పాలివ్వడం మా జన్మహక్కు

7 Nov, 2017 00:14 IST|Sakshi

బహిరంగ ప్రదేశాలలో చనుబాలు ఇచ్చే హక్కు కోసం సామూహిక స్తన్య నిరసన

అది అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరం. ఒక ఆఫీసుకు ఒక తల్లి తన నాలుగు నెలల బిడ్డతో పాటు పని ఉండి వచ్చింది. ఆఫీసు రిసెప్షన్‌ ఏరియాలో కూర్చుని పాలు ఇవ్వడానికి పూనుకుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్‌ అభ్యంతర పెట్టాడు. ‘మీ వక్షోజాలు కనపడకుండా కప్పుకోండి’ అన్నాడు. ‘బహిరంగంగా పాలు ఇచ్చే హక్కు నాకుంది’ అని చెప్పిందామె. ‘కాని మీరిక్కడ ఇలా ఇవ్వడానికి లేదు. చాటుకు వెళ్లండి’ అన్నాడతను. మరి కాసేపటిలో ఆమెను అక్కడినుంచి పంపించేశాడు. కాని వెళ్లినతల్లి ఊరుకోలేదు. ఈ విషయాన్ని నలుగురికీ చెప్పింది. తనలా బిడ్డల తల్లులైన మరో పదిహేనుమందితో అదే ఆఫీసుకు చేరుకుంది. వాళ్లంతా ఆ ఆఫీసు రిసెప్షన్‌లో పిల్లలకు అందరూ చూస్తుండగా పాలు ఇవ్వడం మొదలుపెట్టారు. పిల్లల ఏడుపు, తల్లుల నిరసన... వీటి దెబ్బకు ఆఫీసు వారు దిగి వచ్చారు. ‘ఇంతకు మునుపు జరిగింది తప్పే. పాలు ఇవ్వడం మీ హక్కు’ అని క్షమాపణ పత్రం రాసి ఇచ్చారు. ఈ గోలంతా తెలియని పసికూనలు తల్లి పాలను కమ్మగా గుటకలు వేస్తూ కునుకు తీశారు.


అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఒక ఊరు.అక్కడి చర్చ్‌లో ఒక బాలింత ప్రార్థనకు వచ్చింది.చర్చ్‌లో తన బిడ్డకు పాలు ఇవ్వబోయింది.కాని దీనిని చర్చ్‌ బాధ్యులు అంగీకరించలేదు.ఆమె పాలిచ్చే పద్ధతి వల్ల ఇతరుల ఏకాగ్రత భంగమవుతుంది కనుక ఆమెను చర్చ్‌ నుంచి బయటకు వెళ్లిపోమ్మన్నారు. లేదా లేడీస్‌ బాత్‌రూమ్‌కు వెళ్లి పాలు ఇవ్వమన్నారు. ఇది ఆమెకు చాలా కోపం తెప్పించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తే 1600 మంది దానిని షేర్‌ చేశారు. ‘పోప్‌ అంతటివారే స్వయంగా చర్చ్‌లో బిడ్డలకు పాలు ఇవ్వవచ్చునని చెప్పారు. మరి ఎందుకు మమ్మల్ని పాలివ్వకుండా నిరోధిస్తున్నారు?’ అని వారు ప్రశ్నించారు.‘పిల్లలు పాలు తాగడం అంటే వారు భోజనం చేయడం లాంటిది. మనల్ని ఎవరైనా బాత్‌రూమ్‌లో భోజనం చేయమని అంటారా? మరి నా బిడ్డ బాత్‌రూమ్‌లో ఎందుకు పాలు తాగాలి?’ అని ఆ తల్లి ప్రశ్నించింది.చివరకు ఈ గొడవ మరీ పెద్దదవక ముందే చర్చ్‌వారు రాజీకి వచ్చారు. తమ చర్చ్‌లో తల్లులు పిల్లలు పాలివ్వవచ్చునని ప్రకటించారు.


