ఇంట్లో కూతురు పుడితే...

31 Jan, 2017 23:28 IST|Sakshi
ఇంట్లో కూతురు పుడితే...

చుట్టుపక్కల అసూయ పుడుతోంది!
దక్షిణ కొరియా


‘ఐ క్రైడ్‌ వెన్‌ ఐ హర్డ్‌’.వినగానే తను ఏడ్చేసిందట! ఓ బ్లాగర్‌ రాసుకుంది. ఇంతకీ ఆమె ఏం విన్నది? ఎందుకు ఏడ్చింది? డెలివరీ కాగానే, ‘మ్యామ్‌.. యు ఆర్‌ బ్లెస్డ్‌ విత్‌ ఎ బేబీ బాయ్‌’ అని నర్సు వచ్చి ఆమెకు చెప్పింది. ఆ వెంటనే, ‘దేవుడా.. అబ్బాయినిచ్చావా? నేనేం పాపం చేశాను’ అని ఆ తల్లి పెద్దగా రోదించింది! ఎక్కడున్నాం మనం? ఇండియాలోనేనా? కాదు. కొరియాలో! దక్షిణ కొరియాలో. కొరియాలో ఇప్పుడు.. కూతురు పుట్టనివాళ్లు శాపగ్రస్తులు! ‘ఏం కడుపే తల్లీ.. రెండు కాన్పుల్లోనూ అబ్బాయేనా అని ఆరళ్లు కాదు కానీ, ఆ స్థాయిలో కోడళ్లకు అత్తలు మొటిక్కాయలు వేస్తున్నారు. భర్తలైతే.. ‘ఈసారైనా అమ్మాయిని కనకపోతే బంధుమిత్రుల్లో మనం తక్కువైపోతాం’ అని ఫీలవుతున్నారు. ‘ఓనర్స్‌ ప్రైడ్‌.. నైబర్స్‌ ఎన్వీ’ అని అప్పట్లో ఓ టీవీ యాడ్‌ వచ్చేది. అలా.. ఒక ఇంట్లో కూతురు పుడితే చుట్టుపక్కల ఇళ్లల్లో అసూయ పుడుతోంది... ఆ దేశంలో! కొరియాలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఆడపిల్లే కావాలి. పిల్లల్ని కనగలిగిన వయసులో ఉన్న దంపతులు ఆడపిల్లను కనేందుకే ఇష్టపడుతున్నారు. భర్తలైతే.. ‘అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది’ అని డెలివరీ రూమ్‌ల బయట ఆశగా పాడేసుకుంటున్నారు! దాంతో  డాల్‌బాబో (ఛీఛ్చీ b్చbౌ) అనే కొత్త కొరియా మాట వాడుకలోకి వచ్చింది. అంటే.. ‘కూతుళ్లు కావాలని తపించే నాన్నలు’ అని అర్థం!

ఇరవయ్యవ శతాబ్దం ఆరంభం వరకు కొరియా కూడా కొడుకు కోసం పూజలు, పునస్కారాలు చేసిన దేశమే. కొడుకంటే వంశాంకురం. కొడుకంటే కుటుంబానికో ధైర్యం. 1980లలో అల్ట్రాసౌండ్‌ టెక్నాలజీ వచ్చాక, కొరియాలో కొడుకులు పుట్టడం ఎక్కువైంది. ఈ మాట తప్పు. కూతుళ్లు పుట్టడం తక్కువైంది అనాలి. ఇలా క్లినిక్‌కి వెళ్లేవాళ్లు. అలా అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించేవాళ్లు. కడుపులో ఉన్నది కొడుకైతే ఓకే. కూతురైతే.. నాట్‌ ఓకే. ఇలా ఉండేది మెట్టినింటివాళ్ల మెంటాలిటి. గర్భంలోనే బలవంతంగా ఆడ శిశువును చిదిమేయించేవాళ్లు. ఇలా చేయడానికి వీల్లేదని ప్రభుత్వం చట్టం తేవడంతో 1992 నాటికి ఈ ధోరణిలో కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు ఇవాళ్టికి.. ‘చక్కగా పెరిగిన ఒక కూతురు... పది మంది కొడుకులతో సమానం’ అనేంతగా, అనుకునేంతగా మారింది. ‘మీకు కనుక ఒకే ఒక చాన్స్‌ ఉంటే.. ఎవర్ని కంటారు? అబ్బాయినా? అమ్మాయినా?’ అని ఇటీవల కొరియా ఒక సర్వే జరిపింది! 18–29 ఏళ్ల మధ్య వయసున్న దంపతులలో 50 శాతం మంది.. ‘మాకు అమ్మాయే కావాలి’ అని చెప్పారు! అదేం వింత కాదు. ఆ వయసులో ఓపిక ఉంటుంది. శక్తి సామర్థ్యాలుంటాయి. కానీ 30–39, 40–49, 50–59 ఏళ్ల వయసులలోని దంపతులు కూడా సగటున 55 శాతం మంది తమకు అమ్మాయే కావాలని కోరుకోవడం చూస్తుంటే.. కొరియన్‌ ఆధునిక సమాజానికి అమ్మాయిలపై ఎంత విశ్వాసంతో ఉందో అర్థమౌతోంది.

1997 నాటి ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత దక్షిణ కొరియాలో అనేక పరిణామాలు సంభవించాయి. ఆడవాళ్లు ఉద్యోగాలకు వెళ్లడం తప్పనిసరి అయింది. ఉద్యోగం చేసే మహిళల కారణంగా కుటుంబాల్లో ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గిపోవడమే కాకుండా, అనుబంధాలూ బలపడ్డాయి. ఇది కొరియా ఊహించని పరిణామం! దాంతో.. ఇళ్లల్లో ఆడపిల్లలను పెద్ద పెద్ద చదువులకు పంపించడం, వారి చదువులకు పెద్ద మొత్తంలో దబ్బు, శ్రమ ఖర్చుపెట్టడం మొదలైంది. 2015లో దక్షిణ కొరియాలోని ప్రాథమికోన్నత పాఠశాల బాలికల్లో నాలుగింట మూడు వంతుల మంది యూనివర్సిటీలకు చేరుకున్నారు! అదే సమయంలో యూనివర్సిటీ స్థాయికి వెళ్లిన అబ్బాయిల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ తగ్గుదల ఆగేలా లేదు. ఆ పెరుగుదలా తగ్గేలా లేదు.అంటే .. కొరియాకు ఇది అభివృద్ధి కాలం. ఈ కాలం అన్ని దేశాలకూ రావాలి. పది కాలాల పాటు ఉండాలి.

మరిన్ని వార్తలు