ఖాళీ బాటిల్‌

16 Jan, 2017 22:52 IST|Sakshi
ఖాళీ బాటిల్‌

మందుకొడితే అన్నీ మర్చిపోవచ్చుమందుకొడితేబాధను తొక్కేయవచ్చుమందుకొడితే కష్టాన్నికాటికి పంపేయవచ్చుఇవన్నీ ఓకే గానీ,మందుకొడితే బాధనీ, కష్టాన్నీ తుడిచేయగలుగుతారా?! నాట్‌ పాసిబుల్‌! కాసేపు ఇవన్నీ మరిపించవచ్చు కానీ ఎప్పటికీ తుడిచేయలేం. కష్టం, బాధ, దుఃఖం... ఒక వెలితిని.. ఎమ్టీనెస్‌ని, ఖాళీతనాన్ని కలిగిస్తాయి. దానిని నింపుకోవడానికి మందుకొడతారు.
బాటిల్‌ ఖాళీ అవుతుంది కానీ బాధ నిండుగానే ఉంటుంది. నిండు జీవితాలను ఖాళీ చేసుకోకండి.


తలుపు దబ దబ బాదిన శబ్దానికి ఉలిక్కిపడింది కమల. అర్థరాత్రి దాటినట్టుగా గడియారం చూపుతోంది. ఆ వచ్చింది తన భర్త నాగరాజు అయుంటాడు. ‘రోజూ ఇదే తంతు. ఎన్నేళ్లు భరించాలో ఈ ఖర్మ’ అనుకుంటూ లేచి వెళ్లి లైటు వేసి, డోర్‌ తీసింది. ఎదురుగా ముగ్గురు వ్యక్తులు కనిపించారు. ‘‘ఎవరు?’’ అంది భయంగా! ‘‘ఇతను మీ హజ్బెండేనా?’’ అన్నారు వారిలో ఒకరు. వారి చేతుల్లో వాలిపోయున్న వ్యక్తిని చూసిన కమల ‘అవును’ అన్నట్టు తలూపింది. ఇద్దరు వ్యక్తులు అతణ్ణి మోసుకొని లోపలికి తీసుకువచ్చి, సోఫాలో పడుకోబెట్టారు. ఒళ్లంతా దెబ్బలు తగిలిన ట్టు రక్తపు చారికలు కనిపించాయి. ముఖం ఉబ్బిపోయింది. వాళ్లవైపు ఆందోళనగా చూసింది ఏమైందన్నట్టు? ‘‘బాగా తాగున్నాడు. బార్‌లో గొడవ పడ్డాడు. అవే ఈ దెబ్బలు. ఫోన్‌ చేద్దామంటే అది పగిలిపోయింది. లక్కీగా జేబులో అ్రyð స్‌ ఉంది. మాదీ ఇదే దారి కావడంతో తీసుకొచ్చాం. కమల కన్నీళ్లతోనే వారికి రెండుచేతులు జోడించింది చాలా సాయం చేశారంటూ!

చావు బతుకుల ప్రయాణం
‘‘డాక్టర్, నా కొడుకుని బతికించండి. మీ కాళ్లు పట్టుకుంటాను..’’ డాక్టర్ని ప్రాధేయపడుతున్నాడు నాగరాజు. కమల భర్తని నిర్వేదంగా చూసింది. నాగరాజు బాబాయికి  ఒంట్లో బాగోలేదంటే వెళ్లాడు తన ఎనిమిదేళ్ల కొడుకుని తీసుకొని. కమల వద్దని వారించినా వినలేదు. తిరుగు ప్రయాణంలో నాగరాజు బాబాయి వారించాడు. ‘‘ఒరేయ్, నన్ను చూడటానికి వచ్చి, బాగా తాగావు. ఈ రాత్రి మత్తు లో ప్రయాణం అంత మంచిది కాదు. రేపు ఉదయానే వెళ్లు్ల’ అంటే వినిపించుకోలేదు నాగరాజు. ‘‘ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాను’’ అని కొడుకును తీసుకొని బండిమీద ఇంటికి బయల్దేరాడు. ఇంకాసేపట్లో ఇల్లు చేరుతాడనగా డివైడర్‌ను ఢీకొట్టాడు. పిల్లవాడు అంతెత్తున ఎగిరి పడిపోయాడు. కొద్దిపాటి దెబ్బలతో నాగరాజు బతికి బయటపడ్డాడు. కొడుకు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మత్తు దిగిన నాగరాజు కొడుకు పరిస్థితికి విలవిల్లాడిపోయాడు. భర్తను ఏమీ అనలేని నిస్సహాయతతో గోడకు చేరగిలబడింది కమల. పదేళ్ల జీవితం ఆమె కళ్ల ముందు కనిపిస్తోంది.

