చదువు.. సంస్కారం...శీలవైభవం

27 Dec, 2015 05:10 IST|Sakshi
చదువు.. సంస్కారం...శీలవైభవం

విద్య - విలువలు
తెల్లవారి లేస్తే పేపర్లలో, టీవీ ఛానళ్లలో రక్తపుముద్దలను భయంకరంగా విపులీకరించి చూపడం, పైగా దానిని స్లోమోషన్‌లో అనేక పర్యాయాలు చూపించడం. ఎక్కడో ఎవడో ఉన్మాదంగా ప్రవర్తిస్తే దాన్నే పదేపదే చూపించడం... అరే. పిల్లలుంటారు, వాళ్ళకూ మనసులనేవి ఉంటాయి, లేతగా ఉంటాయి, వాటిపై ప్రభావం ఉంటుంది, అది గంట ఉండొచ్చు, కొన్ని రోజులుండొచ్చు, కొన్ని జీవితపర్యంతం ఉండొచ్చు, వారేమైపోతారని ఆలోచించగలిగినవాడు లేడు. ఆరోగ్యవంతమైన భయం... దీన్ని గురించి చెప్పేవాడే లేడు.

ఈ పరిస్థితుల్లో సంస్కారం అనే మాట మీ జీవితాల్లోకి ఎలా ప్రవేశించగలుగుతుంది. అసలు చేరే అవకాశమే ఉండదు. లేనప్పుడు ఎటువంటి పనైనా సరే, ఎంత చెయ్యగూడని పనైనా సరే, చెయ్యడానికి సిద్ధపడిపోతున్నారు. పైగా దీనికంతటికీ ఏం చెబుతున్నారంటే..  నిర్భయత్వం. ఏ భయం లేకుండా ఉండాలని. అసలు మనిషికి భయమనేది ఉండకూడదని. ఏం చెయ్యడానికైనా తెగింపు ఉండాలని అంటున్నారు. తెంపరితనానికి, తెగింపుకు మారుపేరు ఉల్లంఘనం.. గీతదాటడం. మీరు మంచిమాటలు విడిచిపెట్టి ప్రవర్తించడమే ఉల్లంఘనం.
 
నేను చట్టానికి లోబడి ఉండాలనే భయం ఒక పౌరుడికి ఉండాలి. ఉంటే.. సంస్కారం ఉంటుంది. అవతలివాడికి ప్రయోజనం లేని మాట నేను మాట్లాడకూడదనే భయం వక్తకు ఉండాలి. అప్పుడే అతని మాట సమాజానికి పనికి వస్తుంది. ఐశ్వర్యవంతుడికి నా సంపద నలుగురికీ ఉపయోగపడాలనే తాత్విక చింతన, కర్తవ్య నిష్ఠతో కూడిన సామాజిక భయం ఉండాలి. అప్పుడు వాడి ద్రవ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏ భయం లేని చోట ఎవరికి విలువ ఉంటుందో చెప్పండి.

నీకు నీవు బరువైపోతావు. సమాజానికి బరువైపోతావు. చదువుకోవడం చాలా గొప్ప విషయం, చాలా గొప్పగా చదువుకుంటున్నారు. కానీ ఆ పక్కన చేరవలసిన సంస్కారం చేరడం లేదు. దానికి కారణం పిల్లలు మాత్రం కాదు, కారణం చదువులో ఉంది. చదువుతో పాటూ దాని పక్కన ఇది చేరాలి. ఇది లేని నాడు, ఎంత చదువుకున్నా అది శోభించదు. అది మీకు ఉపయుక్తం కాదు. అది గుబాళించాలి. అది క్షీర వైభవంగా ప్రకాశించాలి. అంటే నీకు ఎప్పుడూ ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. అది లేకపోతే మీరు పాడయిపోతారని చెప్పేవాడు లేకపోవడం సమాజ దురదృష్టం.
 
చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారు కంచికామకోఠి పీఠాధిపత్యాన్ని స్వీకరించిన తొలిరోజుల్లో ఒక రోజున ఆయన మధ్యాహ్నం భిక్ష(భోజనం) చేస్తూ ‘ఈ పదార్థం బాగుంది, ఏమిటిద’ని అడిగారట. ‘‘అది తోటకూరపప్పు’’ అని వంటవాడు చెప్పాడు. ‘‘ఓ చాలా బాగుంది’’ అన్నారట. మరునాడు భిక్షలో కూడా అది కనిపించింది. ఆయన బాగుంది’’ అన్నారట. అలా రోజూ కనిపిస్తున్నది. ఐదవరోజున వంటవాడిని పిలిచి రోజూ ఎందుకుచేస్తున్నావని అడిగారు.

దానికి వంటమనిషి ‘ఈ మఠానికి మీ శిష్యులు చాలా మంది వస్తారు. వారితో చెప్పాను. మీకిష్టమని వారు ఇక్కడికి వచ్చేటప్పుడు కట్టలుకట్టలతోటకూర ఆకుకూర పట్టుకొస్తున్నారు. అందుకని రోజూ చేస్తున్నా’ అని చెప్పాడు. ఆయన విని ఊరుకున్నారట.
 
మరునాడు భిక్షసమయానికి విస్తరి ముందు కూర్చోకుండా గోశాలలోకి వెళ్లి, అక్కడినుంచి ఆవుపేడ తీసి నాలుకకు రాసుకున్నారట. ఆ పక్కరోజున కూడా ఇలాగే చేస్తుంటే మఠం మేనేజర్ చూసి పరుగు పరుగున వచ్చి ‘‘అయ్యా! మీరేం చేస్తున్నారు’’అని అడిగాడు. దానికి స్వామి వారు...‘‘నేను ప్రపంచానికి మార్గదర్శకం చేయవలసిన పీఠాధిపతిని. సత్యదండం ధరించి, కాషాయం ధరించి వెడుతుంటే సాక్షాత్

శంకరాచార్యులవారు వస్తున్నారు’ అని అంటారు. ఏ ఊరువెళ్ళినా ఈ వార్త వెడుతుంది. శంకరాచార్యులవారికి తోటకూర పప్పు ఇష్టమని కొన్నాళ్ళు తెస్తారు. ఎండాకాలం వస్తుంది. ఎక్కడినుంచో కష్టపడి తెస్తారు. ఆ తరువాత ఈ శంకరాచార్యుల వారికి తోటకూర తేవడానికి ఛస్తున్నాం’ అంటారు. పదిమందికి మంచి గురించి, నిగ్రహం  గురించి చెప్పవలసిన వాడిని, భోజనం విషయంలో నాలుక నిగ్రహం చేసుకోలేని నేను ఈ నాలుకతో దేశానికి ఏం మంచిమాట చెప్పగలను.

వంటవాడిది కాదు తప్పు, రుచికి లొంగిన నాది. అందుకే రుచికి లొంగడం మానితే తప్ప మంచిమాట చెప్పడం కుదరదని నాలుకను గోమయంతో శుభ్రం చేసుకుంటున్నాను. శుద్ధి తర్వాత మళ్ళీ పదార్థాలు తీసుకుంటాను’’ అని చెప్పి మూడు రోజుల తర్వాత ఆయన ఆహారం తీసుకున్నారు. అదీ శీలవైభవం. అదీ ఆరోగ్యవంతమైన భయం అంటే.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు