ధైర్య శిఖరారోహణ

23 Mar, 2014 23:42 IST|Sakshi
ధైర్య శిఖరారోహణ

ప్రపంచంలో దేనినైనా మనిషి ఓడించగలడు... మృత్యువును తప్ప! కొందరి విషయంలో అది హఠాత్తుగా వస్తుంది. కానీ కొందరి విషయంలో వెంటాడి, వేధించి, తరిమి తరిమి ప్రాణాలు హరిస్తుంది. షాన్ స్వార్నర్‌ను కూడా మృత్యువు వెంటాడింది. ఒకసారి కాదు... రెండుసార్లు భయంకరమైన వ్యాధి రూపంలో వచ్చింది. కానీ షాన్ బెదరలేదు. దాన్ని ఎదిరించాడు. ఓడించాడు.
 
షాన్ చాలా హుషారైనవాడు. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి అతని శరీరంలోకి క్యాన్సర్ ప్రవేశించింది. ఆ విషయం తెలియగానే అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు... అందరూ కంగారుపడ్డారు. కానీ షాన్ ఎప్పటిలా నవ్వుతూనే ఉన్నాడు. క్యాన్సర్‌తో పోరాడాడు. కొన్నేళ్ల చికిత్స తరువాత కోలుకున్నాడు. ఇక అంతా బాగైపోయింది అనుకున్న సమయంలో రెండోసారి క్యాన్సర్ దాడి చేసింది. ఈసారి ఇక బతకడనుకున్నారంతా. ‘‘ఏమో ఎవరికి తెలుసు... మళ్లీ నేనే గెలుస్తానేమో’’ అన్నాడు షాన్. అదే నిజమైంది. అతడే గెలిచాడు. క్యాన్సర్ రెండోసారీ ఓడిపోయింది.
 
షాన్ విషయంలో అంత అద్భుతం ఎలా జరిగిందో వైద్యులకు కూడా అంతు పట్టలేదు. అతిగా అలసిపోకుండా, జీవితాంతం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కానీ ఏమీ చేయకుండా కూర్చోవడం షాన్‌కి అలవాటు లేదు. అందుకే ఎవరూ చేయని ఓ సాహసానికి పూనుకున్నాడు. ఓ రోజు ఎవరెస్ట్ ఎక్కినవారి గురించి చదువుతుంటే, తానెందుకు ఎక్కకూడదు అనిపించిందతడికి. పైగా క్యాన్సర్ బారిన పడి ప్రాణాలతో బయటపడ్డవారెవరూ ఇంతవరకూ ఆ పని చేయలేదు కాబట్టి తానో కొత్త రికార్డు నెలకొల్పవచ్చని ఉత్సాహపడ్డాడు.
 
అయితే డాక్టర్లు కోప్పడ్డారు. ఎందుకంటే అతడి ఊపిరితిత్తుల్లో ఒకటి మాత్రమే సరిగ్గా పని చేస్తోంది. గతంలో ఒక ఊపిరితిత్తిలో కణితి వచ్చింది. దాన్ని తొలగించినా, ఆ ఊపిరితిత్తి సరిగ్గా పనిచేయడం లేదు. కానీ షాన్ వెనకడుగు వేయకుండా, తాను చేయాలనుకున్నది చేశాడు. క్యాన్సరొచ్చీ ప్రాణాలు దక్కించుకొన్న వారిలో ఎవరెస్ట్ ఎక్కిన తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.
 
‘మృత్యువు రావాలని ఉంటే ఎవరూ ఆపలేరు. అలాగని దాన్నే తలచుకుని నిరుత్సాహపడడంలో అర్థం లేదు, గెలవలేమని మిన్నకుండే కన్నా పోరాడి ఓడిపోవడం ఉత్తమం’ అంటాడు షాన్. తాను నమ్మే ఈ సిద్ధాంతాన్ని అందరికీ తెలియజెప్పేందుకు ‘ద క్యాన్సర్ క్లైంబర్ అసోసియేషన్’ను స్థాపించాడు. పర్వతాలెక్కుతూ నిధులను సేకరిస్తున్నాడు. క్యాన్సర్ బాధితులకు అందిస్తున్నాడు. మృత్యువునే ఎదిరించిన విజేతగా క్యాన్సర్ రోగుల్లో ధైర్యాన్ని నింపుతున్నాడు!
 

>
మరిన్ని వార్తలు