పద్మావతీదేవీ పాహిమాం

24 Nov, 2019 03:59 IST|Sakshi

కలియుగదైవం శ్రీనివాసుని హృదయేశ్వరి శ్రీపద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకుంటోంది. స్వామి తరహాలోనే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలను జరిపించుకుంటూ... నిత్యకల్యాణం... పచ్చనితోరణంలా ఆలయం భాసిల్లుతోంది. ఒకప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరు సన్నిధి వీధిలో అప్పట్లో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేవారని తెలుస్తోంది. ముందుగా తిరుమల ఆలయంలో ధ్వజారోహణం చేసి, ఆ తరువాత వాహన సేవలను తిరుచానూరు పురవీధుల్లో నిర్వహించేవారట.

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారితో సమానంగా నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ఏ వైష్ణవాలయాల్లోనూ ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరు. ఒకప్పుడు తిరుమలగిరులు అరణ్యంతో నిండి ఉండేవి. క్రూరమృగాలు అధికంగా ఉండేవి. దీనికితోడు ఎటువంటి వసతులు లేకపోవడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారని పెద్దలు చెబుతున్నారు. అయితే వెయ్యేళ్లకిందట భగవద్రామానుజాచార్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అప్పుడే శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల క్షేత్రంలోనే జరిపించాలని చెప్పడంతో నాటినుంచి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం (తమిళ) కార్తిక మాసంలో పంచమి తీర్థం నిర్వహిస్తారు. స్వామివారి నుంచి పసుపు, కుంకుమ, గాజులు త దితర మంగళకర ద్రవ్యాలతో అమ్మవారికి స్వా మివారు సారె పంపడం ఆనవాయితీ. తొమ్మిదవ రోజు పంచమితీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి.
సింహాల మోహన, సాక్షి, తిరుచానూరు

బ్రహ్మోత్సవ సేవలు
 శనివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమై, రాత్రి 7.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనంగా చిన్నశేష వాహనంపై శ్రీ పద్మావతిదేవి విహారం జరిగింది.
►24, ఆదివారం ఉదయం పెద్ద శేష వాహనం, రాత్రి హంసవాహనం
►25, సోమవారం ఉదయం ముత్యపుపందిరి, రాత్రి సింహవాహనం
►26, మంగళవారం ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి హనుమంత వాహనం
►27, బుధవారం ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనం
►28, గురువారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథోత్సవం, రాత్రి గరుడసేవ
►29, శుక్రవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ
►30, శనివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం
►డిసెంబరు 1 ఆదివారం పంచమి తీర్థం (చక్రస్నానం), సాయంత్రం ధ్వజావరోహణం

>
మరిన్ని వార్తలు