ఇటీవల అర్జెంటైనాలో మరో సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ఒక బాలింత ఫుట్‌ పాత్‌ మీద తన బిడ్డకు పాలివ్వబోయింది.దానిని అక్కడి పోలీస్‌ వారించాడు. ‘పాలిచ్చేటప్పుడు నీ వక్షం కనపడుతోంది. ఇవ్వొద్దు’ అని వారించాడు. అంతేకాదు ‘చెప్పినా వినకుండా ఇచ్చావంటే నిన్ను అరెస్ట్‌ చేస్తాను’ అని కూడా హెచ్చరించాడు. అర్జెంటీనాలో బహిరంగంగా చనుబాలు ఇవ్వడం నేరం అని చెప్పే చట్టం ఏదీ లేదు. అయినా కాని ఆ పోలీస్‌ అలా బెదిరించడంతో ఆ బాలింత ఫేస్‌బుక్‌ను ఆశ్రయించింది. అది పెద్ద ప్రకంపననే సృష్టించింది. దాంతో వందలాది మంది తల్లులు అక్కడి పార్కులో తమ బిడ్డలతో సహా వచ్చి సామూహిక స్తన్యమిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారతదేశంలో తల్లిపాలు ఇవ్వడం నామోషీగా భావించే ఒక ధోరణి ఉన్న సందర్భంలో అమెరికా, యూరప్, లాటిన్‌ అమెరికాలలో స్తన్యమిచ్చే హక్కు కోసం తల్లులు నిరసనలకు దిగడం ఎక్కువయ్యింది.
నిన్నగాక మొన్న అంటే నవంబర్‌ 3వ తేదీన కొలంబియాలోని బొగొటా నగరంలోని ఒక పార్కులో రెండు వేల మంది తల్లులు ఒక పార్కులో చేరి కొన్ని గంటల పాటు బహిరంగంగా (వక్షం కనిపించేలాగా) బిడ్డలకు పాలు ఇస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.‘పిల్లలకు పాలు ఇవ్వడం బూతు కాదు’ అని వారు చేస్తున్న ప్రచారం.‘మర్యాదస్తులు’ పెరిగిపోవడం, ‘సంస్కారాన్ని’ వ్యాఖ్యానించడం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో ఒక తల్లి తన బిడ్డకు ఏ ఆచ్ఛాదన లేకుండా పాలు ఇవ్వడం ఒక ‘కుసంస్కారం’గా భావించడానికి ఆయా దేశాలలోని తల్లులు సహించడం లేదు.‘మన నాగరికత ఎంత వరకూ చేరిందంటే స్తన్యానికి మాతృత్వ భావన పోయి కేవలం శృంగారభావన మాత్రమే మిగిలింది’ అని ఒక తల్లి వ్యాఖ్యానించింది.భారతదేశంలో పల్లెల్లో అందరూ చూస్తుండగా పాలివ్వడం తల్లులు, చూపరులు తప్పుగా భావించరు. కాని పట్టణాల్లో, నగరాల్లో ‘బ్రెస్ట్‌ఫీడ్‌ రూమ్స్‌’ అని కొన్ని తయారయ్యాయి. లేదంటే చాటుగా ఇచ్చే పరిస్థితి అలిఖితంగానే ఉంది. లేదా మనకు చీరకట్టు వల్ల పవిట ఒక సౌలభ్యం కావడంతో పవిట చాటు నుంచి పాలు ఇచ్చే సౌకర్యం ఉంది. కాని పాశ్చాత్య వస్త్రధారణలో వక్షాన్ని చాటు చేసుకోవడం అన్నిసార్లు సాధ్యం కాదు. వక్షం కనపడుతుండగా పాలు ఇవ్వడానికి బహిరంగ ప్రదేశాలలో కొందరు తప్పు పట్టడం, అభ్యంతరం వ్యక్తం చేయడం తల్లులు సహించలేకపోతున్నారు. పాలివ్వడం మా జన్మహక్కు అంటున్నారు.


ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడితే ఆగి వెళ్లడం మనిషి అలవాటు చేసుకున్నాడు. తల్లి తన బిడ్డకు పాలు ఇస్తుంటే ఆమెకు సౌకర్యాన్ని కలిగిస్తూ తన దారిన తాను ఎందుకు వెళ్లలేకపోతున్నాడు?‘బిడ్డకు ఆకలి వేసే టైమే పాలిచ్చే టైమ్‌. అది ఎక్కడ ఎలా ఉంటే అక్కడ ఇచ్చి తీరాల్సిందే’ అని ఒక పసిబిడ్డ తండ్రి పాలిస్తున్న తన భార్యను చూస్తూ అన్నాడు బొగొటా నగరం పార్కులో.బిడ్డ ఆకలితో ఉన్నా వక్షం కనిపిస్తుందన్న భయంతో పాలు పట్టకుండా ఉండటం కంటే దారుణమైన సంగతి మరొకటి లేదని తల్లులు వాదిస్తున్నారు.‘వక్షం కనిపించేలా పాలు ఇచ్చే మా హక్కును ఎవరూ కాదనలేరు’ అని వారు నినదిస్తున్నారు.అయినా కొన్ని రెస్టారెంట్లు, పబ్లిక్‌ ప్లేసుల నిర్వాహకులు, ప్రయాణ సాధనాల ఆపరేటర్లు ఈ విషయంలో తమ సంస్కార స్థాయిని చెక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలు చెబుతున్నాయి.భారతదేశంలోని నగరాలలో ఉన్న తల్లులు ఇంకా ఈ సమస్యను సమస్యగా చెప్పే పరిస్థితిలో లేరు. ‘సాంస్కృతిక రక్షణ’ పెచ్చు మీరితే వారూ గొంతెత్తే రోజు దూరంలో లేదు.ఒక్కటి మాత్రం నిజం– తన బిడ్డకు పాలివ్వకుండా తల్లిని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఉండదు. కరెక్ట్‌ అవ్వాల్సింది మనమే... తల్లులు కాదు.

ఫేస్‌బుక్‌కు బడితెపూజ
ఫేస్‌బుక్‌లో కొన్నిసార్లు తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చే ఫొటోలను పోస్ట్‌ చేస్తే ఫేస్‌బుక్‌ తన నియమావళిలో భాగంగా వాటిని తొలిగించడం కొంతమంది తల్లులకు నచ్చలేదు. ‘అవి అశ్లీలం కిందకే వస్తాయి’ అనే ఫేస్‌బుక్‌ వాదనను వారు తిరగ్గొట్టారు. ‘ఒక డేటింగ్‌ కంపెనీవాళ్ల యాడ్‌లో అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని మీరెందుకు తీసేయలేదు’ అని వారు ప్రశ్నించారు. అంతే కాదు వేలాది మంది తల్లులు ఒక విజ్ఞాపనను సంతకం చేసి ఫేస్‌బుక్‌కు పంపారు. దాని సారాంశం ‘బిడ్డలకు పాలు ఇవ్వడం ఆశ్లీలం కాదు’ అని చెప్పడమే.

మరిన్ని వార్తలు