మధుమేహాంతో  మెదడు సమస్యలు?

19 Dec, 2018 00:28 IST|Sakshi

మధుమేహంతో అనేక సమస్యలు వస్తాయని అందరికీ తెలుసుకుగానీ.. ఈ జబ్బు వల్ల మెదడుకూ ఇబ్బందులు తప్పవని అంటున్నారు టాస్మానియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఐదేళ్లపాటు తాము జరిపిన అధ్యయనంలో టైప్‌–2 మధుమేహం వల్ల ఆలోచన తీరు, జ్ఞాపకశక్తుల విషయాల్లో సమస్యలు రావచ్చునని తేలినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిషేల్‌ కల్లిసాయ తెలిపారు. మధుమేహం ఉన్న కొంతమంది వయోవృద్ధులపై పరిశోధనలు చేశామని.. మొదట్లో వారి ఎమ్మారై స్కాన్లను పరిశీలించినప్పుడు మెదడులోని కొన్ని భాగాల సైజు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని వివరించారు. ఐదేళ్ల కాలంలో వారి మెదడు పనితీరు తగ్గుదల కనిపించిందని, ఇందుకు అనుగుణంగానే మెదడు సైజు కూడా తగ్గిపోవడాన్ని తాము గుర్తించామని వివరించారు.

మధుమేహులు తమ మెదడుపట్ల కూడా కొంత శ్రద్ధ వహించాలనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని.. ఇందుకు రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా.. ఏదో ఒక రూపంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడం.. పౌష్టికాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. గుండెకు మంచి చేసే ఆహారం మెదడుకూ మేలు చేస్తుందని చెప్పారు. వీటితోపాటు నలుగురితో కలవడం, మాట్లాడటం వల్ల మెదడు ఎప్పుడూ  చురుకుగా ఉండేందుకు అవకాశముందని అన్నారు.

మరిన్ని వార్తలు