రాత్రి భోజనానికీ... మర్నాడు బ్రేక్‌ఫాస్ట్‌కీ మధ్య ఎంత టైమ్ ఉండాలి?

23 May, 2016 04:30 IST|Sakshi
రాత్రి భోజనానికీ... మర్నాడు బ్రేక్‌ఫాస్ట్‌కీ మధ్య ఎంత టైమ్ ఉండాలి?

పరిశోధన

ఉదయం వేళ తినే ఆహారాన్ని ఇంగ్లిష్‌లో బ్రేక్ ఫాస్ట్ అంటారన్నది విషయం తెలిసిందే. అంటే రాత్రి భోజనానికీ, ఉదయం టిఫిన్‌కు మధ్య వ్యవధి ఎక్కువ కాబట్టి... ఆ సమయాన్ని ఫాస్టింగ్ (ఉపవాసం)గా పరిగణించి, అది బ్రేక్ కావడన్నా బ్రేక్‌ఫాస్ట్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మహిళలు రాత్రిపూట కాస్త కొవ్వులతో కూడిన ఆహారం తిన్నప్పుడు ఈ రాత్రి భోజనానికీ, ఉదయపు ఆహారానికీ మధ్య సమయం  (ఫాస్టింగ్ పీరియడ్) కనీసం 13 గంటలు ఉంటే అది రక్తంలో చక్కెరను తగ్గించి సమర్థంగా తగ్గిస్తుందనీ, దానివల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మళ్లీ  తిరగబెట్టే ముప్పు గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు.

రాత్రి భోజనానికీ, ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మధ్య 13 గంటల వ్యవధి ఉండటం వల్ల మహిళల్లో బరువు కూడా తగ్గుతుందని అధ్యయనవేత్తలు తెలిపారు. వాళ్లంతా 27 నుంచి 70 ఏళ్ల వయసున్న 2,413 మంది మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీళ్లందరూ రొమ్ముక్యాన్సర్‌కు చికిత్స పొంది దాని నుంచి విముక్తమైన వారే. వీళ్లకు దాదాపు ఏడేళ్ల కాలంలో నిర్వహించిన ఫాలో అప్ పరీక్షలలో ఒక కీలకమైన అంశాన్ని గుర్తించారు. డిన్నర్‌కూ, బ్రేక్‌ఫాస్ట్‌కు మధ్య వ్యవధిని 13 గంటల కంటే తగ్గించిన మహిళల్లో కనీసం 36 శాతం మందిలో క్యాన్సర్ తిరగబెట్టే లక్షణాలు కనిపించాయట.

అయితే ఇలా వ్యవధి తగ్గించడం వాళ్లలో ప్రాణాంతకమైన ముప్పుగా మాత్రం పరిణమించలేదనీ, ఇది ఒక శుభవార్త అని అన్నారు. ఇక రాత్రి వేళ కంటి నిండా మంచి నిద్రతో ఈ వ్యవధి ఉండటం వల్ల గుండెజబ్బుల ముప్పు, టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని పేర్కొంటున్నారు పరిశోధకులు. ‘‘ఆహారంలో పెరిగే చక్కెల పాళ్లు కణుతుల పెరుగుదలకు మరింత దోహదం చేస్తుంటాయి. ఫాస్టింగ్ వల్ల చక్కెర అంతా దహించుకుపోతుంది కాబట్టి కణుతుల పెరుగుదల ముప్పు కూడా నివారితమౌతుంది’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు ఒకరు తెలిపారు. అధ్యయన ఫలితాలన్నీ ‘జామా ఆంకాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురతమయ్యాయి.

>
మరిన్ని వార్తలు