మరుజన్మనిచ్చిన మాతృమూర్తులు...

6 Aug, 2014 04:11 IST|Sakshi

నిర్మలా సావంత్... ఒక అమ్మ. వందనాపాటిల్ కూడా అమ్మే. ఈ ఇద్దరూ అందరు తల్లుల్లాగానే తమ కూతుళ్లకు జన్మనిచ్చారు. విధి ఈ ఇద్దరు తల్లులకూ ఒకేరకమైన పరీక్ష పెట్టింది.  అదీ ఒకే నెలలో... మూడురోజుల తేడాలో. విధి జూన్ ఐదవ తేదీన నిర్మలాసావంత్ కూతుర్ని పొట్టనపెట్టుకుంది. జూన్ ఎనిమిదవ తేదీన వందనాపాటిల్ కూతురి ప్రాణాలనూ తీసుకుంది. కళకళలాడుతూ కళ్ల ముందు తిరిగిన పిల్లలు  అచేతనంగా పడి ఉన్న సమయం... ఆ తల్లుల మనసు చేతనమైంది...  బంగారం లాంటి బిడ్డ మట్టిపాలు కావడానికి వీల్లేదంటూ... అవయవదానానికి సిద్ధమయ్యారు. నలుగురి ప్రాణాలను కాపాడి, ఒకరికి చూపునిచ్చారీ తల్లులు. ఈ ఇద్దరూ ఉండేది ముంబయిలోనే. కానీ, ఒకరికొకరు పరిచయమే లేదు. అయినా తల్లి మనసు వారిని ఒకచోట చేర్చింది.
 
ముంబై నగరంలోని బాంద్రాలో నివసించే నిర్మలా సావంత్-ప్రభావల్కర్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు హేమంగి. ఇంజినీరింగ్ చదివే హేమంగి ఎప్పుడూ చలాకీగా ఉండేది. తల్లితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది. నిర్మల రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించడంతోపాటు సామాజిక సేవ చేస్తుంటారు. 1994-95లో నిర్మల ముంబై మేయర్‌గా విధులు నిర్వహించారు. అడ్వకేట్ అయిన నిర్మల ప్రస్తుతం ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్’ (ఎన్‌డిడబ్ల్యూ) సభ్యురాలు. తరచు తల్లికి చేదోడుగా ఉండే హేమంగి... గడచిన జూన్ అయిదవ తేదీన కూడా నిర్మలకు కావల్సిన వివరాలను కంప్యూటర్ నుంచి తీసి ఇచ్చింది. అదే సమయంలో తలనొప్పిగా ఉందంటూ తలపట్టుకుంది.
 ఇంట్లో అందరూ మామూలు తలనొప్పిగానే భావించారు.

కానీ, ఇంతలోనే ‘‘అమ్మా... నొప్పి ఎక్కువవుతోంది. భరించలేకపోతున్నానని’ చాలా వేదనతో చెప్పింది. ప్రమాదాన్ని శంకించిన నిర్మల కూతుర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధం చేయసాగింది. అంతలోనే ‘నొప్పి భరించలేక పోతున్నా’’నంటూనే వాంతి చేసుకుని ఒక్కసారిగా సోఫాలో వాలిపోయింది హేమంగి. తీవ్ర భయాందోళనలకు గురైన నిర్మల వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి హేమంగిని తీసుకవెళ్లింది. డాక్టర్లు ఆమెను  ఐసియులోకి చేర్పించి చికిత్స ప్రారంభించారు. నిర్మల మాత్రం వాంతి చేసుకోవడం కారణంగా తన కూతురికి ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండవచ్చని భావించింది.

కానీ మెదడులోని నరాలు చిట్లి (బ్రెయిన్ హెమరేజ్) హేమంగి బ్రెయిన్‌డెడ్ అయిందని తెలిసి నిర్మలకు గుండె ఆగినంత పనైంది. ఎంత ఖర్చు అయినా సరే తన బిడ్డను రక్షించమని డాక్టర్లను వేడుకుంది. కానీ ఫలితం దక్కలేదు. ఆమెని ఓదార్చడానికి... ‘‘ఇతర అవయవాలు బాగున్నాయి. అవయవాలను దానం చేయవచ్చని డాక్టర్లు చెప్పారు. చాలా సేపు ఎటూ తేల్చుకోలేక మధన పడిన తర్వాత నిర్మల తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో...  లీలావతి ఆసుపత్రిలోని ఓ 38 ఏళ్ల వ్యక్తికి హేమంగి మూత్రపిండాన్ని అమర్చారు. ఠాణే జూపిటర్ ఆసుపత్రిలోని ఓ వ్యక్తికి కాలేయాన్ని అమర్చారు.

మరణించినతర్వాత కూడా....
‘‘దేవుడు ఆమెను త్వరగా తీసుకెళ్లాడు. తను మరణించిన తర్వాత కూడా ఇద్దరికి జీవం పోసింది’’ అంటూ కంటతడిపెట్టారు నిర్మల. మరణం తర్వాత తన అవయవాలు మరొకరికి దానం చేస్తూ అంగీకార పత్రం రాసినట్లు తెలిపారామె. అమూల్యమైన అవయవాలను కాల్చి బూడిదపాలు చేస్తుండడం వల్ల అవి ఎవరికీ అక్కరకు రాకుండా పోతున్నాయి. అందుకే ఈ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
 ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. అయితే కష్టం అనేది వద్దనుకున్నా వచ్చి పడేదే. ఆ కష్టం వచ్చినప్పుడు మనసు దిటవు చేసుకుని అవయవాలను మరొకరికి ఉపయోగపడడానికి ప్రయత్నిస్తే మరెన్నో జీవితాల్లో వసంతం నింపిన వాళ్లవుతారు. అన్నింటినీ మించిన మహోన్నత దానం అవయవదానం.

ఇద్దరిలో జీవిస్తోంది!
మహారాష్ట్రలోని లక్ష్మణ్ పాటిల్ దంపతులకు కూడా  నిర్మలా సావంత్‌కు ఎదురైన పరిస్థితే వచ్చింది. సాంగ్లీ జిల్లాకి చెందిన లక్ష్మణ్ పాటిల్ ఆయన భార్య వందన బతుకుదెరువుకోసం ముంబైకి నగరానికి సమీపంలోని ఠాణే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక బాబు. లక్ష్మణ్ గోడౌన్‌లలో హమాలి (కూలి). వీరి రెండవ కూతురు నిఖిత చదువులో చురుకైనది. స్కాలర్‌షిప్ కూడా తెచ్చుకుంది.
 ప్రతి సంవత్సరం మాదిరిగానే గడచిన వేసవి సెలవులకూ స్వగ్రామం వెళ్లారు నిఖిత కుటుంబీకులు.

పాఠశాలలు తెరవకముందే మళ్లీ ఠాణేకు రావడానికి సిద్ధంకాసాగారు. ఇంతలో ఓ రోజు... వీరి బంధువుల గూడ్స్ టెంపో ఠాణేకు ఖాళీగా వెళ్తోంది. ఆ టెంపోలో వెళ్తే దారి ఖర్చులు కలిసి వస్తాయనే ఆశ. గడచిన జూన్ 8వ తేదీ రాత్రి 10.30 నిమిషాలకు బయలుదేరారు. తెల్లవారి ఐదున్నర సమయంలో కాలాపూర్ వద్ద... ఒక్కసారిగా భారీ శబ్దం. డ్రైవర్, నిఖిత తీవ్రమైన గాయాలతో రక్తం మడుగులో ఉన్నారు. వందన చేతికి గాయం తీవ్రంగా తగిలింది. మిగతా ఇద్దరు పిల్లలకు, లక్ష్మణ్‌కు మాత్రం పెద్దగా గాయాలు కాలేదు. సమీపంలో ఉన్న ‘ఎంజిఎం’ఆసుపత్రికి వీరిని తరలించారు.

అప్పటి వరకు మాట్లాడుతున్న నిఖిత ఒక్కసారిగా ఉలుకుపలుకు లేకుండా పోయింది. డాక్టర్లు నిఖిత బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. ఇక ఆమె బతకడం కష్టమని డాక్టర్లు స్పష్టం చేయడంతో ఒక్కసారిగా వీరి దుఃఖం రెట్టింపయింది. భోరున విలపించిన పాటిల్ దంపతులు అంతలోనే గుండెనిబ్బరం చేసుకుని నిఖిత మూత్రపిండాలను దానం చేశారు. ఇలా పాటిల్ దంపతులు అంత బాధలోనూ ైధైర్యంగా తీసుకున్న నిర్ణయం రెండు నిండుప్రాణాలను కాపాడింది. దీంతో వీరి కూతురు నిఖిత ఇద్దరికి ప్రాణం పోసినట్టు. నిఖిత మూత్రపిండాలలో ఒకటి ఎంజిఎం ఆసుపత్రిలోని పేషెంట్‌కు, మరొకటి ముంబై జెస్‌లోక్ ఆసుపత్రిలోని పేషెంట్‌కు అమర్చారు.
 
అన్నట్లుగానే పేరు తెచ్చుకుంది!
పెద్దచదువులు చదివి ఐపిఎస్ అవుతానని, అందరికీ సహాయం చేసి మంచి పేరు తెచ్చుకుంటాననేది. తానన్నట్లే అవయవాలను దానం చేసి మరణించిన తర్వాత  తన పేరును సుస్థిరం చేసుకుంది.
- లక్ష్మణ్‌పాటిల్, నిఖిత తండ్రి

హేమంగి బ్రెయిన్ డెడ్ అయిందని తెలిసిన క్షణం నేను సర్వం కోల్పోయానన్న బాధ కలిగింది. ఒక్కగానొక్క కూతురు కళ్ల ముందే ఇలా కావడంతో మనోధైర్యాన్ని కోల్పోయాను. గుండెనిబ్బరం చేసుకుని హేమంగి అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అవయవాల మార్పిడి విజయవంతమైందని తెలిసినప్పుడు అంత దుఃఖంలోనూ సంతోషం కలిగింది.వారి రూపంలో నా హేమంగి ఇంకా భూమ్మీదనే ఉంది.
 - నిర్మలాసావంత్, హేమంగి తల్లి
 
హమాలి పని చేసే మేము బహుశా ఆమెను పెద్దచదువులు ఎంతవరకు చదివించేవాళ్లమో తెలియదు, కాని పదేళ్ల వయసులోనే ఆమె అందరికీ స్ఫూర్తిగా మారింది.
 - వందనా పాటిల్, నిఖిత తల్లి

మరిన్ని వార్తలు