ఆ చిన్నారే ఈ పెళ్లికూతురు

24 Jun, 2020 07:46 IST|Sakshi
వివాహ వేడుకలో పెళ్లి కూతురుగా సిమ్రాన్‌ (మొన్న సోమవారం)

ముంబై పేలుళ్లు.. ఢిల్లీ పేలుళ్లు దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు.. లుంబినీ పేలుళ్లు! ప్రతి పేలుడూ.. రక్తంతో ఒక డేట్‌ రాసి పోతుంది.రేపు జూన్‌ 25 న సిమ్రాన్‌ పెళ్లి.పసుపు రాసిన ఈ డేట్‌ను కూడామనం గుర్తుంచుకోవాలి.పన్నెండేళ్ల క్రితం ఢిల్లీ పేలుళ్లలో..  తండ్రిని కోల్పోయిన చిన్నారే సిమ్రాన్‌!

జీవితంలోని మంచి విషయాలు మంచి మనుషుల్ని చూసీ చూడనట్లు తప్పుకుని పోవు. సిమ్రాన్‌ జీవితంలో ఇప్పుడొక మంచి విషయం జరుగుతోంది. రేపు 25న ఆమె వివాహం. వరుడిది పంజాబ్‌. కండిషన్‌ పెట్టి మరీ సిమ్రాన్‌ పెళ్లి చేసుకుంటోంది. పెళ్లయ్యాక కూడా తను చదవాలి. అదీ కండిషన్‌. పద్దెనిమిదేళ్లు సిమ్రాన్‌కి. అంతా తనకు ఇష్టమైనట్లే జరిపించుకుంటోంది. మారుతండ్రి చెయ్యి పట్టుకుని వెళ్లి, పెళ్లి బట్టల షాపింగ్‌ చేసుకొచ్చింది. నచ్చిన దుస్తులు, నచ్చిన ఆభరణాలు కొనిపించుకుంది. పెళ్లితేదీని కూడా తనే ఫిక్స్‌ చేయించుకుంది. డిగ్రీ పరీక్షలు ఉన్నాయి సిమ్రాన్‌కి. వాటికి అడ్డుపడకుండా ముహూర్తం తనే పెట్టించుకుంది. ఇక పెళ్లికి సంప్రదాయంగా ధరించవలసిన ఎరుపు రంగు ‘వెడ్డింగ్‌ డ్రెస్‌’ని పక్కన పెట్టి, లేత గులాబీ రంగును ఎంపిక చేసుకుంది. ఎరుపు సిమ్రాన్‌కు ఇష్టం లేదు!

ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో తండ్రి అశోక్‌ మరణించిన రోజు తొలిసారి ఆమె ఎరుపు రంగును దగ్గరగా చూసింది. ఆయన ఒంటి మీదంతా ఎరుపే. భయపడి దూరంగా జరిగింది. హరిశ్చంద్‌ తాతయ్య ఒంటి మీద ఎరుపు. సరోజ ఆంటీ ఒంటి మీద ఎరుపు. యశోద ఆంటీ ఒంటి మీద ఎరుపు. వాళ్లతోపాటు ఆ రోజు మరో ఏడుగురు కుటుంబ సభ్యులు పేలుళ్లకు తునకలైపోయారు. తల్లి కమలేశ్వతిని రెండు రోజుల వరకు సిమ్రాన్‌ని చూడనివ్వలేదు ఆమె బంధువులు. కోలుకున్నాక, కట్లు కట్టాక, ఇంటికి తెచ్చాక మాత్రమే సిమ్రాన్‌ని అమ్మ మీదకు వదిలి పెట్టారు. తండ్రి చితిమంటల్ని చూసినరోజు.. ఆ రోజంతా సిమ్రాన్‌ తన తల్లిని గట్టిగా పట్టుకుని వదిలిపెట్టలేదు. అప్పటికి సిమ్రాన్‌ తల్లి వయసు 27. ఆమెను ఆమె తల్లి (సిమ్రాన్‌ అమ్మమ్మ) చాలారోజుల వరకు ఒడిసి పట్టుకునే ఉంది. చిన్న చప్పుడైతే సిమ్రాన్, కమలేశ్వతి ఎవరి తల్లుల ఒళ్లోకి వారు వచ్చేస్తున్నారు! కనికరం లేని ఆనాటి రోజు ఏళ్లపాటు వారిని కలవర పెడుతూనే ఉంది. 2008 సెప్టెంబర్‌ 13 శనివారం సాయంత్రం ఢిల్లీలో 6 గం. 7 ని.లకు మొదలైన వరుస పేలుళ్లు అరగంట వ్యవధిలో నాలుగు చోట్ల రక్తపాతం సృష్టించాయి. మొదట సిమ్రాన్‌ వాళ్లున్న జాఫర్‌ మార్కెట్‌ ప్రాంతంలోనే పేలుడు సంభవించింది. ఆటో రిక్షాలోని సిలిండర్‌ బాంబు పేలి సిమ్రాన్‌ తండ్రితోపాటు పదకొండు మంది చనిపోయారు.

