అరబ్ భూమిలో ఆ ఇద్దరు!

30 Jan, 2014 23:34 IST|Sakshi

ఆ ఇద్దరి శక్తిసామర్థ్యాలను ప్రశంసించడానికి లేదా గుర్తు తెచ్చుకోవడానికి ‘లీడింగ్ గ్లోబల్ థింకర్స్’ జాబితా ఒక కారణం అయితే కావచ్చు గానీ, అది మాత్రమే ప్రమాణం కాదు. విజయపథం వైపు వారి ప్రయాణానికి అది మాత్రమే కొలమానం కాదు. హైఫా, నౌర అనే ఇద్దరు మహిళలు... ఏ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో పుట్టి విజయాలు సాధించి ఉంటే పెద్దగా చెప్పుకునే వాళ్లం కాదేమో. కానీ వాళ్లు విజయాలు సాధించింది, మహిళలు  విజయాలు సాధించడానికి అంతగా అనుకూలం కాని అరబ్ భూమిలో!
 
 అంతర్జాతీయ కీర్తి


ముందు హైఫా గురించి.
ఆమెకు సినిమాలు అంటే ఇష్టం.  సినిమా డెరైక్టర్ కావాలనేది  ఆశయం. ఆడపిల్లలు సినిమాలు చూడడమే అనైతికం అని భావించే సౌదీలో... ఒక ఆడపిల్ల సినిమా డెరైక్టర్ కావాలనుకోవడానికి చాలా ధైర్యమే ఉండాలి. అది హైఫాలో ఉంది. ఆమె తండ్రి కవి. బహుశా ఆయన స్వతంత్ర భావాలే కూతురుకీ వచ్చి ఉంటాయి. హైఫా ఎలాంటి నియమ నిబంధనల మధ్యా పెరగలేదు.
 
2009లో ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’ లో డెరైక్టింగ్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ సాధించించి సినిమా ఎలా తీయాలో తెలుసుకున్నారు హైఫా. అంతేకాదు... ‘వా-జె-ద’ రూపంలో తన దగ్గర కథ కూడా సిద్ధంగా ఉంది. మరి డబ్బులు కావాలి కదా! మధ్యప్రాచ్యంలో ప్రతి కళాసంస్థకు, యూరప్‌లోని ప్రతి ప్రొడక్షన్ కంపెనీకి ఆర్థిక సహాయం కోసం ఈ-మెయిల్స్ పంపారు హైఫా. అనేక ప్రయత్నాల తరువాత, అవమానాల తరువాత ఆమె ప్రయత్నం ఫలించింది. ‘వా-జె-ద’ షూటింగ్ మొదలైంది. షూటింగ్ జరిపే క్రమంలో సహజంగానే ఆమెకు రకరకాల అవాంతరాలు ఎదురయ్యాయి. కొందరైతే తమ  ఇంటి పరిసరాల్లో  షూటింగ్ చేయడానికి ససేమిరా అన్నారు.
 ‘‘సౌదీ అరేబియాలో షూటింగ్ చేయడం అనేది చట్టవ్యతిరేకం కాదు. ఎందుకంటే అక్కడ చట్టం అంటూ ఉంటే కదా’’ అంటారు హైఫా వ్యంగ్యంగా. అంతమాత్రాన ఆమె సౌదీ ప్రజలకు వ్యతిరేకం ఏమీ కాదు.

‘‘సౌదీయులకు హస్యచతురత ఎక్కువ. అది ప్రతి మాటలోనూ  కనిపిస్తుంది’’ అంటారు ఆమె. ఈ నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్‌లను కూడా గుర్తుకు తెచ్చుకొని అందులోని చమత్కారానికి నవ్వుకుంటారు హైఫా. సౌదీ అరేబియాలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న  తొలి చిత్రం ‘వా-జె-ద’. సైకిల్ తొక్కడానికి అనుమతి లేని దేశంలో ఒక బాలిక సైకిల్ కొనడానికి  పడిన పాట్లు ఈ సినిమాలో గొప్పగా చూపారు. ‘వా-జె-ద’  ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. ఇప్పుడు సౌదీలో ఆమె భావాలకు నిశ్శబ్దంగా మద్దతు లభిస్తోంది. చిత్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. సౌదీ తొలి మహిళా డెరైక్టర్ హైఫా గ్లోబల్ థింకర్‌గా నిలిచారు. ఇప్పుడు ఆ దేశంలో మరెందరో హైఫాలు తయారుకావడానికి ఒక కొత్త దారి ఏర్పడింది.
 
