌ దృక్కోణం నుంచి చేసిన పరిశీలన సాహిత్యపు మూలాల్ని పట్టిస్తుంది.
-  ఎమ్వీ రామిరెడ్డి

మరిన్ని వార్తలు