ప్రతిధ్వనించే పుస్తకం

26 Feb, 2018 01:22 IST|Sakshi

ఒక యువకుడిలో చెలరేగిన తీవ్రమైన అంతరంగ సంవేదనల బహిఃరూపమే ‘అంపశయ్య’. . ఒక మారుమూల పల్లెటూరి నుంచి ఎం.ఎ. చదవడానికి వచ్చిన రవికి, ఫైనల్‌ పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఒక రోజు తెల్లవారుఝామున ఒక భయంకరమైన కల రావడంతో నవల ప్రారంభమవుతుంది.

తనొక అంతులేని జలపాతంలో కొట్టుకుపోతున్నట్టూ, తనను రక్షించడానికి తల్లీ, చెల్లెలూ కూడా ఆ జలపాతంలో  కొట్టుకుపోవడం అనే కల అతడి మనస్తత్వానికి ప్రతీక. అతనిని వేధిస్తున్న పరీక్షల భయం; తనను చదివించడం కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు; వాళ్ళ కష్టాలు తీర్చడానికి భవిష్యత్తులో తనకు ఉద్యోగం దొరుకుతుందా లేదా అనే ఆందోళన; చిన్ననాటి నెచ్చెలి రత్తి తన పిరికితనం వల్ల బలయిపోవడం వంటి అనేక ఆలోచనలు ఆ స్వప్న రూపంలో పాఠకులకు తెలియజేస్తాడు రచయిత. ఒక విధంగా తను చెప్పాలనుకున్న ముఖ్యమైన పాయింట్‌ను ఈ ఒక్క కలతో రివీల్‌ చేస్తాడు.

ఇక ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ రవిలో గొప్ప మానసిక సంఘర్షణకు దారి తీస్తాయి. డిగ్రీలో అతనికి పాఠాలు చెప్పిన లెక్చరర్‌ ఉపేంద్ర, యూనివర్సిటీ విద్యార్థి జీవితం ‘అంపశయ్య’ వంటిదనీ, ఆ దశను ముళ్ళపాన్పులాగా కాక, రాబోయే జీవితంలో ఎదుర్కునే సమస్యలను తట్టుకునే స్థైర్యాన్ని కలిగించే పూలపాన్పులా, ప్రయోగశాలగా భావించాలనీ రవికి హితబోధ చేస్తాడు. క్యాంపస్‌కు వచ్చిన రవిని రత్తి ఙ్ఞాపకాలు వేధిస్తాయి. ఆ బాధలో నుండి ఒక విధమైన తెగింపు వస్తుంది. దాంతో రెడ్డి బ్యాచ్‌తో తలపడి దెబ్బలు తిని, దెబ్బలు కొట్టడంతో రెడ్డి బ్యాచ్‌ పారిపోతుంది. ఒక విజయం సాధించిన భావంతో రవి రూముకి వచ్చి పడుకోవడంతో నవల ముగుస్తుంది.

ఇదీ కథ. సామాన్యమైన కథే. కానీ, ఆ కథను రవి పరంగా చైతన్యస్రవంతి శిల్పంలో చెప్పిన విధానమే, ఈ నవలకు అఖండ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. 1965–70 ప్రాంతంలో రచయిత నవీన్‌ తనకు కలిగిన స్వీయానుభవాలకు – ఆనాటి, అంటే స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దం గడిచినా స్వతంత్ర ఫలాలు తమకు అందకపోవడంతో నిరాశలో ఉన్న యువతీయువకుల ఆశలనూ ఆశయాలనూ అద్ది, కొంత ఈనాటి సాహిత్యకారులు ఆమోదించని బూతు మాటలను వాడటంతో అంపశయ్యకు ఒక రకమైన తిరుగుబాటు నవల అనే పేరొచ్చింది. కానీ, ఇది ఏ తరంలోని యువత ఆశయాలనైనా ప్రతిబింబించే నవల. సెక్స్, ఆకలి, పరీక్షల భయం, భవిష్యత్తు గురించిన భయాలు ఏ తరానికైనా ఒక్కటే.
డాక్టర్‌ ప్రభాకర్‌ జైని

మరిన్ని వార్తలు