వధువు కావాలట ఇలా ఉండాలట!

16 Sep, 2018 01:49 IST|Sakshi

మ్యాట్రిమోనియల్‌ యాడ్స్‌ మనకు కొత్తేం కాదు. కాని ఈలాంటి యాడ్‌ను కనివినీ ఎరగం. మైసూరుకు చెందిన 37 ఏళ్ల క్షత్రియ పురుషుడికి 26 ఏళ్లలోపు వధువు కావాలట! ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ చేస్తున్నాడట. నెలకు ఎనిమిది అంకెల సంపాదన ఉన్న అతనికి అందమైన అమ్మాయి కావాలట. ఆ అమ్మాయికి స్మోకింగ్‌ అలవాటు ఉండకూడదట. స్త్రీవాది కాకూడదట. ఇంకా.. ఆమెకు రుచిగా వంట చేయడం వచ్చి ఉండాలి. ఇంతకు ముందెప్పుడూ పెళ్లయి ఉండకూడదు. లేదా, పిల్లలూ ఉండకూడదు. కుల, మత, జాతి పట్టింపులు లేవు. కట్నమూ అవసరం లేదు.. అన్నది ఆ ప్రకటన సారాంశం.

వధువు  తాజా ఫోటోగ్రాఫ్‌తోపాటు వివరాలనూ పంపడానికి మెయిల్‌ ఐడీ కూడా ఇచ్చాడు.   ఈ పెళ్లి ప్రకటన సోషల్‌ మీడియాలోని అందరి ఆగ్రహానికీ గురై, వైరల్‌ అయింది. ముఖ్యంగా ఆ ప్రకటనలోని ‘26 ఏళ్లలోపు వధువు’, ‘నాన్‌ ఫెమినిస్ట్‌’, ‘గుడ్‌ కుక్‌’, ‘ఇంతకుముందు పెళ్లయి ఉండకూడదు, పిల్లలు ఉండకూడదు’.. వంటివన్నీ వివాదాస్పదమై చాలా మందికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఆడవాళ్ల గురించి 37 ఏళ్ల ఆ ముదురు వరుడికి ఉన్న అభిప్రాయాలు చూసి కొందరు ఖిన్నులయ్యారు. కడిగిపారేద్దామని అతని ఇచ్చిన మెయిల్‌ ఐడీకి మెయిల్‌ పెట్టారు. ఇంకొందరేమో ఫోన్‌ నంబర్‌ కనుక్కొని ఫోన్‌ చేసినట్టు కూడా తెలిసింది. అలా ఫోన్‌ చేసినవాళ్లందర్నీ దుర్భాషలాడుతున్నాడట సదరు ప్రకటనదారుడు.

సోషల్‌ మీడియాలోని ఇంకో వ్యక్తి అయితే, తను అమ్మాయిగా ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసుకుని వరుడి ప్రకటనకు రిప్లయ్‌ పెడుతూ.. ఇలా  మెయిల్‌ పంపాడు వయసు 25. (ఎందుకంటే మీరు పెడోఫైల్‌ కదా.) ప్రస్తుతం అధికార పార్టీలో పనిచేస్తున్నాను. చాలా గోవులను రక్షిస్తున్నాను (మీ ఎనిమిది అంకెల సంపాదనను బీట్‌ చేశాను కదా). మంచి జాతీయవాదిని, యాంటి ఫెమినిస్ట్‌ను కూడా. జెండర్‌. మహిళనే. మీ మనసుతో చూస్తే అందంగానే కనపడతాను. కొంచెం నల్లగా ఉంటా. కానీ బాగా పౌడర్‌ రాసుకుంటా. కులం. మీరు అడగలేదు. కాని మీదేం కులమో చెప్పారు. ఆ ఇండికేషన్‌ అర్థమైంది. ఫోటో ఎందుకు? ఎలా ఉంటే అలాగే యాక్సెప్ట్‌ చెయ్‌. ఆల్‌  ది వర్స్‌›్ట టు యూ! ఈ రిప్లయ్‌కు ప్రకటనదారుడూ ఘాటుగా స్పందించినట్టు ఆ స్పందనను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

అయితే వీటిల్లో ఏవి నిజమో.. ఎంత నిజమో నిర్థారణ జరగలేదు. అందుకే ఒక వెబ్‌సైట్‌లో వచ్చిన విషయాన్ని యథాతథంగా ఇక్కడ ఇచ్చాం. కాని వరుడి మ్యాట్రిమోనియల్‌ ప్రకటన పట్ల అందరూ ఆగ్రహంతో ఉన్న మాట మాత్రం వాస్తవం. మనమెటు పోతున్నాం? అంటూ ఆ పెళ్లి ప్రకటన చేసిన వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు సాక్షాత్తు సుప్రీంకోర్టే బ్రిటిష్‌కాలంనాటి చట్టాన్ని సడలించి ఎల్‌జీబీటీ హక్కులనూ గౌరవించాలని చెప్తున్న టైమ్‌లో ఇలాంటి ప్రకటనలేంటి? ఆ కోరికలేంటని మండిపడుతున్నారు. అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని.. అలాంటి ఆలోచనలకు విరుద్ధంగా క్యాంపెయిన్‌ నిర్వహించాలనీ అంటున్నారు.

మరిన్ని వార్తలు