దారి తెలియని గమనం
‘తమకు పెళ్లై పదేళ్లు. మొదట్లో బాగానే ఉండేవాడు. ఆ తర్వాత తప్పతాగి రోజూ తప్పటడుగులు వేస్తూ ఇంటికి వస్తుండేవాడు. ‘ఎలా భరిస్తున్నావ్‌!’ అన్నవాళ్లే అంతా! ‘‘ఎందుకిలా తాగడం? ఇల్లు, ఒల్లు గుల్ల చేసుకోవడం కాకపోతే..’’ అని ఎన్నోసార్లు చెప్పి చూసింది. అలా అడిగినందుకు తన్నులు తింది. ఏడ్చింది. పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించింది. కానీ, నాగరాజులో ఏ మార్పూ రాలేదు. ఇద్దరు పిల్లలు. వారి జీవితాలను ఓ దారిలో పెట్టాల్సిన తండ్రి తప్పతాగి ఎక్కడో దారిలో పడిపోయి, మత్తు దిగాక ఇల్లు చేరుతుంటాడు. ఎక్కడా నిలకడలేని ఉద్యోగం. అందిన చోటల్లా అప్పులు. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తాగుడుకే మాయమయ్యాయి. ఏడాది క్రితం కాలేయం జబ్బు వస్తే ఉన్నదంతా ఊడ్చి చికిత్సకు పెట్టింది. ఎప్పటికైనా మార్పు వస్తుందేమోనని ఎదురుచూస్తున్న తనకు ఇప్పుడు ఈ పరిస్థితి...’ కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్లలో నీరింకిపోయాయి కమలకు.

కరిగిన ఆవేదన
‘‘నా తండ్రి ఓ తాగుబోతు. తాగొచ్చి మా అమ్మను కొడుతుండేవాడు. అతను ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకున్నది లేదు. నేను ప్రేమించిన అమ్మాయి మరో అబ్బాయి తో ఉండటం చూసి తట్టుకోలేకపోయాను. నాక్కావల్సిన ప్రేమ ఎప్పటికీ దక్కదు. నా పనిని ఎవరూ మెచ్చుకోరు. నా భార్య నన్ను అర్థం చేసుకోదు. మందు తాగితే మత్తు వస్తుంది. ఆ మత్తులో అన్నీ మర్చిపోవచ్చు. అందుకే తాగుతున్నాను’’ చెబుతున్న నాగరాజు కళ్ల వెంట ధారగా నీళ్లు. అంతా వింటున్న కమల విస్తుపోతూ భర్తను చూస్తోంది.
కొడుకు స్కూల్‌ టీచర్‌ నాగరాజు–కమలను పాస్ట్‌లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపీకి తీసుకువచ్చింది. కమల ద్వారా విషయం తెలుసుకున్న టీచర్‌ వారి జీవితాలు చక్కబడటానికి ఈ థెరపీ ఓ సాధనంలా పనిచేస్తుందని వివరించింది. ధ్యానప్రక్రియలో నాగరాజు తన గతజీవితాన్ని దర్శించడంతో పాటు గమనాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు.

వెలితిని పూడ్చిన ఆశ
నాగరాజును పదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పటి జీవితాన్ని దర్శించమని చెప్పాడు కౌన్సెలర్‌. ధ్యానప్రక్రియ ద్వారా తన జీవితం పదేళ్ల తర్వాత ఎలా ఉందో మస్తిష్కంలో దర్శించాడు నాగరాజు. ‘‘పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో తను ఆనందంగా ఉన్నాడు. ఇంటా బయట తనకు గౌరవం పెరిగింది..’’ తన స్థితిని చూసుకున్న నాగరాజు ఆనందంగా ‘కళ్లు తెరిచాడు.’ ‘‘నా భవిష్యత్తును అందంగా మలుచుకోవడం నా చేతుల్లోనే ఉంది సర్‌. నాలో వెలితిని నేనే పూడ్చకోగలను’’  ఆనందంతో కౌన్సెలర్‌కు, తమను థెరపీకి తీసుకువచ్చిన టీచర్‌కు కృతజ్ఞతలతో చెప్పాడు నాగరాజు.

ఆనందం వైపు మలుపు
కమల భర్త స్థితిని అర్థం చేసుకుంది. నాగరాజు ఉద్యోగంలో చేరాడు. తనూ ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భర్తకు చేదోడుగా వాదోడుగా ఉంది కమల. మెల్ల మెల్లగా అప్పులు తీరాయి. రెండేళ్లుగా నాగరాజు జీవితంలో వచ్చిన మార్పును చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. పిల్లలు స్కూల్‌కెళుతున్నారు. గత జీవితం నాగరాజుకు అవగాహన కలిగిస్తే భవిష్యత్తు దర్శనం అతనికి ఆనందంగా ఉండటం ఎలాగో నేర్పింది. వ్యసనం నుంచి దూరం చేసింది.