 కళకు పునరుజ్జీవనం

ఇక నౌరా గురించి. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.)లో సృజనాత్మక రంగాన్నీ, వేదికలను ఒంటి చేత్తో నిలిపిన ఘనత ఆమెది. యు.ఎ.ఇ.లో 1980  దశాబ్దారంభం ప్రాంతీయ నాటకాలకు బంగారు కాలం. కానీ... కాలం గడుస్తున్న కొద్దీ అక్కడ నాటకం కొడిగట్టింది. రీజనల్ డ్రామా మార్కెట్టుకు గడ్డుకాలం దాపురించింది.   ఈ క్రమంలో... ‘ఎందుకిలా జరిగింది’ అనే ప్రశ్న నౌరాను తరచు వేధించసాగేది.
 
లండన్ బిజినెస్ స్కూలులో చదువుకున్న నౌరా  యు.ఎ.ఇ. గవర్నమెంట్ గ్యాస్ కంపెనీ ‘డాల్ఫిన్ ఎనర్జీ’లో మేనెజ్‌మెంట్ విభాగంలో చేరారు. ఉన్నత ఉద్యోగం... కానీ, ఎక్కడో అసంతృప్తి. తనకు ఇష్టమైన అభిరుచులు... ఫొటోగ్రఫీ, పుస్తకాలు, రచన... ఆమెను  ఒక దగ్గర  నిలవనివ్వలేదు.
 
2007లో రెండువందల పేజీల ఒక డాక్యుమెంట్‌ను చదవడం ద్వారా ఆమె అసంతృప్తికి పరిష్కారం దొరికింది. అది ‘టూఫోర్54’ అనే ఫ్రీ మీడియా సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్.  ఆ సంస్థ తొలి సీఇవోగా ఎంపిక కావడం ద్వారా తన కోరికను నెరవేర్చుకున్నారు నౌరా. ‘టుఫోర్54’ అనేది టెలివిజన్, రేడియో, ఫిల్మ్, పబ్లిషింగ్, ఆన్‌లైన్, మ్యూజిక్, గేమింగ్, యానిమేషన్ విభాగాల అభివృద్ధికి పని చేసే ప్రభుత్వ సంస్థ.  అది వర్క్‌షాపులు నడపడమే కాకుండా అవసరమైన చోట సబ్సిడీలు కూడా ఇస్తుంటుంది.
 
‘‘ఒక అరుదైన ప్రాజెక్ట్‌కు ఆడపిల్ల సిఇవో కావడం ఏమిటి?  ఆ పోస్ట్‌కు మగవాళ్లు మాత్రమే సరిపోతారు. అబ్బాయిల మాదిరిగా అమ్మాయిలు దూసుకోపోలేరు’’ అనుకుంది అక్కడి పురుషాధిక్యసమాజం. అయినా చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది నౌరా. అయిదేళ్లలో ఆ దేశంలో  ‘క్రియేటివ్ బిజినెస్’ను కొత్తపుంతలు తొక్కించింది. ‘టుఫోర్54’ పక్కా బిజినెస్‌లాగే అనిపించినా దానిలో  కళాపునరుజ్జీవం ఉంది.  ‘సృజనాత్మక వ్యక్తీకరణ లేకుండా యు.ఎ.ఇ. ఎప్పటికీ సుసంపన్నమైన సాంస్కృతిక వికాసానికి చేరుకోదు’ అనే వాస్తవాన్ని నమ్ముతుందామె. ఆ నమ్మకానికి నౌరా ఆధ్వర్యంలోని ‘టుఫోర్54’  ఒక నిదర్శనంలా నిలుస్తోంది.
 

మరిన్ని వార్తలు