నేటి స్త్రీ కథ కూడా పాతకథేనా?

17 Feb, 2020 01:16 IST|Sakshi
కర్మా బ్రౌన్‌, రెసిపీ ఫర్‌ ఎ పెర్‌ఫెక్ట్‌ వైఫ్‌

కొత్త బంగారం

ఇంతకుముందే చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్పటంలో ఒక ఇబ్బంది ఉంది: కొత్తగా ఉంటే తప్ప ఆ రచన ఆకట్టుకోలేదు. ఫెమినిజం మీద ఇంత సాహిత్యం వచ్చాక, ఇంకో నవల రాయాలంటే ఒక కొత్త ఎత్తుగడ అవసరం. ఆ అవసరం దృష్ట్యా, కథ విస్తరణలో చూపిన నైపుణ్య విభవమే కెనడియన్‌ రచయిత్రి కర్మా బ్రౌన్‌ ఐదవ నవల రెసిపీ ఫర్‌ ఎ పెర్‌ఫెక్ట్‌ వైఫ్‌.

ఆలిస్‌ దంపతులు మాన్‌హటన్‌ జీవితపు హడావుడికీ, హుషారుకూ దూరంగా ఉండే గ్రీన్‌విల్‌కి చేరతారు. ఎటూ తనకి ఉద్యోగం లేదు కదా అని అయిష్టంగానే ఆలిస్‌ ఒప్పుకుంటుంది కానీ– ఆ పాతకాలపు ఇల్లూ, పరిసరాలూ ఆమెకి నచ్చవు. వాటికి క్రమంగా అలవాటు పడుతున్నప్పుడు ఆ ఇంటి పాత యజమానురాలైన నెల్లీ వస్తువులు కొన్ని ఆలిస్‌కి తటస్థపడతాయి. 1950ల నాటి నెల్లీ వంటల పుస్తకం, పత్రికలూ, తన తల్లికి రాసి పోస్ట్‌ చేయని ఉత్తరాలూ కనిపించి ఆలిస్‌లో ఒక కుతూహలాన్ని కలిగిస్తాయి. ఇక్కడినుంచీ నవల నెల్లీ, ఆలిస్‌ల కథనాలతో రెండు పాయలుగా కదులుతుంది. 

నెల్లీ ఉత్తరాలూ, వంటల పుస్తకం ద్వారా ఆమె జీవితం ఆలిస్‌కి ఆవిష్కృతమవుతుంది. స్వతహాగా స్నేహశీలి అయిన నెల్లీ ఇంటి బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే ఉంటుంది. కానీ శారీరకంగా మానసికంగా హింసిస్తూ, తనకి ఏ మాత్రం విలువనివ్వని భర్తతో ఆమె వైవాహిక జీవితం దుర్భరంగా ఉంటుంది. అతని దెబ్బల్ని డ్రెస్సుల మాటునా, దాష్టీకాన్ని మౌనం చాటునా దాచుకుని భరిస్తూ, అతని అక్రమ సంబంధాన్ని సైతం సహిస్తూ ఉంటుంది. పిల్లలు కావాలన్న కోరిక బలంగా ఉన్న భర్త ఆమె ఇష్టాయిష్టాలనూ, మానసిక పరిస్థితినీ గమనించుకోడు; ఆమె ఉనికికి ఒక గౌరవాన్నీ ఇవ్వడు.

ఈ విషయాలన్నీ ఆలిస్‌ని కలవరపెడతాయి. ఉదాహరణకి పిల్లల విషయంలో తన అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోడు భర్త. అన్ని విషయాలలోనూ అతని ఇష్టాల మేరకు సర్దుకుపోవలసిందేనా అన్నది ఆలిస్‌ ప్రశ్న. అప్పటి నెల్లీ పరిస్థితీ, ఇప్పటి తన పరిస్థితీ ఒకేలా ఉన్నాయనుకుంటుంది. నెల్లీ స్వతంత్రంగా నిలబడటానికి ఏం చేసింది? ఈ స్ఫూర్తితో ఆలిస్‌ జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి? ఈ విషయాల మీదుగా ఊహించని మలుపుతో ఇద్దరి కథా, నవలా ముగుస్తుంది. 

ఈ నవల రాయడానికి అరవై ఏళ్ల క్రితం ఉన్న స్త్రీ–పురుష సంబంధాల గురించీ, సాహిత్యంలో వాటి ప్రతిఫలనాల గురించీ రచయిత్రి చేసిన అధ్యయనం నవలలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి– నెల్లీ కథనంతో ఉన్న ప్రతి అధ్యాయమూ ఆనాటి వంటల రెసిపీలతో (చాకొలేట్‌ చిప్‌ కుకీస్, మింట్‌ సాస్‌ లాంటివి) మొదలవుతుంది. ఆనాటి పుస్తకాల్లో స్త్రీలు ఎలా ఉండాలో చెప్పిన పితృస్వామ్యపు సూక్తులతో (‘భర్త సమస్యలను  జాగ్రత్తగా విను. వాటితో పోలిస్తే నీవి చాలా చిన్నవి...’, ‘నీ భర్త నిన్ను సంతోషపెడతాడని ఆశించవద్దు. అతన్ని సంతోషపెట్టు– అందులోనే నీ సంతోషం దాగుంది.’) ఆలిస్‌ అధ్యాయాలు ప్రారంభమవుతాయి.

‘‘ఆ రోజుల్లో పెళ్లయ్యీ, పిల్లలు లేకపోతే అదో సమస్య. సాంఘికమైన ఒత్తిళ్లు ఆ స్థాయిలో ఉండేవి,’’ అని నవలలో ఒక పాత్ర అంటుంది. ఈ రోజుల్లో కూడా ఒత్తిళ్లు అలానే ఉన్నాయి అనుకుంటుంది ఆలిస్‌. స్త్రీలు పురోగతి సాధించారనీ, సాధికారతని పొందారనీ అనుకుంటున్నాం కానీ– అలాంటి అపోహలకి లోనుకాకుండా, ఆ ప్రగతి కేవలం ఉపరితల దృశ్యమేనా అని బేరీజు వేసుకోవడం అవసరమని రచయిత్రి అభిప్రాయం. 

డటన్‌ పబ్లిషర్స్‌ ద్వారా గత సంవత్సరం విడుదలయిన ఈ పుస్తకం పాఠకులని బాగా ఆకర్షించింది. 

-పద్మప్రియ

మరిన్ని వార్తలు