వెలితిని పూడ్చటానికే వ్యసనాలు
నాగరాజు థెరపీ తీసుకున్నప్పుడు ఈ జన్మతాలూకు గతంతో పాటు కిందటి జన్మలను కూడా దర్శించగలిగాడు. ప్రేమరాహిత్యం ఎన్నిజన్మలుగా అనుభవిస్తున్నాడో తెలుసుకున్నాడు. ఆ బాధలను, వెలితిని ఈ జన్మకూ మోసుకొచ్చినట్టు తెలుసుకున్నాడు. అందుకే తాత్కాలిక ఆనందం కోసం మత్తుకు అలవాటుపడ్డాడు. థెరపీ తీసుకున్నాక ఇక వాటి అవసరం లేదని గుర్తించాడు. ఈ ‘వెలితి’కి ఆడా–మగ తేడాలేదు. ‘వెలితి’గా అనిపించినప్పుడు అధికంగా షాపింగ్‌ చేయడం, అమితంగా తినడం, అతిగా మాట్లాడటం.. వంటివన్నీ చేస్తుంటారు. హానికరమైనదెప్పుడు తీసుకున్నా లోపల నుంచి అంతరాత్మ హెచ్చరిస్తుంటుంది. కానీ, వెలితి కారణంగా దానిని పట్టించుకోరు. మూల చికిత్స ఇప్పిస్తే వారిలో మార్పు తీసుకురావచ్చు. అందరూ గౌరవించడం, ప్రేమించడం వంటి భవిష్యత్తును చూసుకున్నాక ఇలాంటి వారి ఆలోచనా సరళలో తప్పక మార్పు రావడం గమనించాం. – డాక్టర్‌ హరికుమార్, ఫ్యూచర్‌ థెరపిస్ట్, బ్లిస్‌ఫుల్‌ ఫౌండేషన్, హైదరాబాద్‌

పూర్ణశ్వాసలు.. మేలైన చికిత్స
విఘ్నాధిపతి వినాయకుడి తొండం నాభివరకు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. పూర్ణశ్వాస ప్రాముఖ్యాన్ని ఈ మూర్తి ద్వారా మనం తెలుసుకోవచ్చు. యోగా, ధ్యాన ప్రక్రియలు ఇందుకే మన ప్రాచీనులు మనకు అమోఘంగా తెలియశారు. ఆల్కహాల్‌ వంటి వ్యసనాల బారి నుంచి బయట పడటానికి ‘రి–బర్తింగ్‌ థెరపీ’ ఉంది. నాసిక నుండి నాభి వరకు తీసుకునే పూర్ణశ్వాస పద్ధతి గురించి అమెరికన్‌ సైకాలజిస్ట్‌ లియోనార్డ్‌.ఆర్‌ విస్తృతంగా తెలియజేశారు. అంటే, నాసిక నుంచి నాభి వరకు తీసుకునే శ్వాసలు సంపూర్ణజీవితానికి ఎలా దోహదం చేస్తాయో తెలిపారు. గతజన్మలు నమ్మనివారికి ఇది సరైన చికిత్స. దీని వల్ల చేతన సహిత జీవన కాంక్ష వచ్చేస్తుంది. భ్రమల్లోకి వెళ్లి ‘నేను’ అనే తృప్తి కలుగుతుంది. తమ బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని చూసుకున్నప్పుడు ‘ఆశ’ చిగురిస్తుంది. దీని వల్ల వ్యసనాలకు దూరం అవడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యం అవుతుంది. దీంతో స్వీయ ప్రేరణ కలుగుతుంది.  మనిషి ప్రతి దశలోనూ ఏదో విధంగా అంతరశిశువు ప్రేమరాహిత్యంతో బాధపడుతుంటుంది. పాస్ట్‌లైఫ్‌ థెరపీ, ఫ్యూచర్‌లైఫ్‌ థెరపీలద్వారా ఆ ప్రతిబంధకాలన్నీ నిర్మూలనం అవుతాయి. స్వీయ ప్రేమ, ప్రేరణ కలుగుతాయి.

శల్యుడు మత్తు సారధ్యం
మాద్రి సోదరుడు, పాండవుల మేనమామ అయిన శల్యుడుకి రథ సారధ్యం వహించడంలో కృష్ణుడంతటి పేరుంది. దుర్యోధనుడు ఇచ్చిన విందుతో ‘మత్తు’లో మునిగిన శల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు కాకుండా కౌరవపక్షం వహించాల్సి వచ్చింది. ‘మత్తు’ కారణంగా అధర్మం వైపు ఉండాల్సివచ్చిందే అనుకోవడమే కాకుండా తన విధిని సరిగా నిర్వర్తించలేకపోయాడు. యుద్ధంలో ప్రత్యర్థులను అదేపనిగా పొగుడుతూ కర్ణుడి చావుకు తనూ ఓ కారణంగా నిలిచాడు. – నిర్మల చిల్కమర్రి

మరిన్ని వార్తలు