తండ్రి చితివైపు చూస్తూ తల్లిలో ఒదిగిపోతున్న సిమ్రాన్‌ (2008)
సిమ్రాన్‌ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సోమవారం ‘హల్దీ సెర్మనీ’లో పసుపు బట్టల్లో, పసుపు రాసిన ముఖంతో సంతోషంగా ఉంది. తండ్రి చనిపోయిన నాటి నుంచీ.. టెన్త్‌ పాస్‌ అయినప్పుడు తప్ప.. ఈ పన్నెండేళ్లలో ఏరోజూ ఇంత ఆనందంగా లేరు సిమ్రాన్, ఆమె తల్లి. కూతుర్ని మెడిసిన్‌ చదివించాలని అశోక్‌ కోరిక. ఆయన కోసం ప్రతి క్లాసునూ మెడిసిన్‌ చదివినట్లే చదివింది సిమ్రాన్‌. కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు మాత్రం కమలేశ్వతి తట్టుకోలేక వేరే గదిలోకి వచ్చి ఏడ్చేసింది. కూతురే వెళ్లి ఆమె కన్నీళ్లు తుడిచింది. ఎంత లేదన్నా రేపు పెళ్లిరోజు ఆ తల్లిని ఇంకాస్త జాగ్రత్తగా పట్టుకోవలసిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతం పెళ్లికొచ్చిన అతిథులు ఇంట్లో ఉన్నారు. వాళ్లెవరూ ఆనాటి క్రూరమైన రోజును మాటల్లోకి రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ‘‘సిమ్రాన్‌.. అన్నీ కొనుక్కున్నావా?’’ అని పెళ్లి కూతుర్ని అడుగుతున్నారు. ‘‘నాన్న నా పెళ్లికి అన్నీ అమర్చారు’’ అని చెబుతోంది సిమ్రాన్‌. నాన్నంటే మారు తండ్రి. హీరాలాల్‌ ఆయన పేరు. సిమ్రాన్‌కు పదకొండేళ్ల వయసులో బంధువులంతా ఒత్తిడి తెచ్చి కమలేశ్వతికి మళ్లీ పెళ్లి చేశారు. సిమ్రాన్‌ ఏడేళ్ల తమ్ముడు ఆయన కొడుకే.

వివాహ వేడుకలో పెళ్లి కూతురుగా సిమ్రాన్‌ (మొన్న సోమవారం)
సిమ్రాన్‌ మాటలు భలే ఉంటాయి. జీవిత సత్యాలను నోటి మాటగా చెప్పేస్తుంటుంది. ‘‘జీవితంలోని మంచి విషయాలు మంచి మనుషులను చూసీ చూడనట్లు తప్పుకుని పోవు’’ అనే మాట సిమ్రాన్‌దే. ఇంకొక మాట కూడా అంటుంది తను.. ‘‘జీవితం మన నుంచి ఒకటి తీసుకున్నప్పుడు, ఇంకొటి ఇస్తుంది’’ అని. జీవితం ఆమె నుంచి తీసుకున్న ఆ ఒకటి ఆమె తండ్రి అశోక్‌. జీవితం ఆమెకు ఇచ్చిన ఆ ఇంకొకటి ఆమె మారుతండ్రి హీరాలాల్‌.

మరిన్ని వార్తలు