దందహ్యమాన వర్తమానము

29 Jun, 2020 01:57 IST|Sakshi

స్కూల్లో చదువుతున్నప్పుడు ఆటల్లో మహాచురుగ్గా ఉండేది జివాన్‌. మంచి క్రీడాకారిణి అవుతుందనుకున్న పి.టి. సర్‌ ఆశలకి భిన్నంగా– స్కూల్‌ ఫైనల్‌ అయిపోగానే, ఇంటికి సాయపడదామని పాంటలూన్స్‌ షోరూమ్‌లో సేల్స్‌గర్ల్‌గా చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకుంది ఈ ముస్లిం అమ్మాయి. సొంతంగా ఒక స్మార్ట్‌ ఫోన్‌ కూడా కొనుక్కుని ఆశల మెట్లు ఎక్కడం ప్రారంభించింది. చదువురానివాళ్లకు సహాయపడాలని లవ్‌లీ అనే హిజ్డాకి ఇంగ్లీష్‌ పాఠాలు చెప్పడం, ఫేస్‌బుక్‌లో సామాజిక సమస్యల మీద స్పందించే చైతన్యశీలి జివాన్‌. కోల్‌కతాలో తనుంటున్న మురికివాడలకి దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్‌ దగ్గర ఒకరోజు నిలుచుని ఉన్నప్పుడు కొంతమంది తీవ్రవాదులు రైల్వే కంపార్ట్‌మెంట్స్‌ తలుపులు మూసేసి, లోపలున్నవారిని తగలబెట్టేస్తున్న ఘోరాన్ని చూస్తుంది.

ఇది జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా మౌనంగా చూస్తూ వున్నారని తెలుసుకుని, ‘‘మనలాంటి వాళ్లకి సహాయం చేయకపోగా, చచ్చిపోతుంటే చూస్తూ వూరుకున్న ఈ ప్రభుత్వం కూడా టెర్రరిస్ట్‌ కాదా?’’అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెడుతుంది. ఫలితంగా కొద్ది రోజుల్లోనే అర్ధరాత్రప్పుడు అరెస్ట్‌ కాబడి, తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో విచారణ ఖైదీగా జైలుకి చేరుతుంది. మధ్యతరగతి ఆర్థిక వర్గానికి చేరుకోవాలనే ఒక్క ‘దురాశ’తప్ప మరేమీ కోరికల్లేని జివాన్‌ భవిష్యత్తు అనిశ్చిత స్థితికి చేరుకుంది.జివాన్‌ది కేవలం తాత్కాలికావేశమే అనీ, దేశద్రోహ చింతన ఉన్న అమ్మాయి కాదనీ కోర్టులో చెప్పగలవారు ఇద్దరున్నారు. లవ్‌లీ, పి.టి. సర్‌. జివాన్‌ జైలులో మగ్గుతున్న కాలంలో వీరిద్దరి జీవితాలలోనూ పెనుమార్పులొస్తాయి.

లవ్‌లీకి అనుకోకుండా సినిమా అవకాశాలు రావడంతో, జివాన్‌కి మద్దతిచ్చి భవిష్యత్తుని పాడు చేసుకోకూడదని శ్రేయోభిలాషులు హితవు చెబుతారు. అనుకోకుండా ఒక మతవాద రాజకీయ పార్టీ సభకి వెళ్లిన పి.టి. సర్‌ అక్కడివారి దృష్టిలో పడి, ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నికల తర్వాత ఆ మతతత్వపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, అందులో ఒక సెక్రటరీ అవుతాడు. హిందూత్వానికి వ్యతిరేకంగా జరిగే తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ప్రభుత్వంగా, రైలు దహనం కేసులో ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చే బాధ్యత తమమీద ఉంది కాబట్టి, జివాన్‌ కేసుని త్వరగా తేల్చేయడానికి పి.టి. సర్‌ చర్యలు తీసుకుంటాడు. సామాజికంగానూ, ఆర్థికంగానూ, చివరికి నైతికంగా కూడా ఎలాంటి మద్దతూ లేని జివాన్‌ ఎలాంటి ముగింపుకి చేరగలదో అక్కడికే చేరుతుంది. జివాన్, లవ్‌లీ, పి.టి. సర్‌– విభిన్న నేపథ్యాలున్న ముగ్గురూ జీవితాన్ని మొదటి మెట్టు దగ్గర్నుంచి ప్రారంభించినవారే.

కానీ కొంతమందే నిప్పులు చిమ్మగలరు. కొంతమంది నెత్తురు మాత్రమే కక్కగలరు. కోల్‌కతాలో పుట్టి పెరిగి, అమెరికాలో స్థిరపడ్డ మేఘా మజుందార్‌ తొలిప్రయత్నం ఈ నెలే విడుదలయిన ‘ఎ బర్నింగ్‌’ నవల. కేవలం మూడే పాత్రల బహుళ కథనాలతో నడిచే నవలలో జివాన్, లవ్‌లీల కథనాలు ఉత్తమ పురుషలోనూ, పి.టి. సర్‌ కథనం ప్రథమ పురుషలోనూ చిన్నచిన్న అధ్యాయాలుగా ఉండటం వల్ల చదువరిని సూటిగానూ, వాడిగానూ తాకుతాయి. పాత్రలకి ఉపయోగించిన భాష (ఇండియన్‌ ఇంగ్లీష్‌) కూడా, పాత్రల నేపథ్యాలకి తగినట్టుగా మారుతూ ఉండటం మరో విశేషం. జివాన్‌ కథనం అభావంగా ఉంటే, లవ్‌లీ కథనం మౌఖికమైన భాషతో వ్యక్తీకరణే లక్ష్యంగా లైవ్‌లీగా ఉంటుంది. ప్రథమ ప్రయత్నంలోనే విలక్షణమైన గుర్తింపుని రచయిత్రి పొందడానికి కథనంలో చూపిన విచక్షణత ఒక కారణమైతే, తలెత్తుతున్న ఫాసిస్టు ధోరణుల సమకాలీనతని వస్తువుగా స్వీకరించడంలో ఉన్న తక్షణత మరో కారణం. 

రైల్వే కంపార్ట్‌మెంట్‌ లోపల అమాయక ప్రజల జీవితాలు కాలిపోవడం ఘోరమైన విషయమే. ఖండించి తీరాల్సిన అంశమే. అయితే, బాహ్యప్రపంచంలో మతరాజకీయాల్లో పడి జీవితాలు దగ్ధమవడం మరింత శోచనీయమైన విషయం– వీటి లెక్కలు ఎక్కడా కనిపించవు కూడా! ‘రోజులు మారాయి, నిజమే; చీకట్లు మారలేదు, అదీ నిజమే’ అని శ్రీశ్రీ ఒక బెంగాలీ కవితని నలభయ్యేళ్ల క్రితం అనువదించారు. దురదృష్టవశాత్తూ, ఆ మాటలు ఇప్పటికీ నిజమే.
- ఎ.వి.రమణమూర్తి 

నవల: ఎ బర్నింగ్‌
రచన: మేఘా మజుందార్‌
ప్రచురణ: నాఫ్‌; జూన్‌ 2020 

మరిన్ని వార్తలు